దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పీఎఫ్ ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’ లో భాగంగా ఇంటి నుంచి పారిపోయిన, తప్పిపోయిన మరియు ఆపదలో ఉన్న 512 చిన్నారుల రక్షణ
హైదరాబాద్ : రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్) ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉంటూ, నేరస్థులపై అవిశ్రాంతంగా పోరాడుతూ, అత్యంత పిల్లల ప్రాణాలను నిశ్శబ్దంగా కాపాడుతోంది. ఈ ఒరవడిని కొనసాగిస్తూ, దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పీఎఫ్, ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’ కార్యక్రమం కింద ఇంటి నుంచి పారిపోయిన, తప్పిపోయిన మరియు ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించి, రక్షించి, వారి కుటుంబాలతో తిరిగి కలిపే పక్రియలో కీలక పాత్ర పోషిస్తూ విశేష సేవలను అందిస్తోంది.

ఆపరేషన్ నన్హే ఫరిష్తే’లో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్), 2026 జనవరి నుండి మే నెలల మధ్య రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో అసురక్షిత పరిస్థితుల్లో గుర్తించిన 512మంది చిన్నారులను రక్షించి, పునరావాసం కల్పించింది. రక్షించబడిన పిల్లలలో 421 మంది బాలురు, 91 మంది బాలికలను తదుపరి సంరక్షణ కోసం బాల సంక్షేమ కమిటీకి సురక్షితంగా అప్పగించబడ్డారు. ఈ దళం యొక్క నిరంతర కృషి ఫలితంగా 2025 సంవత్సరంలో 1622 మంది పిల్లలను, 2024 సంవత్సరంలో 1390 మంది పిల్లలను రక్షించడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క భారీ స్థాయి కార్యాచరణ, పిల్లలను రక్షించడంలో మరియు వారిని సురక్షితంగా వారి కుటుంబాలకు తిరిగి చేర్చడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది యొక్క అచంచలమైన సంకల్పా న్ని నొక్కి చెబుతుంది.

రైల్వే రక్షణ దళం బృందాలు (ఆర్‌పీఎఫ్) ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’ లో భాగంగా రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో ఇబ్బందుల్లో లేదా ప్రమాదంలో ఉన్న పిల్లలను గుర్తించడానికి క్రమం తప్పకుండా నిఘా మరియు క్షుణ్ణమైన పర్యవేక్షణను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, పిల్లల రక్షణ సంస్థలతో సమన్వయం చేస్తూ, తక్షణ జోక్యం మరియు పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా, పిల్లలలోని ఆందోళన, బలహీనత యొక్క సూక్ష్మమైన ఇబ్బందికరమైన సంకేతాలను గుర్తించి, సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆర్పీఎఫ్ సిబ్బంది కోసం నిరంతర అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
Also Read-

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’ కింద ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించడంలో విశేష సేవలందిస్తున్న రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) బృందాన్ని అభినందించారు. ఇదే అంకితభావం, అప్రమత్తతతో భవిష్యత్తులోకూడా ఈ సేవలను కొనసాగించాలని ఆయన సూచించారు. అదేవిధంగా, ఈ మహత్తర కార్యక్రమానికి తోడ్పాటుగా రైల్వే ప్రయాణికులు, ఆర్పీఎఫ్‌కు కళ్లు, చెవులుగా ఉండి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ఉన్న లేదా ఆందోళనకర పరిస్థితుల్లో కనిపించే ఏ చిన్నారినైనా గమనించిన వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫోన్ చేసి ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
