న్యూఢిల్లీ : పార్టీ నిబంధనలు, లక్ష్మణరేఖ దాటి మాట్లాడే ఎంతటివారైనా కాంగ్రెస్ ఉపేక్షించబోదని, కఠిన చర్యలు తీసుకుంటుందని టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి తెలిపారు. క్రమశిక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం (ఏఐసీసీ) తీసుకున్న తుది నిర్ణయం ప్రకారం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించినట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్యయుతంగానే నిర్ణయం
ఈ నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యమైనప్పటికీ, సమస్యను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించాలనే అధిష్ఠానం ఓపిక పట్టిందని మల్లు రవి తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఆయన ఒక మీటింగ్‌లో మాట్లాడుతుండగానే తొలగించారని, అది రాచరిక విధానమని విమర్శించారు. కానీ తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని పేర్కొంటూ… చట్టప్రకారం వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా తానే స్వయంగా అన్ని కోణాల్లో లోతుగా విచారించి, నివేదికను తయారు చేసి పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చినట్లు తెలిపారు.
ఏకపక్ష నిర్ణయమనే సురేఖ వ్యాఖ్యలు సరికాదు
తన వాదన వినలేదని, ఏకపక్షంగా తొలగించారన్న కొండా సురేఖ వ్యాఖ్యలను మల్లు రవి తిరస్కరించారు. ఆమె పీసీసీ, ఏఐసీసీ అధ్యక్షులను స్వయంగా కలిశారని, లోపల ఏం జరిగిందనేది అందరికీ తెలుసన్నారు. ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే సీఎం, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప, భార్యాభర్తల సమస్యల మాదిరిగా బజార్లో కూర్చొని మాట్లాడకూడదని హితవు పలికారు. అలా బహిరంగంగా మాట్లాడటం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే హైకమాండ్, సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
Also Read-
ఖర్గే రెండుసార్లు కొండా సురేఖ వివరణను విన్నారు
పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్న వ్యాఖ్యలను పరిశీలించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. ఎంతటి పెద్ద పదవిలో ఉన్నవారైనా సరే పార్టీ నిబంధనల పరిధిలోనే ఉండాలనే బలమైన సందేశాన్ని క్యాడర్‌కి ఇవ్వడానికే ఈ చర్యలని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఇన్ ఛార్జ్ అందుబాటులో లేకపోవడం, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల మధ్య చర్చల కారణంగానే నిర్ణయం వారం రోజులు ఆలస్యమైందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా బెంగళూరులో ఒకసారి, ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మరోసారి కొండా సురేఖను కలిసి ఆమె వాదనను విన్నారని, కోర్టులో ఇరువైపులా వాదనలు విని తీర్పు ఇచ్చినట్లుగానే హైకమాండ్ ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు.
నివేదికలన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం
తొలగింపు అనంతరం సీఎం బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె చేస్తున్న ఆరోపణలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, పదవి ఊడిన బాధలో అలా మాట్లాడేస్తుంటారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆ ఆలోచనే ఉంటే అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి తొలగించమనేవారని, కానీ అందరికీ తగిన అవకాశం ఇచ్చి, నివేదికలు పరిశీలించిన తర్వాతే ఫైనల్‌గా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అలాగే కేసీ వేణుగోపాల్‌ను కలవలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ… ఏఐసీసీ అధ్యక్షుడే మాట్లాడిన తర్వాత ఉత్తర్వులు ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లో వేణుగోపాల్ పేరు మీదనే వస్తాయని వివరించారు.
సామాజిక సమతుల్యతకే ప్రాధాన్యం
బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మూడు కొత్త నియామకాలు చేపట్టినట్లు మల్లు రవి వెల్లడించారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మికి తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా (కేబినెట్ ర్యాంక్) అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ గుండు సుధారాణికి వరంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలిపారు. శారదకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చినట్లు వివరించారు. ఈ నిర్ణయాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు, పద్మశాలీలకు, బీసీలకు వ్యతిరేకం కాదని రుజువైందన్నారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ నేతలేనని, వీహెచ్‌కు అడ్వైజర్‌గా కేబినెట్ ర్యాంక్ ఇచ్చామని గుర్తుచేశారు. ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినప్పుడు ఓపికతో ఉంటే కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని, బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
క్రమశిక్షణకు నేనూ అతీతుడినేమీ కాదు
కొండా సురేఖను పార్టీ నుంచి తొలగిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, అటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే ప్రకటించేవాళ్లమని, ప్రస్తుతం ఆ అవసరం అనిపించలేదని మల్లు రవి తెలిపారు. గతంలో మీరూ కాంగ్రెస్‌ను విమర్శించారన్న ఆరోపణలపై స్పందిస్తూ… అటువంటిది ఏమైనా ఉంటే రాతపూర్వకంగా ఏఐసీసీకి ఇవ్వవచ్చని, క్రమశిక్షణ దాటితే తాను కూడా అతీతుడిని కానని, ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ, ఇది కేవలం కుమార్తె వ్యవహారం మాత్రమే కాదని, ముఖ్యమంత్రిని, పార్టీని బహిరంగంగా విమర్శించినప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి దాన్ని ఖండించకపోవడం సరికాదన్నారు. పైగా కొండా సురేఖ, మురళి జంటపై ఇదివరకు కూడా ఫిర్యాదులు వచ్చాయని, గతంలో హెచ్చరించినా మళ్లీ అదే పునరావృతమైందని మల్లు రవి స్పష్టం చేశారు.
