హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ని మహబూబ్ నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. దాదాపుగా పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు.
మహబూబ్ నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని సైతం వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తరిమికొడతారని కె.టి.ఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో మాదిరి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదని, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ దే అని కె.టి.ఆర్ గుర్తు చేశారు.
ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకువెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కె.టి.ఆర్ సూచించారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలన్నారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీరు అందకుండా ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు అందకుండా వెనుకబాటు జిల్లాగా చేసిన ద్రోహం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొనసాగిస్తున్నదన్నారు.
Also Read-
ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కె.టి.ఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి గారి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన కె.టి.ఆర్ నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును ఆయన సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన నియోజకవర్గాల వారీగా చర్చించారు.
కె.టి.ఆర్ పార్టీ నేతలకు రానున్న ఎన్నికలకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపైన దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోని బూత్ వారీగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా కలిసికట్టుగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను, ఫీడ్ బ్యాక్ ని కె.టి.ఆర్ కి అందించారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించారని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో భారత రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని కె.టి.ఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేతలను ఆదేశించారు.
