హైదరాబాద్ : సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, పలువురు ప్రముఖులు సభలో పాల్గొనున్నారు. సామాజిక న్యాయ తెలంగాణ ను సాకారం చేయడానికి కవిత సహా 10 వేల ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు సరూర్ నగర్ సభకు తరలివస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సాధికారత లక్ష్య సాధన కోసం కవిత ఈ వేదిక నుంచి ప్రకటన చేస్తారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిలో మార్పు తీసుకురావడానికి తాము ఎలాంటి ఎజెండా తీసుకుబోతున్నామో స్పష్టత ఇవ్వనున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత శక్తి వంతులైన వలస పాలకుల పీడన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహా లక్షలాది మంది ఉద్యమించారు. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ సాధన కోసం జయశంకర్ స్ఫూర్తితో కవిత ఉద్యమించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణ సాకారం కోసం మళ్లీ పోరాడాల్సిందేనన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాటలతో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత స్ఫూర్తి పొందారు. ఆయన ఆశయాల సౌధమైన సామాజిక న్యాయ తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే తన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయ తెలంగాణ అనే నినాదంగా మిగిలిపోకూడదు.. అట్టడుగు వర్గాలపై లిప్ సింపతీతో సరిపెట్టకూడదు.. ఒక మాట చెప్తే వంద శాతం ఆచరించాలని శపథం తీసుకున్నారు.
రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతిలో ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీలో అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే 22 మంది బీసీ నాయకులకు అవకాశం ఇచ్చారు. తొమ్మిది లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే అందులోనూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ అనుబంధంగా నాలుగు విభాగాలను ప్రకటిస్తే అందులో కీలమైన మహిళ, విద్యార్థి విభాగాల అధ్యక్షులుగా బీసీలకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్ లోనూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులకు అవకాశాలు కల్పిస్తామని బలంగా చెప్తున్నారు.
ఇది కూడ చదవండి-
తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సామాజిక న్యాయ తెలంగాణాను సాకారం చేసుకొనే దిశగా సరూర్ నగర్ వేదిక నుంచి కల్వకుంట్ల కవిత గారు మొదటి అడుగు వేయబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కవిత చేయబోతున్న శంఖారావం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేలా తెలంగాణ రక్షణ రాబోయే రోజుల్లో పని చేయబోతున్నది.
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని సభా ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, తన జీవితం మొత్తాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, సామాజిక అంతరాలను రూపుమాపేందుకు కృషి సాగించిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, మొదటి మహిళా ఉపాధ్యాయులు మాతా సావిత్రి భాయి పూలే, అట్టడుగు వర్గాల ప్రజలు పేదరికం, పీడన నుంచి బయట పడేందుకు విద్య మాత్రమే ఆయుధమని నమ్మి పాఠశాలలు ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్రపటాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు.

నిజాం రాజ్యంలో దేశ్ ముఖ్ లు, దొరల దురహంకారంపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య, నిజాం సింహాసనాన్ని వణికించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి సాగించిన మాన్యశ్రీ కాన్షి రామ్, జల్ – జంగిల్ – జమీన్ పై హక్కుల కోసం పోరుసగించిన యోధుడు కొమురం భీమ్, నిఖార్సయిన తెలంగాణవాది, ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవి తృణ ప్రాయంగా వదులుకున్న బహుజన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు.
తొలి తరం తెలంగాణ ఉద్యమకారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి దళిత మహిళా ఎమ్మెల్యే, మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్ టీఎన్ సదా లక్ష్మీ, నిజాం నిరంకుశత్వంపై పోరాడిన బహుజన యోధుడు పండుగ సాయన్న, బహుజన గెరిల్లా యోధుడు వడ్డెర ఓబన్న, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్, ఉమ్మడి ఏపీ నుంచి లోక్ సభకు ఎన్నికైన మొదటి మహిళా నాయకురాలు, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సంగం లక్ష్మీ బాయి, అక్షర యోధుడు, రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టిన వీరుడు షోయబుల్లాఖాన్, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆద్యుడు, కుల – వర్గ పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ కవి, కార్మిక నాయకులు మఖ్దూం మొహియుద్దీన్ ల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు.

సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ప్రాంగణం
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు
సభా ప్రాంగణంలో పలువురు ప్రముఖుల ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ
తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే మహా యజ్ఞానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అంకురార్పణ చేయబోతున్నారు
సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మాణం చేసే కర్తవ్యాన్ని తన భుజానికి ఎత్తుకున్నారు.. సబ్బండ వర్గాల వికాసం.. సాధికారతే లక్ష్యంగా గురువారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ” నిర్వహిస్తున్నారు
సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు
సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయబోతున్నారు
