Book Review: ‘అమ్మపేరే నాకవిత్వం’ కొన్ని కవితలు మనల్ని పరీక్షీస్తాయి-కొన్ని నిరీక్షణ నేర్పుతాయి

అమ్మ అందమైన అనుబంధం

అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ..! అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. సృష్టిలో ప్రతీ మనిషి ఒక్కో రకంగా నిర్వచనం చెప్పే పదం అమ్మ. అమ్మ గురించి ఒక్కొక్కరిని తట్టితే ఒక్కొక్క మదిలో ఒక్కోక్క రీతిలో ఆత్మీయమైన భావం ఉట్టిపడుతుంది. అమ్మ గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పిన చెప్పేవారికి, వినేవారికి తనివి తీరదు. అసలు అమ్మ లేకపోతే ఈ జగతినే లేదు. మరి అలాంటి మాతృ మూర్తి గురించి “కుంచె శ్రీ” అనే కలం పేరుతో చింతా లక్ష్మీ నారాయణ రాసిన “అమ్మపేరే నా కవిత్వం” అనే కవితా సంపుటిలోనికి తొంగి చూస్తే అమ్మ గురించి కవిత్వంలో ప్రస్తావించిన విధానం ప్రతీ మదిని తాకుతుంది. వెంటాడుతుంది. కొన్ని కవితలు మనల్ని పరీక్షీస్తాయి. కొన్ని నిరీక్షణ నేర్పుతాయి. కొన్ని ఆలోచింప జేస్తాయి. కొన్ని అచ్చం పాఠకుడివే అనిపిస్తాయి.

ఈ కవితా సంపుటిలో మొత్తం 54 కవితలున్నాయి. ఇది వరకు అమ్మ గురించి కవిత్వీకరించిన వారికి భిన్నంగా కుంచె శ్రీ అమ్మను ఒక కొత్త కోణంలో కొత్తదనంగా అమ్మను కవిత్వీకరించాడు.

పుస్తక రచయిత కుంచె చింతా లక్ష్మీ నారాయణ

ఇక కుంచె శ్రీ కవిత్వ సంపుటిలోని వెలితే….

నవగ్రహాల సాక్షిగా
అమ్మతో నేను
ఈ.. లోకంలో కనులు తెరిచా

అని ముగింపులో చెప్పడం జరిగింది. ఏ కవితకైనా మంచి ముగింపే ఆ కవితకు బలాన్ని కలగజేస్తుంది. అమ్మ నవమాసాలు మోసి ప్రాణంపోయేటంత బాధను పంటి బిగువన ఓర్చి ఓ బిడ్డకు జన్మనిచ్చి, ప్రపంచానికీ పరిచయం చేసిన విధానాన్ని ముగింపులో చెప్పిన తీరు అమ్మకు ప్రతిరూపంగా చిత్రించాడు.

‘మా..యమ్మ’ అనే కవితలో కుంచె అప్పుడే పుట్టిన బిడ్డపై అమ్మ మమకారాన్ని ఇలా పోలుస్తాడు…

నే.. కనులు తెరిచాక మాయమ్మ
తన గుండెకత్తుకుంది చూడమ్మ
నా ఏడుపు వినలేక ఓయమ్మ
తన రొమ్ము పాలు పట్టిందిలేమ్మా
నాకు జోలపాడి మరిపిందిలేమ్మా

బిడ్డ అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మపడే సంతోషాన్ని, ఆ తర్వాత బిడ్డకు పాలివ్వడం దగ్గర నుంచి అలనా పాలనా వరకు బిడ్డపై అమ్మ చూపించే అనురాగాన్ని, ప్రేమను వ్యక్తపరిచిన విధానం పాఠకునికి బాల్యంలో పడేస్తుంది . బిడ్డను చూడాలన్న తపనతో పురిటి నొప్పుల బాధకు కూడా భయపడకుండా , ఆ చిట్టి పాదాలను తాకి పులకరించాలని, పిల్లవాని నవ్వులతో మైమరిచిపోవాలనే విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు. అమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ, వదినమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ, తాతమ్మ వీటిలో ఏ పదం పలకాలన్న రెండు పదాలు కలవాలి. రెండు హృదయాలు పులకరించాలి, అని మాయమ్మ కవితలో అమ్మ ఎప్పటికీ అమ్మే అని కవిత్వీకరించిన విధానం మెచ్చుకోదగ్గది.

