హైదరాబాద్ : సిద్దిపేటలో జరిగిన రెండు రోజుల ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతులు’ (శిక్షణా తరగతులు) ముగింపు సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారి క్రమశిక్షణతో కూడిన భాగస్వామ్యాన్ని అభినందించారు.
భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిర్మాణంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. కార్యకర్తలలో సైద్ధాంతిక నిబద్ధత, సంస్థాగత క్రమశిక్షణ, పనితీరు, పార్టీ చరిత్ర మరియు దేశభక్తిని పెంపొందించడమే ఈ తరగతుల ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు సీట్ల స్థాయి నుండి నేడు వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బిజెపి ఎదగడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్ పేయి గారి హయాంలో, నరేంద్ర మోదీ గారి పాలనలోనే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా నిజమైన గుర్తింపు లభించిందని రాంచందర్ రావు గారు అన్నారు.

గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, మోదీ గారి నాయకత్వంలో కేవలం 12 ఏళ్లలోనే జరిగిందని ఆయన చెప్పారు. భారత్ నేడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ప్రధాని మోదీ సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ చూపిన నిర్ణయాత్మక నాయకత్వమే ‘వికసిత్ భారత్’కు పునాది అని ఆయన అన్నారు.
Also Read-
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు ఎంఐఎం పార్టీలు ఎస్‌ఐఆర్ (SIR) విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ అనేది బిజెపి కార్యక్రమం కాదని, ఇది భారత ఎన్నికల సంఘం క్రమపద్ధతిలో, రాజ్యాంగబద్ధంగా ఓటర్ల జాబితాను శుద్ధి చేసి అప్‌డేట్ చేసే ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. 1951 నుండి ఇలాంటి ఓటర్ల జాబితా సవరణలు అనేకసార్లు జరిగాయని, చివరిసారిగా 2002లో సమగ్ర సవరణ జరిగిందని గుర్తు చేశారు. 2002 నుండి 2026 వరకు చాలా మంది మరణించి ఉండవచ్చు, నివాసాలు మారి ఉండవచ్చు లేదా ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదై ఉండవచ్.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ. 13 లక్షల కోట్లు కేటాయించిందని, జాతీయ రహదారులు, జహీరాబాద్ పారిశ్రామిక వాడ, టెక్స్‌టైల్ పార్క్ వంటి అనేక ప్రాజెక్టులు ప్రధాని మోదీ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రం ఏమీ ఇవ్వలేదని అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బిజెపిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ అవినీతికి ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడిన తెలంగాణలో నేడు నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, జాబ్ క్యాలెండర్ ఏదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఇరు పార్టీల్లో నాయకులు ఒకరికొకరు అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణకు కోరాలని, ఫార్ములా-ఈ రేస్ లో అవినీతిపై పారదర్శకంగా విచారణ చేయాలని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
ఎస్‌ఐఆర్ (SIR) అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఒక సాధారణ మరియు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దీనిని బిజెపికి ఆపాదించడం విడ్డూరమని ఆయన అన్నారు. ఇది 2002లో కూడా జరిగిందని, అప్పట్లో దీనిని ఎవరూ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద, ఇప్పుడు ఎస్‌ఐఆర్ మీద నిందలు వేస్తున్నాయని, ఇవన్నీ కేవలం రాజకీయ డ్రామాలేనని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు రైతుల ధాన్యం కొనుగోలులో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడాని ప్రధాని మోదీ గారిని నిందించడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బిజెపికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ, తెలంగాణలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ను తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి “నేషన్ ఫస్ట్” అని నమ్ముతుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మాత్రం అధికారం-అవినీతే ప్రధానమని ఆయన ఆరోపించారు.
