హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద, నిధులు విడుదల చేయడంలో లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే, అనుచరులను సంతృప్తి పరచడం పైనే దృష్టి ఉందని ఎద్దేవా చేసారు. రాష్ట్ర ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్ పర్సన్లు ప్రకటించడం పట్ల హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మరి కొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో, మొదటి దఫాలో నియమితులైన చైర్మన్లు ప్రజలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా వారి పదవీకాలాన్ని ముగించారని గుర్తు చేశారు. 33 కార్పొరేషన్లకు గాను 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు ఉద్దేశ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
Also Read-
మాల, మాదిగ, సంతు సేవాలాల్, కొముం భీం, ఏకలవ్య, మైనార్టీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం వారి పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనం అన్నారు. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, వాల్మీకి, బోయ తదితర కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలా మొత్తంగా 33 కార్పొరేషన్లకు గాను ఇప్పటి వరకు 14,521 కోట్లు కేటాయించగా, విడుదల చేసింది 3198 కోట్లు మాత్రమే అని, వినియోగించింది 305 కోట్లు మాత్రమే అని వెల్లడించారు.
ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే, ప్రభుత్వం నుండి సరైన సమాధానం లేదన్నారు. రేవంతు పాలనలో కుల వృత్తులను ఆదుకునే ఏ పథకం లేకేపోగా, కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలన్నీ స్తంభించి పోయాయన్నారు. వారి ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోతుందన్ని వాపోయారు. నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి చేతులు దులుపుకోవడం మానేసి, ఆయా కులాల సంక్షేమం, సమగ్ర అభివృద్ది కోసం నిధులు కేటాయించాలని, వాటిని వినియోగించాలని, బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
