హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఒక భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సురక్షితంగా రైలు సేవలను కొనసాగించేందుకు మరియు రాబోయే వర్షాకాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, నిరంతరాయంగా జోన్ యొక్క సిద్ధతను సమీక్షించే దిశగా సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌గారితో పాటు వివిధ శాఖల ప్రధాన శాఖాధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మూడు డివిజన్ల అనగా సికింద్రాబాద్ , హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యుత్ భద్రతకు పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి, రైల్వే ట్రాక్‌ల సమీపంలో చెట్లు, కొమ్మలను నరికివేయాలని, సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద జీపీఎస్ ట్రాకర్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని బృందాలను ఆదేశించారు. పర్యవేక్షకులు అప్రమత్తంగా ఉండాలని, ఏదేని సమస్య తలెత్తినా ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆయన నొక్కి చెప్పారు.
Also Read-
సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి నిశితంగా పర్యవేక్షించడంపై ఈ సమీక్ష గట్టిగా నొక్కిచెప్పింది. రైలు కార్యకలాపాల సమయంలో విద్యుత్ ట్రిప్పింగ్ లేదా షార్ట్ సర్క్యూట్‌ల వంటి అంతరాయాలను నివారించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రామాణిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లను నిర్ధారించాలని అధికారులకు సూచించారు.

జనరల్ మేనేజర్ మరింతగా అధికారులకు పాయింట్లు, క్రాసింగ్‌లు మరియు ఇతర కీలక ప్రాంతాలలో సంయుక్త తనిఖీలు నిర్వహించి, జోన్ లో కొనసాగుతున్న మరమ్మత్తు పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, ఉద్యోగులకు క్రమం తప్పకుండా రిఫ్రెషర్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత కీలకమని పేర్కొంటూ, భద్రతా మార్గదర్శకాలు మరియు నిర్వహణా విధానాలపై సిబ్బంది ఎప్పటికప్పుడు తాజా అవగాహనతో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.
