వికారాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను తనిఖీ చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి 30 ఆగస్టు న వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ తనిఖీలో కేంద్ర మంత్రి గారి వెంట సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి స్టేషన్‌లోని నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన స్టేషన్ భవన నిర్మాణం, ప్లాట్‌ఫారమ్‌లు, 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన, పార్కింగ్, స్టేషన్ ప్రాంగణం మొదలైనవాటిని పరిశీలించారు. అలాగే, నిర్మాణ స్థలంలో చేపడుతున్న భద్రతా చర్యలను కూడా ఆయన సమీక్షించారు.

అనంతరం, స్టేషన్‌లో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యం, అందుబాటు మరియు మొత్తం స్టేషన్ వాతావరణాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.24.35 కోట్ల వ్యయంతో అమృత్ స్టేషన్‌గా పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పునరాభివృద్ధి పనులలో భాగంగా 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునీకరించిన వేచియుండు గదులు, మెరుగైన స్టేషన్ ప్రాంగణం, ప్రవేశ ద్వారాలు మరియు ముఖభాగం మెరుగుదలలు, మెరుగైన లైటింగ్ మొదలైన ప్రయాణీకుల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గౌరవ కేంద్ర మంత్రి తెలియజేశారు. జి. కిషన్ రెడ్డి “అమృత్ భారత్ స్టేషన్ పథకం” కింద తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,000 కోట్లకు పైగా వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా, కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో తెలంగాణ రైల్వే నెట్‌వర్క్ ఒక భారీ పరివర్తనకు గురైందని పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్, థర్డ్-లైన్ పనులు, బైపాస్ లైన్లు, స్టేషన్ల పునరాభివృద్ధి, విద్యుదీకరణ మరియు భద్రతా పెంపుదల చర్యలు మొదలైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ “కవచ్” ను తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్లు మరియు ప్రస్తుతం వివిధ రైల్వే మార్గాల్లో కవచ్ 4.0కి అప్‌గ్రేడ్ చేసే పనులు పురోగతిలో ఉన్నాయని కూడా ఆయన తెలియజేశారు.

విశాఖపట్నం, తిరుపతి , బెంగళూరు మరియు నాగ్‌పూర్ వంటి ముఖ్యమైన గమ్యస్థానాలతో కలుపుతూ ప్రస్తుతం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల నుండి ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్.ఆర్.ఆర్) వెలుపలి అంచు వెంబడి ప్రతిపాదించిన ‘రీజినల్ రింగ్ రైల్’ కోసం, 400 కిలోమీటర్ల మేర ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్. ఎల్.ఎస్.) 2023లో ఆమోదం లభించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆర్.ఆర్.ఆర్ యొక్క ఉత్తర విభాగం విషయంలో లైడార్ సర్వే పూర్తయి, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డి.పి.ఆర్) సమర్పించబడిందని, అదే సమయంలో దక్షిణ భాగానికి సంబంధించిన రైలు మార్గం అలైన్‌మెంట్‌ ఖరారు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపారు.

Also Read-

పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పునరాభివృద్ధి ద్వారా మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు, ఆధునిక సదుపాయాలు కల్పించడంతో పాటు, రైలు ప్రయాణీకుల మొత్తం ప్రయాణ అనుభవం గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

వికారాబాద్ స్టేషన్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ మరియు ‘గ్రాండ్ సెల్యూట్’ సమర్పించింది. అనంతరం, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా కేంద్ర మంత్రి, ఎంపీ చెవెళ్ళతో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X