“దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది”

హైదరాబాద్ : భారతదేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది” అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి జె. పి. నడ్డా గారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం – దౌత్యం – అభివృద్ధి’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ వారసత్వ, తుష్టీకరణ రాజకీయాలకు స్వస్తి పలికి, ‘అభివృద్ధి – జవాబుదారీతనం’ ఆధారంగా భారత రాజకీయ సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. ఒకప్పుడు కేవలం కులాలకో, కొన్ని వర్గాలకో పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని మార్చి, నేడు దేశంలో ఏడాదికి 800 కోట్ల మంది ప్రయాణికులను మోస్తున్న భారతీయ రైల్వేలను అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాల మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించామని గుర్తుచేశారు. ‘వసుధైవ కుటుంబకమ్’ స్ఫూర్తితో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్ వంటి పొరుగు దేశాలకు రైల్వే సాంకేతికతను, లోకోమోటివ్‌లను అందిస్తూ బాసటగా నిలిచామని, కరోనా సమయంలో ‘వ్యాక్సిన్ మైత్రి’ ద్వారా 100 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసి, అందులో 45 దేశాలకు ఉచితంగా అందించి భారత్ ఇప్పుడు ‘ఇచ్చే దేశం’గా మారిందని చాటిచెప్పారు.

దేశీయంగా 4.3 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం, ఊరూరా డిజిటల్ విప్లవం ద్వారా సామాన్యులను బలోపేతం చేశామని, రూ. 51 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (DBT) వేసి రూ. 4.3 లక్షల కోట్ల అవినీతి లీకేజీలను అరికట్టామని వివరించారు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల టాయిలెట్లు నిర్మించి మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చామని, దేశంలో 3 కోట్ల మంది ‘లఖపతి దీదీలను’ తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం తెలంగాణలోనే 17.17 లక్షల మంది లఖపతి దీదీలు తయారయ్యారని హర్షం వ్యక్తం చేశారు.

Also Read-

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా 62 కోట్ల మందికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య రక్షణ లభిస్తోందని, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించే ‘వయో వందన యోజన’ను కూడా తెచ్చామని చెప్పారు. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ను దాదాపు రూ. 1,000 కోట్లతో 22 మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 1,000 కి పైగా పడకల సామర్థ్యంతో ప్రపంచ స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

దేశీయంగా రక్షణ రంగ బలోపేతం వల్ల నక్సలిజం 126 జిల్లాల నుండి కేవలం 2 జిల్లాలకే పరిమితమైందని, అలాగే ఆర్థిక వృద్ధిలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతోందని చెప్పారు. కేంద్రం పన్నుల వాటా కింద తెలంగాణకు రూ. 2.74 లక్షల కోట్లు, జాతీయ రహదారుల కోసం రూ. 1.74 లక్షల కోట్లు, పవర్ ప్రాజెక్టుల కోసం రూ. 44,400 కోట్లు కేటాయించిందని స్పష్టం చేస్తూ.. ఇన్ని నిధులు ఇస్తున్నా రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీకి తరలిస్తూ ఒక ‘ఏటీఎం’లా వాడుకుంటోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట అదే తరహా అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. 2047 నాటికి భారతదేశాన్ని “వికసిత్ భారత్” గా మార్చే ప్రధాని మోదీ సంకల్పంలో మేధావులంతా భాగస్వాములై సమాజంలో ఈ గళాన్ని మరింత బలంగా వినిపించాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X