హైదరాబాద్ : భారతీయ రైల్వేలు దేశీయ కంటైనర్ రవాణాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్ (ఎక్స్‌క్లూజివ్ కంటైనర్ రైల్ టెర్మినల్) అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ దిశగా, జోన్ యొక్క సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే కూడా వివిధ వినియోగదారుల కేంద్రీకృత కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది.
భారతీయ రైల్వే చొరవకు అనుగుణంగా, పారిశ్రామిక సమూహాలు మరియు ఉత్పత్తి కేంద్రాలకు మరింత చేరువగా సమర్థవంతమైన లాజిస్టిక్స్ పరిష్కారాలను సృష్టించేందుకు దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ డివిజన్‌లోని వెల్దుర్తి గూడ్స్ షెడ్‌ను 10.6.2026న ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్ (ఈ.సి.ఆర్.టి ) గా నోటిఫై చేసింది. ఈ చొరవ యొక్క లక్ష్యం, నూతన కంటైనర్ రవాణా మార్గాలను ఆకర్షించడం మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన, సుస్థిరమైన సరుకు రవాణా పరిష్కారాలను అందించడం. హైదరాబాద్ డివిజన్‌లో ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్‌గా నోటిఫై చేయబడిన మొదటి గూడ్స్ షెడ్ ఇదే. ఇది బహుళ రవాణా (మల్టీమోడల్ లాజిస్టిక్స్) వ్యవస్థ విస్తరణకు కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి విశేషంగా దోహదపడనుంది.

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వెల్దుర్తి గూడ్స్ షెడ్ 2026 జూన్ 25న తొలి కంటైనర్ రేక్‌ను విజయవంతంగా లోడ్ చేసి మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. ఈ కంటైనర్ రేక్‌ను ఉత్తర రైల్వేలోని ఫిరోజ్‌పూర్ డివిజన్ పరిధిలోని పంజాబ్ రాష్ట్రంలోని ఫిల్లౌర్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐ.సి.డి)కు రవాణా చేశారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో భారతీయ రైల్వేల అనుసంధానం మరింత బలోపేతం కావడంతో పాటు, వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలను సజావుగా అనుసంధానించగల రైల్వేల సామర్థ్యాన్ని చాటిచెబుతోంది.
Also Read-
తొలి రైలు రేక్ 2,760 టన్నుల ముడి ఇనుమును (పిగ్ ఐరన్‌ను) రవాణా చేసి, వెల్దుర్తి గూడ్స్ షెడ్ సరుకు రవాణా విభాగంలో కొత్త వస్తువుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా, పునర్వ్యవస్థీకరించబడిన దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కంటైనర్లలో పిగ్ ఐరన్‌ను లోడ్ చేసిన మొట్టమొదటి మరియు ఏకైక గూడ్స్ షెడ్‌గా వెల్దుర్తి నిలిచింది. ఇది ఉక్కు రంగానికి కొత్త అవకాశాలను కల్పించడంతో పాటు, కంటైనర్ ఆధారిత రైల్వే సరుకు రవాణా వ్యవస్థ యొక్క సౌలభ్యం, సామర్థ్యం మరోసారి స్పష్టమైంది.

ఈ సరుకు రవాణా ద్వారా దాదాపు రూ. 59 లక్షల అంచనా ఆదాయం సమకూరింది. ఇది వెల్దుర్తి రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఈసీఆర్‌టీ యొక్క పెరుగుతున్న సామర్థ్యాన్ని, అలాగే అధిక విలువైన సరుకు రవాణాను ఆకర్షించడంలో దాని నైపుణ్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇదే ఉత్సాహాన్ని మున్ముందు కూడా కొనసాగించేందుకు గాను, ఈ టెర్మినల్ నుండి ప్రతి నెలా మూడు కంటైనర్ రేక్‌లను లోడింగ్ చేసేందుకు కాన్కోర్ అంగీకరించింది. ఇది ఈ ప్రాంతంలో నిరంతర సరుకు రవాణా వృద్ధికి మరియు పెరిగిన ఆర్థిక కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజన్ కొత్త రవాణా సరుకు లోడింగ్‌ను విజయవంతంగా సాధించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే, దక్షిణ మధ్య రైల్వే కీర్తి పతాకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులు, సిబ్బంది అందరికీ సూచించారు.
