వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ అవార్డ్స్ సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ సిద్దమయ్యింది.
ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటబోతోంది. ఈ మూవీలోని ‘నాటు నాటు… పాట ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డ్ కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన ఈ పాటకు అవార్డ్ రావాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు అందరి చూపు ఆస్కార్ అవార్డ్ పైనే ఉంది. మార్చి 13న జరగబోయే ఈ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ వరించాలని, పాట రచయిత చంద్రబోస్ ను సంగీత దర్శకుడు కీరవాణి పాడినా రాహుల్ ను దర్శక ధీరుడు రాజమౌళిని నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ అభినందిస్తూ రచయిత కొప్పుల ప్రసాద్ ఆస్కార్ విజయాన్ని కాంక్షిస్తూ రాసినటువంటి కవిత…
కోట్ల కండ్లు ఎదురుచూపులు
ఆస్కారుకై వేచి చూస్తున్నాయి
ప్రతి హృదయం మొక్కుతుంది
భారతీయ సినిమా జైత్రయాత్రకు…
అచ్చమైన తెలుగు భాషలో
జానపదానికి సజీవ రూపంగా
విశ్వవేదికపై చిద్విలాసంగా నవ్వుతూ
తెలుగు సినిమా ఖ్యాతి రెపరెపలాడాలి…
అచ్చమైన నాటు తెలుగు పదాలతో
పదవిన్యాసపు గంభీర స్వరంతో
అక్షర యజ్ఞములో మహా జ్యోతిగా వెలిగే
నాటు పదాల సృష్టికర్త చంద్రబోస్ గారికి అభినందనలు…
స్వరమాంత్రికుడు సంగీతాన్ని సమ్మిళితం చేసి
సప్త స్వరాలతో పాటను అభిషేకం చేస్తే
శ్రవణానందముతో హృదయం పులకించే
సరస్వతీ పుత్రుడు కీరవాణి కి అభినందనలు…
అద్భుత గాత్రముతో అలరించి గంధర్వుడు
కమ్మని స్వరముతో పాటనే అభినయించెను
పదాల లాలిత్యమును కంఠంలో ఒలికించెను
గాన సుధాకరుడైన రాహుల్ కు అభినందనలు…
అద్భుత నిర్మాణ కౌశల సినిమా రథసారధి
ఆంధ్ర నుంచి ఆస్కార్ కు దారి చూపిన దర్శకుడు
తెలుగు సినిమా చరిత్రకు సువర్ణాధ్యాయం కల్పించే
తెలుగు దర్శక మకుటం రాజమౌళికి అభినందనలు…
అద్భుత నాట్య విన్యాసాలు ప్రదర్శించి
అభినయ నృత్యంతో కళ్ళకు విందు చేసి
అసమాన్య నటనతో హృదయాలను గెలిచినా
రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు అభినందనలు…
ఆస్కారుతో ఈ దేశం పులకిస్తుందని
ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకొనేందుకు
సినిమా ప్రపంచంలో ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందని కాంక్షిస్తూ
కళామతల్లికి స్వరాభిషేకం జరగాలని కోరుకుంటూ…

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235