హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? నాదర్గుల్ లో బడా బాబులు చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతుందా?

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ నాదర్గుల్ కు చెందిన వందలాది మంది రైతులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారిని కలిశారు. కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయ బోర్లు, దాడుల్లో గాయపడిన ఫొటోలు, వీడియోలను హరీశ్ రావుకు చూపించి తమ గోసను వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు విన్న హరీశ్ రావు తక్షణమే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. నాదర్గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టు వరకు న్యాయపోరాటం చేసిందని గుర్తుచేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రా తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. నాదర్గుల్ లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబందులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారు? హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూములను, అందులోని చెరువులను, ఫీడర్ ఛానల్ ను ధ్వంసం చేస్తూ కంచెలు వేసి కబ్జా చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఉందా? అని ధ్వజమెత్తారు. రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హరీశ్ రావు గారు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

Also Read-

కలెక్టర్,ఆర్డీవోలతో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ సీలింగ్ భూములకు కలెక్టర్, ఆర్డీవోలే కస్టోడియన్లుగా ఉంటారు. ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో మీరే ఫైల్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు కంచెలు వేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు.. వెంటనే ఆ కంచెలు తొలగించి, తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మళ్లీ సాగు చేసుకునే అవకాశం కల్పించండి. ముదిరాజ్ లకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పించి, చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానళ్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. గుడిలో పూజలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని అధికారులను కోరారు.

ఎమ్మార్వోతో మాట్లాడుతూ.. అది ప్రభుత్వ భూమి అయినప్పుడు, అందులోకి అక్రమంగా ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులు, రౌడీలపై ప్రభుత్వ అధికారిగా ఎమ్మార్వో పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదు? వెంటనే కబ్జాదారులను వెళ్లగొట్టి వాళ్లపై కేసు పెట్టండి అని సూచించారు.

సీపీ సజ్జనార్ తో హరీష్ రావు మాట్లాడుతూ.. ఆదిభట్ల పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు. రైతులు ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు. పైగా రైతులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. గుడికి, చెరువుకు వెళ్తున్న స్థానికులపై దాడి చేసిన కబ్జాదారుల రౌడీలపై వెంటనే కేసులు నమోదు చేసి రైతులను రక్షించాలి. రైతుల తరపున కూడా పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో తానే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ బృందంతో నాదర్గుల్ భూములను సందర్శిస్తానని అధికారులకు తేల్చిచెప్పారు.

హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు…
హరీశ్ రావు గారు వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని, ఆయన స్వయంగా అధికారులతో మాట్లాడిన తర్వాతే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, మీరు తప్పకుండా భూములను సందర్శించి మాకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు హరీశ్ రావును కోరారు.

హరీశ్ రావు గారి చొరవతో, ఫోన్ లో సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులు.. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, రైతులకు న్యాయం చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పేద రైతుల పక్షానే నిలబడుతుందని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హరీశ్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.

నాదర్గుల్ భూముల అసలు విషయం..
దాదాపు 70 ఏళ్లుగా శిస్తు చెల్లిస్తూ ఆ రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుని బోర్లు, బావులు తవ్వుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ, ఎప్పుడో రద్దయిన శివరాజ్ బహదూర్ జాగీర్దార్ వారసుల పేరుతో నకిలీ ఏజీపీఏ పత్రాలను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ భూములపై కన్నేశాయి. పోలీసుల అండదండలతో స్థానిక ఆదిభట్ల పోలీసులు, రౌడీషీటర్లను ఉసిగొల్పి రైతులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు.

పచ్చని పొలాల చుట్టూ రేకులతో కంచె వేసి, రైతుల బోర్లను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేశారు. ఇదేంటని అడిగిన రైతులపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న చెరువులో ముదిరాజ్ లను చేపలు పట్టుకోనివ్వకుండా, కనీసం తాతల కాలం నాటి నుంచి ఉన్న తమ గుడికి వెళ్లకుండా దాడులు చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X