హైదరాబాద్ : అంబర్పేట్ లో జరిగిన బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గోని ప్రసంగించారు. ఆయన మాట్లాడతూ 2004లో తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసిన ఏకైక ఎమ్మెల్యేగా నన్ను అంబర్పేట్ నుంచి గెలిపించి, పార్టీకి తలెత్తుకుని నిలబడే అవకాశం కల్పించింది అంబర్పేట్ ప్రజలే. అందుకు అంబర్పేట్ ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2009లో తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా అంబర్పేట్ ప్రజల పాత్ర ఎంతో గొప్పది. మీ కష్టం, మీ శ్రమ, మీ అంకితభావంతో పార్టీ ఆ రోజు తలెత్తుకుని నిలబడగలిగింది. నరేంద్ర, ఆ తర్వాత దత్తాత్రేయ, నన్ను కూడా మీరు ప్రేమతో, ఆదరణతో గెలిపించిన విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మన ప్రాంతం నుంచి మూడు డివిజన్లలో విజయం సాధించాం. మొదటి నుంచి కూడా అంబర్పేట్ భారతీయ జనతా పార్టీకి బలమైన అడ్డాగా నిలిచింది. ఒకప్పుడు వర్షం వస్తే అంబర్పేట్, బాగ్ అంబర్పేట్, బర్కత్‌పురా, కాచిగూడ ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్యలు ఉండేవి. ప్రభుత్వం మనది కాకపోయినా, ప్రజల సహకారంతో, అప్పటి ముఖ్యమంత్రులను ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశాం.
అంబర్‌పేట్‌లో 21 పక్కా ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మించాం. రాష్ట్రంలోనే ఉత్తమ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అంబర్పేట్ ఒకటి. ఈరోజు కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉంది. పాఠశాలల్లో ఫర్నిచర్, స్మార్ట్ క్లాసులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పెరగడంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మూతపడగా, అక్కడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అంబర్పేట్ నియోజకవర్గంలో వందకు పైగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. గోల్నాకలో మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి అత్యాధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశాం.
Also Read-
రాష్ట్రంలోనే సొంత భవనం కలిగిన ఏకైక బీసీ హాస్టల్‌ను అంబర్‌పేట్‌లో నిర్మించాం. మూడు దోబీ ఘాట్లను అభివృద్ధి చేశాం. రూ. 360 కోట్లతో ఐదు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం. రాబోయే అనేక సంవత్సరాల వరకు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో ఈ పనులు చేపట్టాం. బాగ్ అంబర్పేట్, బర్కత్‌పురా తదితర ప్రాంతాల్లో అనేక పార్కులు అభివృద్ధి చేశాం. నలభై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంబర్పేట్ ఫ్లైఓవర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మించింది.
కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లో లైబ్రరీలకు సొంత భవనాలు నిర్మించాం. అంగన్వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానాలను అభివృద్ధి చేశాం. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానాల అభివృద్ధి కొనసాగుతోంది. శ్మశాన వాటికల అభివృద్ధి, పేదల గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టాం. గోల్నాక, నల్లకుంట, బాగ్ అంబర్పేట్ ప్రాంతాల్లో హౌసింగ్ స్కీమ్స్ నిర్మించాం. కానీ బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ ఒక్క ఇల్లైనా నిర్మించి చూపించాలని నేను సవాల్ విసురుతున్నాను.
అంబర్పేట్ మహంకాళి దేవాలయం ఎదుట ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం చేపడుతుంటే, కొంతమంది మజ్లిస్ నాయకులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కై అక్కడ చెత్తకుప్ప, మట్టికుప్పలను తొలగించకుండా అడ్డంకులు సృష్టించారు. మూడు సంవత్సరాలుగా ఒక చెత్తకుప్ప, ఒక మట్టికుప్ప కోసం పోలీసులు బందోబస్తు నిర్వహించడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులు తీసుకున్నప్పటికీ, పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు మోదీ గారికి, బీజేపీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు.
అంబర్‌పేట్‌లో అభివృద్ధి కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యపై నేను కేసీఆర్ కి, రేవంత్ రెడ్డి కి లేఖలు రాశాను. అందరూ అంగీకరిస్తామని చెబుతున్నారు, కానీ పని మాత్రం జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు కలిసి పోరాటం చేయాలి. ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ చెత్తకుప్ప, మట్టికుప్ప తొలగింపులో అడ్డంకులు కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా అవాంఛనీయ పరిస్థితి తలెత్తితే దానికి బాధ్యత కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారిదేనని స్పష్టం చేస్తున్నాను.
రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణంగా మెట్రో రెండో దశ ప్రాజెక్టును ప్రస్తావిస్తున్నారు. మొదటి దశ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అందించింది. మోదీ మొదటి దశ మెట్రోను ప్రారంభించారు. ఇప్పుడు రెండో దశ మెట్రోకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మేము యాభై శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రాజీనామా ఎందుకు చేయాలి?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గార్లు ఇచ్చిన హామీల ఆధారంగానే ప్రజలు ఓట్లు వేశారు. కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినా వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీసీలకు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులు ఎక్కడ? బీసీల అభివృద్ధికి ఏమి చేశారు? సమాధానం చెప్పాలి. దళిత కుటుంబాలకు రూ. 12 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. ఒక్క కుటుంబానికైనా ఇచ్చారా? దళితులను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.
నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రెండున్నర సంవత్సరాలుగా ఎంతమందికి ఇచ్చారో ప్రజలకు చెప్పాలి. జాబ్ క్యాలెండర్ లేదు, నియామకాలపై స్పష్టత లేదు. 2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. తెలంగాణ మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వడం లేదు? ఆడబిడ్డలకు స్కూటర్లు ఇస్తామని చెప్పారు, ఎంతమందికి ఇచ్చారు? పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని చెప్పారు, ఎందుకు అమలు చేయలేదు? విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా ఇస్తామని, చదువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రకటించిన ఆ హామీ ఏమైంది? తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆటలాడుతున్నారు?
రైతుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు భారీగా నిధులు అందిస్తోంది. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. సన్నబియ్యం పంపిణీలో కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రధాన భారం భరిస్తోంది. ఎన్నికల సమయంలో క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు. అన్ని ధాన్యాలకు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ఒక రకానికి మాత్రమే పరిమితం చేశారు. అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.
కౌలు రైతులకు ఎకరానికి రూ. 12,000 ఇస్తామని, రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కానీ ఎవరికీ ఇవ్వలేదు. రైతులు, రైతు కూలీలకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా హైదరాబాద్‌లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, అంబర్పేట్ ప్రజలు ఈ పరిస్థితులను ఆలోచించాలి. హైదరాబాద్‌ను రక్షించుకోవాలి. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాను.
