హైదరాబాద్ : తెలంణాగ రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు…వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్ను ఎత్తగొట్టేందుకు…ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదాని వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదన్నారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు నిన్న క్యాబినెట్లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ (Prepaid) మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో వ్యవసాయాలకు ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయన్నారు.

మోటార్లకు మీటర్లు రాకముందే… ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేక ముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రల పైన తిరగబడాలని కోరారు. ఎన్నికల ముందే ప్రజలకు భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని… ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్తారని కెసిఆర్ హెచ్చరించారని కేటీఆర్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణం అన్నారు.

ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత ఒత్తిడి చేసినా, 30 వేల కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ ఎదిరించారు, మీటర్లు పెట్టలేదు. కానీ, రానున్న మూడు నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేటీఆర్ అన్నారు. రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ను ఎత్తగొట్టడం కోసమే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఉచిత కరెంట్ ను రద్దు చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే అదాని, అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలన్న లక్ష్యంతోనే క్యాబినెట్ నిన్న ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు.

Also Read-

కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారని కేటీఆర్ అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి పైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.

త్వరలోనే సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది వరకే పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తాము. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పన్న, అన్యాయాల పైన, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరు పైన కూడా అవగాహన కల్పిస్తాము అన్నారు. ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.

ఈరోజు అంబర్పేట నియోజకవర్గం లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కేవలం గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టని రేవంత్ రెడ్డి, అడ్డగోలుగా ‘హైడ్రా’ పేరుతో వేల ఇండ్లు కూలగొట్టారు అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టింది అన్నారు.

ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ, ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) అంటూ అడ్డగోలు మాటలు చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఉన్న నగరాన్ని పట్టించుకోవడం చేతగాని ముఖ్యమంత్రి, ఫ్యూచర్ సిటీ పేరుతో పోజులు కొడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఉన్న హైదరాబాద్ నగరంలో కనీసం మోరి తీసి చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరన్నారు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతా అంటే పట్టించుకునేది ఎవరు అని ప్రశ్నించారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో మూసిని ప్రక్షాళన చేస్తా అంటున్న ముఖ్యమంత్రి ఆలోచన పైన, ప్రణాళికల పైన కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వం హయాంలోనే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి, దాదాపుగా పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆల్రెడీ ముగిసిపోయిన మూసి ప్రక్షాళన పైన రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే మాట్లాడుతున్నారు అన్నారు. ఎలాంటి విద్వంసం లేకుండా, ఎలాంటి ఇండ్ల తొలగింపు లేకుండా మూసి ప్రక్షాళన చేయాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు.

ఇప్పటికే గత ప్రభుత్వం మూసి పైన ఎస్టీపీల (STP) నిర్మాణము, బ్రిడ్జిల నిర్మాణము వంటివన్నీ ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు మళ్లీ లక్షన్నర కోట్లతో మూసి ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకు అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X