హైదరాబాద్ : తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండవ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
శనివారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ‘విశ్వేశ్వరయ్య భవన్’లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, SIR రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ అధ్యక్షతన జరిగిన SIR ఫేజ్-2 రాష్ట్రస్థాయి వర్క్‌షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ SIR ప్రక్రియ ముగియడానికి ఆగస్టు 10 వరకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నందున, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన వారందరితో ఫారమ్-6 ద్వారా కొత్త ఓటు నమోదును వేగంగా పూర్తి చేయించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Also Read-
గడువు తర్వాత కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ల పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, ఆభ్యంతరాల దాఖలు వంటి కీలక పనులు ఉంటాయని స్పష్టం చేశారు. ఫారమ్-7 (ఓట్ల తొలగింపు), ఫారమ్-8 (సవరణలు) సరిగ్గా దాఖలు చేయడం, నోటీసులకు ఆధారాలతో చట్టపరమైన సమాధానాలు ఇవ్వడం, పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ ప్రక్రియను పరిశీలించడంలో BLA-1లు మరియు లీగల్ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల జాబితా పారదర్శకత చాలా ముఖ్యమని, ఆ బాధ్యతను బీజేపీ ప్రతినిధులు సమర్థంగా నిర్వహించాలని ఆయన కోరారు.