అమ్మ చల్లని ఒడిలో సేద తీరే పసివాడు అప్పుడప్పుడే బొర్లపడ్డానికీ ప్రయత్నిస్తున్న తీరును ‘ అమ్మ ప్రేమ ‘ అనే కవితలో ఇలా చెప్తాడు..

నే.. వెల్లికల నుండి బోర్లపడితే
నలుగురితో చెప్పి మురిసిపోయేది
నా.. బుడి బుడి అడుగులు చూడడం కోసం
చేయిపట్టి నడిచేది అమ్మ ప్రేమ

పసివాడు ఎదుగుదలే అమ్మకు హాయినిచ్చేది. తాను ఎదుగుతున్న కొద్ది అమ్మ ఆనందానికీ హద్దులుండవు. కనిపించిన ప్రతీ వారికి పసివాని గురించి చెప్పి సంతోషపడేది. కుంచె అమ్మ ప్రేమను ఎంతలా అనుభవించింటే అమ్మ ప్రేమను ఇంత కమ్మగా చిత్రించగలడు, అమ్మ మది యొక్క స్వచ్ఛతను చాటగలడు. అమ్మ రూపాన్ని ఇంత అపూరూపంలా ఎలా చిత్రించగలడు. అమ్మపై అంతులేని ప్రేమున్నవాడినే ఇలా రాయగలరు.

‘అమ్మ మనసు’ కవితలో పుట్టిన బిడ్డకు నామకరణం చేసే సమయాన ఏ పేరు పెడితే బాగుంటుందని తర్జనభర్జనకు లోనై సందర్భంలో అమ్మ పడే ఆరాటాన్ని కుంచె ఇలా కవిత్వీకరించాడు.

నామకరణ చేయాలని తలంచి
నామములన్ని శోధించెను
శోధించి శోధించి పెట్టెను
నాకో పేరు
తెలిసి పెట్టెనో
తెలియక పెట్టెనో
లక్ష్మీ నారాయణుడని
అమ్మ మనసు!

ఈ కవితను పాఠకుడు చదివినప్పుడు కుంచె అమ్మగారు కుంచెకు చింతా లక్ష్మీనారాయణుడని పేరు పెట్టిన మధుర క్షణాలను, అనుభూతులను వ్యక్తపరిచాడు

‘కన్నపేగు’ అనే కవితలో బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న అమ్మ పడే తపనను, బిడ్డ వచ్చిన తర్వాత తన ఆకలిని పక్కన పెట్టేసి, బిడ్డ ఆకలిని తీర్చడానికీ గోరుముద్దలు కలిపి అమ్మ ముద్ద, నాన్న ముద్ద, అక్క ముద్ద, అన్న ముద్ద, నీ ముద్ద అని ముద్దలు చేసి బిడ్డ ఆకలిని తీర్చే సమయంలో ఆ కన్నపేగు పడే సంతోషాన్ని చాలా చక్కగా కవిత్వీకరించాడు. కుంచె తల్లి తండ్రుల జీవనవిధానం గ్రామీణ పరిసర వాతావరణంలోనే గడిచింది. ఆ గ్రామీణ వాతావరణంతో ముడిపడి ఉన్న ఆత్మీయ అనుబంధాల్ని, ఆ గ్రామీణ ప్రాంతాలతో మమేకమైన జీవితాల్ని ‘బూ..గంప’ కవితను మొదలుకుని ‘అమ్మ నేను తిర్నాల’ అనే కవితల వరకు ఆ గ్రామీణ పల్లె ప్రాంతంతో అల్లుకున్న గాఢమైన అనుభూతులను, ఆలోచనలను తెలియ జేశాడు.

