డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం, నేటి యువతకు ఈ బాధ్యతలను గుర్తు చేసి న్యాయమూర్తి డా. మంగారి రాజేందర్ ‘జింబో’

హైదరాబాద్ : న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునేలా, ఆ నిర్ణయాలను తక్షణం అమలు చేసేలా పాలనలో మరింత పారదర్శకత అవసరమని ప్రముఖ న్యాయవేత్త, న్యాయశాస్త్ర పరిశోధకుడు, మాజీ న్యాయమూర్తి డా. మంగారి రాజేందర్ ‘జింబో’ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత నేటి యువతపైనే ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి పిలుపునిచ్చారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని “న్యాయమూర్తుల నియామకాల్లో కనిపించని వీటో: కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించిన “ఒక వ్యక్తికి ఒక ఓటు–ప్రతి ఓటుకు సమాన విలువ” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని గుర్తు చేశారు. నేడు దేశంలో ఓటర్ల ఏరివేత కొనసాగుతోందని ఇది మంచి పరిణామం కాదన్నారు. ప్రతి వ్యక్తి తాను జీవించి ఉన్నానని, తన గుర్తింపును నిరూపించుకోవాల్సి వస్తోందని, దేశంలో ఇప్పటికే కోట్లాది మంది ఓట్లు తీసేశారని, తెలంగాణలో కూడా ఆ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన ఆవేధాన్ వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత నేటి యువతపైనే ఉందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. యువత రాజ్యాంగ విలువలను అర్థం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ న్యాయవేత్త, న్యాయశాస్త్ర పరిశోధకుడు, సాహితీవేత్త, మాజీ న్యాయమూర్తి డా. మంగారి రాజేందర్ ‘(జింబో’ “న్యాయమూర్తుల నియామకాల్లో కనిపించని వీటో: కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ” అనే అంశంపై ప్రసంగించారు. అయన మాట్లాడుతూ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, చట్టబద్ధ పాలనకు స్వతంత్ర న్యాయవ్యవస్థ ఎంతో అవసరమని అన్నారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల ప్రభావానికి లోనుకాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా స్వతంత్రంగా, నిర్భయంగా పనిచేయాలన్నారు. న్యాయమూర్తుల నియామకాలపై కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం ప్రత్యక్ష తిరస్కరణ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని, కొలీజియం సిఫారసులను ఆలస్యం చేయడం, పెండింగ్‌లో ఉంచడం లేదా వాటిపై నిర్ణయం తీసుకోకుండా ఉండటం ద్వారా కూడా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని అన్నారు. కొలీజియం అభ్యర్థుల పేర్లను అధికారికంగా పరిశీలించకముందే ప్రభుత్వం నుంచి అనధికారిక ఆమోదం కోరడం కూడా నియామకాల ప్రక్రియ స్వతంత్రతను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read-

అదే సమయంలో కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించడం, న్యాయమూర్తుల ఎంపికకు స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం వంటి లోపాలను కూడా ఆయన ప్రస్తావించారు. నియామకాల ప్రక్రియలో పారదర్శకత, స్పష్టమైన ఎంపిక ప్రమాణాలు, సిఫారసులపై నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువులు, జవాబుదారీతనం లోపించిందని, అందరికీ అనుమానాలు వస్తున్న నేపధ్యంలో నిర్దిష్ట షెడ్యూల్ అవసరమని నొక్కిచెప్పారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు ప్రజల నమ్మకమే ప్రధానమని పేర్కొంటూ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండటమే కాకుండా, అది స్వతంత్రంగా పనిచేస్తున్నదనే విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లకుండా చూడాలన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థతో సంప్రదింపులు లొంగుబాటుగా మారకూడదని, న్యాయపరమైన సంయమనం ప్రభుత్వానికి విధేయతగా మారకూడదని సూచించారు. న్యాయవ్యవస్థను బలహీనపరచడం కాకుండా, వ్యవస్థలోనే అవసరమైన సంస్కరణలు చేపట్టాలని మంగారి రాజేందర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల నిబద్ధత, నిజాయితీ ప్రాధాన్యతను వివరిస్తూ పలు సందర్భాల్లో రాజ్యంగా నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి, స్వతంత్రత, విలువలను కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని ఆయన సూచించారు.

కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించి, ముఖ్య వక్త మంగారి రాజేందర్‌ను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు తడకమల్ల వివేక్, డా.కె. రామ్ మోహన్ రెడ్డి; అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, విభాగ అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్య అతిథి ప్రొ. ఘంటా చక్రపాణి, న్యాయమూర్తి మంగారి రాజేందర్ జింబో, ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి డా. బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar