రెండోసారి కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యం.. ప్రజాక్షేత్రంలోకి శ్రేణులు!

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరుతున్న తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీలో అక్కడక్కడా నెలకొన్న చిన్నచిన్న సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించుకుంటూ, ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సందీప్ కుమార్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు చేరువగా పార్టీ శ్రేణులు

పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి మండలం, నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ పల్లెపల్లెకూ వెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే జనవరి నెలలో సంక్రాంతి పర్వదినం నుంచి జూన్ వరకు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ కార్యాచరణ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Also Read-

బీఆర్ఎస్‌, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన

బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు పైకి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, రాజకీయంగా ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని మంత్రి విమర్శించారు. 2014 నుంచి 2018 వరకు పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు నాటి టీఆర్ఎస్‌ మద్దతు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవలి పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బీఆర్ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని ఆరోపించారు. ప్రజలు ఈ రెండు పార్టీల రాజకీయ వైఖరిని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాజ్యాంగబద్ధమైన పదవులపై బాధ్యతాయుతంగా మాట్లాడాలి

రాజ్యాంగబద్ధంగా ప్రజల మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్‌ నాయకులు, ముఖ్యంగా హరీశ్‌రావు తదితరులు అహంకారపూరితంగా, ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి హితవు పలికారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని సూచించారు. అదే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా చేస్తున్న భావోద్వేగపూరిత వ్యాఖ్యలు, మతపరమైన అంశాల ప్రస్తావనను మంత్రి తప్పుబట్టారు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా కాకుండా, అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై నాయకులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌ నేతలవి అధికారంపై పగటి కలలు

బీఆర్ఎస్‌ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామని, తామే తిరిగి మంత్రులమవుతామని పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే ఆ పార్టీ పాలనను చూశారని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును కూడా గమనిస్తున్నారని అన్నారు. ప్రజల తీర్పే అంతిమమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకడుగు వేయదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ తెలంగాణను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar