హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో 19వ ‘రోజ్‌గార్ మేళా’ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే(ఎస్.సి.ఆర్) పరిధిలోని సికింద్రాబాద్, గుంతకల్లు మరియు గుంటూరుతో సహా దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు 51,000 నియామక పత్రాలు పంపిణీ చేయబడ్డాయి. సికింద్రాబాద్‌లో, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖుల సమక్షంలో, ఈ రోజు అనగా మే 23, 2026న భోయిగూడలోని ‘రైల్ కళారంగ్’లో నూతనంగా ఎంపికైన 218 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి; సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ మరియు రైల్వేలు, ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు

ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 51,000కు పైగా నియామక పత్రాలు అందజేయబడినందున, ఈ రోజు దేశ యువతకు చాలా ముఖ్యమైన సందర్భమని పేర్కొన్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య మొదలైన వివిధ రంగాలలో తమ సేవను ప్రారంభించిన యువతను ఆయన అభినందించారు మరియు వారు ఇప్పుడు దేశం యొక్క వికసిత భారత్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగంగా మారారని నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి నియమితులైన వారి కర్తవ్యం మరియు బాధ్యత కేవలం తమకు, తమ కుటుంబాలకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉంటుందని తెలిపారు. ఏ సంస్థకైనా ప్రజలే నిజమైన బలం అని ఆయన పేర్కొంటూ, కొత్తగా చేరిన వారు చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read-

ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజల పెరుగుతున్న ఆకాంక్షలను నెరవేర్చడానికి మరియు వారు మనపై ఉంచిన నమ్మకాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, నిరంతరం నేర్చుకోవడం, అవసరానికి అనుగుణంగా జ్ఞానం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తమ పాత్రలు మరియు బాధ్యతలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడే ఐగాట్ కర్మయోగి వంటి వేదికలను ఉపయోగించుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించారు.

ప్రధాన మంత్రి నియమితులైన వారిని ఉద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇటీవల అయిదు దేశాల పర్యటనలో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ దేశాలు భారతదేశం సాధిస్తున్న సాంకేతిక పురోగతిపై ఉత్సాహం వ్యక్తం చేశాయని, దేశంలోని వికాస్ యాత్రలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు సెమీ కండక్టర్, వ్యవసాయం, అధునాతన తయారీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఆవిష్కరణ, హరిత సాంకేతికత, కీలక ఖనిజాలు మరియు విజ్ఞాన సాంకేతిక రంగాలలో చర్చలు మరియు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఈ రంగాలు రాబోయే సంవత్సరాలలో ప్రపంచ వృద్ధిని తీర్చిదిద్దుతాయని, భారత యువత ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆన్నారు. వివిధ దేశాలతో భాగస్వామ్యాలు యువతకు ప్రపంచవ్యాప్త పరిచయం కల్పించి, కొత్త అవకాశాలు మరియు ఉపాధి మార్గాలను సృష్టిస్తాయని ఆయన ఇంకా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నియమితులైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొత్తగా నియమితులైన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 218 మంది అభ్యర్థులు ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్నారని ఆయన తెలియజేశారు. ఈ రోజు కేవలం ‘రోజ్‌గార్ మేళా’కు మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశంలోని యువత సాధించే సాధికారతకు కూడా ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు చిత్తశుద్ధితో దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముందుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వాగతోపన్యాసం చేశారు. ఈ రోజు ప్రభుత్వ సేవలో చేరుతున్న వేలాది మంది యువతకు రోజ్‌గార్ మేళా ఒక కీలకమైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. నేడు నియామక పత్రాలను అందుకుంటున్న అభ్యర్థులు కేవలం ఉద్యోగ నియామకాన్ని మాత్రమే కాకుండా, వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతు సేవలను అందించేందుకు ఒక బాధ్యతా పత్రాన్ని కూడా స్వీకరిస్తున్నారని ఆయన తెలిపారు.