‘అమ్మ పేరే ఓ కవిత్వం’ అనే కవితలో

వర్ణమాలలోని మొదటి ‘అ’ అక్షరంలా
దెబ్బ తగిలితే మొదటి అమ్మ అనే మాటాలా
ఈ నాటికి అమ్మా అనే పిలుస్తూనే వున్నా..
నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటే
నిమిషానికి అమ్మ 100 సార్లు
తలుచుకుంటుందని నా కలమూహించేదని
అమ్మ పేరే ఓ కవిత్వమని రాస్తూనే వున్నా..

ఆకాశానికి ఏవిధంగా హద్దులుండవో; బిడ్డపై అమ్మ ప్రేమకు కూడా హద్దులుండవు. ఈ సువిశాల సృష్టిలో ఎవరి ప్రేమ గురించైనా వర్ణించవచ్చేమో గానీ, అమ్మ ప్రేమను ఎంత వర్ణించిన కొదవగానే ఉంటుంది. కుంచె ఈ కవితలో అమ్మ ఆకాంక్ష ఎనలేనిదని, అమ్మ దీవెన దివ్యమైనదని, ఆదిలో తొలి పిలుపు అమ్మే అయినా ; ఆ అమ్మ మనస్సులో మాత్రం బిడ్డ గురించే ఆకాంక్ష అని, బిడ్డపై అమ్మ ప్రేమ ఎంత గొప్పదో తెలియజేశాడు.

బిడ్డ ఏడిచే సమయాన, బిడ్డ ఏడ్పును ఆపడానికి తల్లి జోలపాట పాడే విధానాన్ని ‘ అమ్మ పాడిన జాబిల్లి పాట ‘ అనే కవితలో కుంచె తన మనోభావాలను

చందమామ నువ్వేడుస్తుంటే
నవ్వించడానికొస్తున్నాడు చూడు అంటూ
మా అమ్మ నాపై ఉన్న ముద్దుల ప్రేమను
ఆకాశమంత ప్రేమను కూడగట్టుకుని
గగనానికి నన్ను తీసుకెళ్ళి
నన్ను చందమామతో ఆడించి
మురిసిపోయేను మా అమ్మ
నన్ను నవ్వించడానికి కవ్వించడానికి
చంద్రమండలానికే నను రాజును చేసి
ఆనందోత్సాహంలో తేలియాడుతోంది అమ్మ

జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా; చందమామ రావే జాబిల్లి రావే; కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగ శ్రీ రంగ రంగ రంగా అనే జోలపాటలు మన తెలుగువారికి సుపరిచితమే. ఏడ్చే పిల్లాడిని బుజ్జగిస్తూ, లాలిస్తూ పాడే పాటలను లాలిపాటలని; నిద్ర పుచ్చుటకై జోకోడుతూ పాడే పాటలను జోలపాటలని అంటారు.తల్లి బిడ్డ ఏడ్పును మాన్పించటానికి పాడే జోలపాటలకు పరవశించ కుండా ఉండే శిశువులు ఉండరు. జోలపాటల వెనుక నిజమైన అంతర్యం ఏమిటంటే జోలపాటలు శిశువు వినడం వల్ల అతని హృదయ స్పందన సాఫీగా సాగిపోవడమే గాక శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. చందమామను చూసి బిడ్డ ఏడ్పు ఆపడాన్ని చూసి తల్లి బిడ్డను చంద్రమండలంతో పోల్చడమనేది గొప్ప భావచిత్రణ. ఈ కవిత మొత్తంలో శిల్పం చాలా చక్కగా ఒదిగిపోయింది. ఈ కవితను చదివిన తర్వాత కవి శిల్పానికీ కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు తేలింది.

తల్లి బిడ్డపై చూపే ప్రేమను అందమైన అనుబంధంగా “అమ్మది పిచ్చి ప్రేమ” అనేకవితలో తల్లి మమకారంను

ఋజువైంది
అమ్మది పిచ్చి ప్రేమే…!
అమ్మకి వాళ్ళ నాన్న ఇష్టం
తరువాత మా నాన్న ఇష్టం
ఇప్పుడు ఆ ఇద్దరి ఇష్టం నా పైనే
అందుకే… అమ్మ
నా పైన పిచ్చి ప్రేమను పంచుకుంది!

