హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సొసైటీకి రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ప్రఖ్యాత యోగా గురువు అయిన మురారి మోహన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, ఇతర ప్రధాన శాఖాధిపతులు, అధికారులు, సిబ్బంది, స్కౌట్స్ మరియు గైడ్స్, పాఠశాల విద్యార్థులు మరియు యోగా ఔత్సాహికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోన్‌లోని ఇతర సిబ్బంది మరియు అధికారులు పాల్గొనడానికి వీలుగా ప్రోగ్రామ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం దక్షిణ మధ్య రైల్వే సోషల్ మాద్యమం ద్వారా కూడా ప్రసారం చేయడం జరిగింది.

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా”. ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధాప్యం వైపు పయనిస్తున్న కొద్దీ, దీర్ఘాయువు, చలనశీలత, స్వాతంత్ర్యం మరియు సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహించడంలో ఈ ప్రాచీన అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఇది అన్ని వయసుల వారిలోఒత్తిడిని తగ్గించడానికి మరియు శారీరక ధృడత్వాన్ని మెరుగుపరచడానికి సున్నితమైన కదలికలు, వ్యాయామాలు మరియు శ్వాసాభ్యాసాలు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాలతో సన్నిహితంగా ఉంటుంది. మురారి మోహన్ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలైన అంశాలతో కూడిన యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మురారి మోహన్ యోగా అనేది జీవనోత్సవం అని, శరీరాన్ని శుద్ధి చేయడానికి, మనసును ఒత్తిడుల నుండి విముక్తి చేయడానికి, ఆత్మను ఉత్తేజపరచడానికి ఇది ఒక మార్గమని పేర్కొన్నారు. యోగా కేవలం ఒక శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనస్సు మరియు ఆత్మల సంపూర్ణ సమన్వయానికి దారితీసే మార్గమని, ఇది అంతిమంగా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుందని కూడా ఆయన తెలిపారు.

Also Read-

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ మెరుగైన శారీరక, మానసిక శ్రేయస్సు కోసం యోగాను దైనందిన జీవనశైలిలో భాగం చేసుకుంటామని వాగ్దానం చేస్తూ, పాల్గొన్నవారితో యోగ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజు జరిగిన యోగా శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ఒత్తిడి రహిత జీవనంపై విలువైన సూచనలు అందించిన ప్రముఖ యోగా గురువు మురారీ మోహన్ ను దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముందు, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐ.వై.డి-2026) ప్రత్యక్ష ప్రసారాన్ని అదనపు జనరల్ మేనేజర్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది ఆసక్తిగా వీక్షించారు. భారత గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర విశిష్ట అతిథులతో కలిసి కోల్‌కతాలో జరిగిన ఈ ప్రధాన కార్యక్రమంలో పాల్గొని, అక్కడ భారీగా తరలివచ్చిన యోగా సాధకులను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.
