హైదరాబాద్ : రైతులు పండించిన పంటలను కొంటారా లేదా 70 లక్షల తెలంగాణ రైతన్నల చేతిలో తన్నులు తింటారా అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రైతన్నల పంటలను కొనకుంటే గ్రామ గ్రామాన తెలంగాణ రైతన్నలు నాగళ్లను మడత పెట్టి మరి సరిహద్దుల వరకు ఉరికిస్తారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రైతన్నల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయొద్దని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణలో రైతన్నల పంటలు అన్ని చివరి గింజ దాకా కొనేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ఇచ్చి సరిగ్గా నాలుగు సంవత్సరాలైనా ఒక్క హామీని నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ సదస్సు సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్న తీరుపైన విరుచుకుపడ్డారు.

రైతన్నలు ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యల గురించి ఆలోచించవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కాలర్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని, గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను తన్ని తరిముదాము కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం కొన్న పంటలకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న ఏకైక ఉద్దేశంతోనే రాష్ట్రంలోని రైతన్నలను మోసం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు.
Also Read-
రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే రైతన్నల కష్టాలను పట్టించుకోవాలని, లేకుంటే తెలంగాణ రైతన్నలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరిముతామని హెచ్చరించారు. గత 48 గంటల్లో దాదాపు ఎనిమిది మంది రైతన్నలు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమన్నారు.
రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని చేతగాని దద్దమ్మ దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో రైతన్నలను నిండా ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీని తెచ్చి రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలు ఇచ్చి రైతులతో ఓట్లు వేయించుకున్నదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ రైతు హామీలు ఇచ్చి డిక్లరేషన్ పేరిట ఓట్లు దోచుకొని ఢిల్లీకి పారిపోయారని, తెలంగాణ రైతన్నలు ఆత్మహత్యల పాలవుతుంటే, అవస్థలకు గురవుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
రైతు భరోసా, రైతు రుణమాఫీ, పంటలకు బోనస్, పంటల కొనుగోళ్లు, యూరియా సరఫరా, కరెంటు కోతలు ఇలా రాష్ట్ర రైతాంగం పూర్తి సంక్షోభం దిశగా పోతున్నదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేల్కొని రైతన్నల కష్టాల పైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రైతన్నలు ఇంత అవస్థలు పడుతుంటే సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీ రైతు వారోత్సవాలు, రైతు మేళాల పేరిట టైం పాస్ చేస్తున్నదన్నారు.
ఎన్నికల ముందు 50 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చివరికి 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే చేసి రైతులను మోసం చేయడంతో అనేకమంది రైతన్నలు అప్పుల పాలయ్యారన్నారు. రైతులను రెచ్చగొట్టి బ్యాంకుల నుంచి రెండు లక్షల రుణాలు తెచ్చుకోవాలి, మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. రైతుల ఖాతాల్లో రైతు బంధు రావడం లేదు కానీ రాహుల్ గాంధీకి మాత్రం ప్రతి నెల టంచనుగా డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టి మరి రైతులకు రుణమాఫీ అంశంలో చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని సవాలు చేస్తే పారిపోయిన పిరికిపంద అని కేటీఆర్ అన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు అడ్రస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం, భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగానికి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, పాముకాట్లు, వ్యవసాయ సంక్షోభం వంటి అన్ని సమస్యలు తిరిగి వస్తున్నాయి అన్నారు.
వ్యవసాయ సంక్షేమ పథకాలు అన్నింటిని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మూడేళ్ల లోపే మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఎవరికి దోచి పెట్టిందని కేటీఆర్ ప్రశ్నించాడు. కనీసం ఎరువులు ఇవ్వడం చేతకాని ఎధవల సర్కార్ కాంగ్రెస్ పార్టీ అని పంటల కొనుగోలును పక్కకు పెట్టి కమిషన్లు, కాంట్రాక్టుల పైననే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిందన్నారు. రైతులు ఎండల్లో నిలబడి చక్కర వచ్చి పడిగాపులు పడి పడిపోతుంటే ఢిల్లీకి విమానాల్లో చక్కర్లు కొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇంత వ్యవసాయ సంక్షోభ పరిస్థితులు ఉన్నా రైతు మరణాలు కొనసాగుతున్న ఇప్పటిదాకా ఒక్క సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించిన పాపాన పోలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీ దేశంలో జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలనే కొనసాగిస్తుందన్నారు. బీజేపీ పార్టీ కూడా నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల నిరసనతో వెనక్కి తగ్గిందని స్వయంగా ప్రధాన మంత్రి క్షమాపణ కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాలుగు పంట సీజన్లు వచ్చినయి కానీ పండించిన పంటను కొనుగోలు చేయమన్న ప్రతిసారి రైతులకు కష్టాలే ఎదురవుతున్నాయని, కొనుగోలు కేంద్రాలు పెట్టక, పెట్టిన కొనుగోలు కేంద్రాలలో పంటను కొనుగోలు చేయక తీవ్రంగా అవస్థల పాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా రైతన్నల పంటలను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, ఆత్మహత్యలకు సంతాపం ప్రకటించి రైతు మరణాల పాలైన రైతన్నలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ ను సంపూర్ణంగా అమలు చేయాలని, రైతుల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా బకాయిలు చెల్లించాలని తీర్మానాలు చేశారు.
