హైదరాబాద్ : రిజర్వేషన్ లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్తంగా బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలోనూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కేంద్రం అందుకు అంగీకరించకపోతే తెలంగాణలో జనగణనను నిర్వహించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
జంతర్ మంతర్ వద్ద ఓబీసీ సంఘాల ధర్నా
జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ తో పాటు డ్రాప్ డౌన్ బాక్స్ ఉండాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాటం చేయాల్సి ఉందన్నారు. జనగణన కోసం కేంద్రం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుందని.. ఇంత ఖర్చు చేసి కూడా ఓబీసీల లెక్క ఎంత ఉందో తేల్చకపోవడం సరికాదన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని డిమాండ్ చేస్తూ నవంబర్ లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓబీసీ సంఘాలు నిర్వహించే ధర్నాలో తాము పాల్గొంటామని ప్రకటించారు. మహిళ బిల్లు కోసం తాము ఢిల్లీలో పోరాడి విజయం సాధించామని.. ఇప్పుడు ఓబీసీల అంశంలోనూ అదే తరహాలో ఉద్యమించి కేంద్రం మెడలు వంచి జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టేలా చేస్తామన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేయాలి
కుల గణనలో ఓబీసీ కాలం చేర్చే విధంగా కేంద్రంపై తమిళనాడు తరహాలో ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని అన్నారు. అక్కడి ప్రభుత్వం ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసినట్టే మనం కూడా చేయాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. బీసీల విషయంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది లేదని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీని నిలబెట్టుకోవాలని తాము ఉద్యమిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ బిల్లు కేంద్రం వద్ద ఆగిపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. బీసీ బిల్లుకు ఆమోదం కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని సీఎం ప్రకటించారని.. ఆ తర్వాత సీఎం ఢిల్లీకి 30 సార్లకు పైగా వెళ్లినా అఖిలపక్షాన్ని మాత్రం తీసుకెళ్లలేదని చెప్పారు. జనగణనలో బీసీ కుల గణన అంశంలోనైనా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేయాలన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరముందన్నారు. కేంద్రం మన డిమాండ్ కు ఒప్పుకోకపోతే రాష్ట్రంలో జనగణన చేపట్టకుండా అడ్డుకోవాలని.. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ప్రభుత్వానికి సహకరిస్తారని అన్నారు.
Also Read-
రిజర్వేషన్లు తీసేసే కుట్ర
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కు రిజర్వేషన్లంటే గిట్టదని.. ఇప్పుడున్న రిజర్వేషన్లనే తీసేసే కుట్ర చేస్తున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కుల గణనలో ఓబీసీ ల లెక్క తేలితే వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని కావాలనే ప్రత్యేక కాలమ్ పెట్టటం లేదని చెప్పారు. బీసీ కులాలకు సంబంధించి ఒకే రాష్ట్రంలో ఒకే కులానికి నాలుగైదు పేర్లు ఉంటాయని.. ఇక దేశ వ్యాప్తంగా అయితే చాలా పేర్లుంటాయని చెప్పారు. అలాంటి పేర్లున్న కులాల జనాభా మొత్తాన్ని ఒకే కులం జనాభాగా చూపించాలన్నారు. లేదంటే బీసీల కులాల జనాభా తక్కువగా ఉండే పరిస్థితి వస్తుందన్నారు. రిజర్వేషన్లను దక్కించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ లతో కలిసి అందరం పోరాటం చేయాలన్నారు. బీసీల పోరాటంలో ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని పోవటమేమిటంటూ కొందరు వింతగా మాట్లాడుతుండటం సరికాదని చెప్పారు. రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. దేశ ప్రధాని మోడీ పేరుకు మాత్రమే ఓబీసీ అని..ఆయన ఓబీసీల కోసం చేసిందేమీ లేదన్నారు. కనీసం మనల్ని లెక్క పెట్టని వాళ్లు మనకు అధికారం ఇస్తారా? అని ప్రశ్నించారు.

రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆస్తి
భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆమూల్యమైన ఆస్తి రిజర్వేషన్లేనని కవిత అన్నారు. భూములు, బంగారం ఉంటే ఒకటి రెండు తరాలకు మాత్రమే ఉంటాయని.. కానీ రిజర్వేషన్లు తరతరాలకు మేలు చేస్తాయన్నారు. బీసీల లెక్క తెలియకపోవటంతోనే వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ దేశ బడ్జెట్ ఏడాదికి రూ. 50 లక్షల కోట్లు ఉంటే ఏటా బీసీలకు రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఒక్కో మనిషికి కనీసం ఒక్క బఠాణీ కూడా రాదన్నారు. అందుకే మన వాటా కోసం మనం దఫాదఫాలుగా పోరాటం చేయాలన్నారు. ముందుగా ఓబీసీల లెక్క తేలితే ఆ తర్వాత మన వాటా హక్కుల కోసం పోరాటం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపి ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చానని చెప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం బీసీలకే వచ్చేవని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో లక్ష బీసీలకే వచ్చేవని అన్నారు. బీసీల జనాభా ఎంత ఉందో లెక్కలు తేల్చకపోవడంతోనే వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు.
వందలో 90 శాతం మంది అన్యాయానికి గురువుతారన్నారు
రామ్ మనోహర్ లోహియా, కాన్షీరాం, కర్పూరీ ఠాకూర్, మూలాయం సింగ్ లాంటి ఎందరో బీసీల కోసం ఎంతో పోరాటం చేశారని.. అదే విధంగా జగదేవ్ ప్రసాద్ కుశ్వా లాంటి నాయకులు బీసీల కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ కు 4 రోజులు మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉన్న జేపీ కుశ్వా బీసీల కోసం పోరాటం చేశారని.. ఆయనను పోలీసులు కాల్చి చంపారని తెలిపారు. వందలో 90 శాతం మంది అన్యాయానికి గురువుతారన్నారని.. వారికి న్యాయం చేయాలని ఆయన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ దేశంలో 100 మంది అవకాశాలను 10 మంది మాత్రమే అనుభవిస్తూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి పోవాలంటే పోరాటం చేయాల్సిందేనని కవిత చెప్పారు.
కవిత తెచ్చే సైక్లోన్ తో మోడీ కుర్చీ ఊడటం ఖాయం : ప్రొఫెసర్ సూరజ్ మండల్
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తెచ్చే సైక్లోన్ తో ఓటు చోరీతో పాటు ఓబీసీలకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీ అధికార పీఠం ఊడటం ఖాయమని బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ అన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న ఓబీసీల కోసం పోరాటం చేసేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన కవిత భవిష్యత్ లో తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఓబీసీలకు న్యాయం జరగాలంటే పోరాటం చేయాల్సిందేనని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న అధికారుల్లో, కీలకమైన పోస్టుల్లో ఒక్కరూ కూడా ఓబీసీలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీలకు ఈ ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలను 42 ఏళ్ల పాటు మోసం చేశాయని తమిళనాడుకు చెందిన రైట్స్ ఆఫ్ ఓబీసీ పార్టీ అధ్యక్షుడు తిరు రత్న సభాపతి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు వారి వాటాకు అనుగుణంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సభలో దేశ వ్యాప్తంగా ఓబీసీల కోసం పోరాటం చేస్తున్న నాయకులు యెజ్జురప్ప, ధర్మేంద్ర కుశ్వాహ, ఉమేశ్ కొర్రం సకల, గీతిక, సునీల్ వర్మ, రైజా బీబీ, బన్సీ లాల్ నీలం కుమారి, విశ్వజిత్ రతోనియా తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ లోని అంశాలు
• దేశ వ్యాప్తంగా జనగణన చేపట్టాలి, అందులో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
• ప్రతి కులానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ ఉండాలి
• ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వాలి
• 1931 జనగణన ప్రకారం బీసీల జనాభా 52 శాతం.. దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు 50 శాతం ఉండాలి
• 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తీసేయాలి, 50 సీలింగ్ కారణంగా బీసీలకు నష్టం జరుగుతుంది
• బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి
• విశ్వ విద్యాలయాల్లో సోషల్ జస్టిస్ ఉండాలి
• ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు అమలు చేయాలి
• 42 శాతం తెలంగాణలో, మధ్యప్రదేశ్ లో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
