హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే, దీపావళి మరియు ఛత్ పండుగల నేపథ్యంలో రైలు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, సరైన టిక్కెట్ తో ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకుగాను నవంబర్ 5 వ తేదీన ఒక రోజంతా ముమ్మరంగా టికెట్ తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ శ్రీమతి ఇతి పాండే జారీ చేసిన ఆదేశాల మేరకు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మూడు డివిజన్లయిన సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినాయి. ఈ నేపథ్యంలో, ఒక్కరోజునే జోన్ టికెట్ తనిఖీలలో రూ. 1.18 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సాధించింది. టికెట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వారిపై మొత్తం 11,150 కేసులు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది.

జూన్ 2026లో జోన్ విభజన జరిగినప్పటి నుండి, దక్షిణ మధ్య రైల్వేలో ఒకే రోజులో నమోదైన అత్యధిక టికెట్ తనిఖీ ఆదాయం ఇదే. ప్రస్తుతం ఈ జోన్లో రోజువారీ టికెట్ తనిఖీ ద్వారా సగటున రూ. 33.44 లక్షల ఆదాయం (సుమారు 4,373 కేసుల ద్వారా) లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ఒకే రోజులో రూ.1.18 కోట్ల టికెట్ తనిఖీ ఆదాయాన్ని ఆర్జించి, జోన్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పగా ఈ రికార్డు ఆదాయంలో సికింద్రాబాద్ డివిజన్ అత్యధికంగా రూ.1.02 కోట్లను సమకూర్చి అగ్రస్థానంలో నిలిచింది. పురుష సిబ్బందితో పాటు, 117 మంది మహిళా టికెట్ తనిఖీ సిబ్బంది కూడా సమర్థవంతమైన టికెట్ తనిఖీ ప్రక్రియలో ముందు వరుసలో ఉండటం ఎంతో ప్రోత్సాహకరమైన విషయం.

టిక్కెట్ల తనిఖీ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం, చెల్లుబాటు అయ్యే టికెట్లతో ప్రయాణించే ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడం, అలాగే ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలోని రిజర్వ్డ్ మరియు అన్-రిజర్వ్డ్ కోచ్లలో టిక్కెట్టు లేకుండా మరియు నిబంధనలకు విరుద్ధంగా చేసే ప్రయాణాలను అరికట్టడం. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు లేదా సరైన ప్రయాణ అధికారంతో ప్రయాణించడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కూడా ఈ తనిఖీ కార్యక్రమం యొక్క లక్ష్యం.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ అత్యధిక టికెట్ తనిఖీ ఆదాయాన్ని సాధించడంలో అంకితభావంతో కృషి చేసిన వాణిజ్య విభాగం అధికారులు మరియు టికెట్ తనిఖీ సిబ్బందిని అభినందించారు. టిక్కెట్ లేని మరియు నిబంధనలకు విరుద్ధమైన ప్రయాణాలను అరికట్టడంలో సిబ్బంది విధుల పట్ల ప్రదర్శించిన నిబద్ధతతో పాటు చొరవతో వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు. ఇటువంటి విస్తృతమైన టికెట్ తనిఖీ కార్యక్రమాలు చెల్లుబాటు అయ్యే టికెట్లతో ప్రయాణించే ప్రయాణికుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు, అక్రమ ప్రయాణాలను నివారిస్తాయని అందరికీ సుఖవంతమైన మరియు అవాంతరాలు లేని ప్రయాణాన్ని అందిస్తాయని ఆయన నొక్కి చెప్పారు