అమ్మ తన జీవితకాలంలో బిడ్డపై చూపే ప్రేమ మరెవరిపై చూపదు అనే అంశాన్ని చాలా సులువైన శైలిలో కవి తెలియ జేశాడు. ఎక్కడైనా బిడ్డను అమ్మనే ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ బిడ్డ అమ్మ ఆలనాపాలనా చూసుకునే విధానాన్ని “అమ్మ ఋణం” అనే కవితలో ఇలా తెలియజేస్తాడు

మా అమ్మ నేడు పసిపాపయ్యింది
నడకలు రాని చిన్నారయ్యింది
బోసి నవ్వుల బుజ్జాయైంది
కాలానిజి ఎదురీదే చేపపిల్లైంది

అమ్మకు సేవ చేసే భాగ్యం
అమ్మ నన్ను చూసుకున్న తీరుగా
నేను అమ్మను చూసుకునే భాగ్యం
నాకు ఈ జన్మలోనే దక్కిందనుకుంటాను.

బిడ్డ తల దువ్విన అమ్మకు తల దువ్వడం, అన్నం పెట్టిన అమ్మకే అన్నం కలిపి పెట్టడం, స్నానం చేయించిన అమ్మకే స్నానం చేయించడం అరుదుగా జరిగే సంఘటనలు. ఈ మాటలు ఉత్తిత్తి మాటలు కాదు. కుంచె జీవితంలోని యదార్థ సంఘటనలే. చనుబాలు పంచి, గోరు ముద్దలు పెట్టి నన్ను ఇంతటోడ్ని చేసింది. అటువంటి అమ్మకు ఇంతకంటే ఏమి చేయగలం అని; మరో జన్మ ఉంటే నీకు తండ్రినై మరలా ఇలానే లాలించాలని ఉంది. అమ్మ ప్రేమను, అమ్మ పై ఉన్న అనురాగాన్ని, మమకార బంధాన్ని కుంచె తన గుండె ఘగనాలలో రూపాన్ని ఏవిధంగా నింపుకున్నడనే విధానాన్ని తెలియజేయడం, నిజానికి తల్లి తండ్రులను ఆనాధ శరణాయాల్లో వదిలేసే మూర్ఖులకు చెంప చెల్లుమనిపించినట్లే.

ఈ కవితా సంపుటిలోని ప్రతీ కవితతో కుంచెకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతీ కవితలోనూ కవి అనుభవాలు, జ్ఞానపకాలు దాగి ఉన్నాయి. ప్రతీ కవితలో కుంచె జీవితం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక్కోక్క సారి కుంచె జీవితాన్నీ చదువుతుంటే అచ్చం మన యదార్థ జీవితాలే అనిపిస్తాయి. ప్రతీ అంశం మనతో మమేకమైనట్లుగా ఉంటుంది. కవితలను చదువుతుంటే మన లోకంలో ఉండము. కుంచెకు అమ్మపై ఎంత ప్రేమ ఉంటే అంత గాఢంగా రాయగలడు. అలా రాసాడు కాబట్టే కుంచె కవిత్వంతో మనం కూడా అంత దగ్గరగా వెళ్ళి కనెక్ట్ అవుతున్నాము. అమ్మ గురించి ఎంత చెప్పినా, ఎంత విన్న తనవితీరదు. అమ్మ గురించి ఏమి రాసినా కమ్మగానే ఉంటుంది. రవి గాంచనచో కవి గాంచును అన్నాడో ఓ కవి. అంటే సూర్యుడు కూడా సందర్శించని వాటిని కూడా కవి చూడగలడు. అలాగా కుంచె అమ్మ చూసే ప్రతీ చూపును, ప్రతీ ప్రేమను, ప్రతీ అనురాగాన్ని, ప్రతీ ఆత్మీయతను కుంచె అమ్మ మనసును ” అమ్మపేరే నాకవిత్వం ” కవితా సంపుటిలో ఒక శిల్పి శిల్పానికీ ఎలా రూపాన్ని కల్పిస్తాడో అలా ఓ కొత్త రీతిలో అమ్మతనాన్ని తెలియజేశాడు.

సమీక్షకులు డా షేక్ ఇబ్రహీం షా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X