హైదరాబాద్ : ‘‘ఉరిశిక్ష వేసే ముందు మీ చివరి కోరిక ఏమిటని బీజేపీలో కమిట్ మెంట్ తో పనిచేసే ఏ కార్యకర్తను అడిగితే చెప్పేది ఒక్కటే ‘‘నేను చచ్చిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలని అడుగుతారు. నాది అదే చివరి కోరిక కూడా’’. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ కొందరు ఫాల్తుగాళ్లు ప్రచారం చేస్తున్నారని, అట్లాంటి వాటికి స్పందించాల్సిన అవసరమే లేదని చెప్పారు.
ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు. బండి సంజయ్ వస్తున్నారని సమాచారం అందుకున్న కార్యకర్తలు భారీ ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. బీజేపీ జిందాబాద్, మోదీ జిందాబాద్, బండి సంజయ్ జిందాబాద్, రామచంద్రరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సంజయ్ ఆప్ సంఘర్ష్ కరో…హమ్ తుమ్హారే సాథ్ హై అంటూ నినదించారు. అనంతరం బండి సంజయ్ ను కలిసి సంఘీభావం ప్రకటిస్తూ పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దాదాపు 2 గంటలపాటు పార్టీ కార్యకర్తలతో గడిపిన బండి సంజయ్ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులతో కలిసి మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు… ముఖ్యాంశాలు..
Also Read-
ప్ర : మీరు కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి కదా?
బండి సంజయ్ అంటే ఏమిటో మీకు తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలుసు. కార్యకర్తలందరికీ తెలుసు. ఫాల్తుగాళ్లు చేసే ప్రచారానికి స్పందించాల్సిన అవసరమే లేదు. బీజేపీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో ఎంతో మంది కార్యకర్తలను తయారు చేసిన వ్యక్తులం మేం. ఎవరికైనా ఉరి తీయబోయే ముందు చివరి కోరిక అడుగుతారు. బీజేపీలో కమిట్ మెంట్ ఉన్న కార్యకర్తలను ఇదే విషయాన్ని అడిగితే చెప్పేది ఒక్కటే ‘‘నేను చచ్చిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలని అడుగుతారు. నాది అదే చివరి కోరిక కూడా’’.
ప్ర : మిమ్ముల్ని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయబోతున్నారని కొన్ని టీవీలు, డిజిటల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కదా?
తెలంగాణలో బీఆర్ఎస్ కు 17 ఎంపీ సీట్లున్నాయి కదా? ఆయన భాగస్వామ్యంతోనే కేంద్రంలోని ఎన్డీఏ నడుస్తోంది కదా? బహుశా నన్ను బర్త్ రఫ్ చేయాలనే నిర్ణయం కేసీఆర్, ఆయన కొడుకే తీసుకున్నట్లున్నారు. ఇంకా ఏమోం చేయబోతున్నారే వాళ్లనే అడగండి(కేసీఆర్, కేటీఆర్ లను ఎద్దేవా చేస్తూ వేసిన సెటైర్)
ప్ర : మిమ్ముల్ని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కదా?
కేసీఆర్ కొడుకు విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి ఒకట్రొండు ఛానళ్లు ఇట్లాంటి కథలను ప్రసారం చేస్తున్నాయి. అది చూసి కేసీఆర్ కొడుకు రాక్షసానందం పొందుతున్నడు. వాళ్ల ద్రుష్టితో చూస్తే నన్ను అరెస్ట్ చేయాల్సిందేమో. ఎందుకంటే… 10 ఏళ్ల బీఆర్ఎస్ గడీల పాలనను బద్దలు కొట్టినం కదా? పదేళ్ల కేసీఆర్ కుటుంబ అవినీతి అరాచక పాలనను బొందపెట్టినం కదా? అధికారం పోయిందనే కోపం వాళ్లకుంటది కదా? అందుకే నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తున్నరేమో.
ప్ర : బండి భగీరథ్ విషయంలో మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరెస్ట్ కాకుండా జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి కదా?
కోర్టు పరిధిలో ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. కన్న కొడుకును ఒక తండ్రి నేరుగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా? కానీ నేను విచారణ జరపాలని పోలీసులు కోరితే… నేనే మా అబ్బాయిని పోలీసు విచారణ కోసం అప్పగించా. నేను ప్రజల మధ్య ఉన్నాను కాబట్టే, ప్రజలు బీజేపీతో ఉన్నారు కాబట్టే నన్ను, నా పార్టీని బదనాం చేసేందుకు కేసీఆర్ కొడుకు సోషల్ మీడియాలో ఫేక్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా నాపైన ఇట్లాంటి విష ప్రచారం చేయిస్తున్నాడు. ఎన్ని వండి వార్చినా జనం బీజేపీతోనే ఉన్నారు. ఫేక్ వార్తలను, ఫేక్ స్టోరీలను చూసి జనం నవ్వుకుంటున్నారు.
