న్యూఢిల్లీ : పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానం. అప్పుడే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుపై ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి.. ప్రశ్నించాలి.. సమస్యలను లేవనెత్తాలి. అంతేకానీ చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదు. ఒకప్పటి రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. కానీ ఈ తరం రాజకీయాలు, రాజకీయ విలువలు దిగజారుతున్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. ‘సంసద్ రత్న’ అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడతూ ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉంది. చొక్కాలు విప్పామని ఒక పార్టీ, విప్పించామని మరోపార్టీ సంబరపడుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుంది. ప్రజలు రాజకీయ నాయకుల ప్రవర్తనను నిశితంగా గమనిస్తుంటారు. అందుకే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
ఒక రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా ప్రజాస్వామ్యం గొప్పతనం వల్లే సాధ్యమైంది. చట్టసభల్లో అటల్ బిహారీ వాజపేయి, పీవీ నరసింహారావు, మొరార్జీ దేశాయ్ లాంటి ఎందరో మహానుభావుల ప్రసంగాలు వింటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నా జీవితంలో ఏనాడూ అసెంబ్లీ వెల్ లోకి అడుగుపెట్టలేదు. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరు కాలేదు. తొలిరోజు నుంచి మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల వరకు సెషన్ నడిచిన ప్రతిరోజూ సభకు హాజరయ్యాను.

పార్లమెంటులో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య అభిప్రాయ భేదాలుండటం సహజం. ప్రభుత్వం తీరు నచ్చకపోతే విపక్షాలు.. సునిశితంగా విమర్శించాలి (స్పీక్ ఔట్).. లేదంటే వాకౌట్ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెబుతుండేవారు. కానీ.. ఇటీవలి కాలంలో పరిస్థితులు మారిపోయాయి. స్పీకౌట్, వాకౌట్ కు బదులుగా.. పార్లమెంటులో గందరగోళం సృష్టించడంపైనే విపక్షాలు దృష్టిసారించాయి. వేర్వేరు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు.. వివిధ పార్టీలు, వివిధ సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి వచ్చిన వారు.. ప్రజాసమస్యలపై కలసి పనిచేయాలి తప్ప.. పార్లమెంటును, అసెంబ్లీని స్తంభింపజేస్తే అది ప్రజలను అగౌరవపరిచినట్లే. ప్రజల్లో రాజకీయ చైతన్యం ఉంటుంది.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో.. వివిధ అంశాలపై అవగాహన కూడా పెరిగింది. అన్నీ ఆలోచించే.. వారు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటున్నారు.
వారి నమ్మకానికి తగ్గట్టుగా వారికి సేవ చేయడం, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. పార్టీల సిద్ధాంతాలు వేరైనా దేశానికి సంబంధించిన అంశాలపై అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని అబ్దుల్ కలాం పిలుపునిచ్చేవారు. ప్రతి పార్టీ కూడా అంతర్జాతీయ వేదికలపై జాతీయ అంశాలపై మాట్లాడేటప్పుడు మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా వ్యవహరించాలి. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు, నిందలు వేయడం సరికాదు. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. అనవసరమైన విమర్శలు చేసి.. ప్రజల్లో ఈ వ్యవస్థలపై నమ్మకం పోగొట్టొద్దు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 16 మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు ‘సంసద్ రత్న’ అవార్డులు అందజేశారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజూందార్, మాజీ సీజేఐ బీఆర్ గవాయ్, మాజీ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్, సీనియర్ పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read-
సికింద్రాబాద్ – కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సికింద్రాబాద్ – కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ తో పాటు 5 మల్టీట్రాకింగ్ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రూ. 2,418 కోట్ల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ వలన రైళ్ల ట్రాఫిక్ తగ్గడంతో పాటుగా రైళ్ల సమయపాలన మెరుగుపడనుంది. మరోవైపు సరుకు రవాణా రైళ్లు కూడా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో ఇంధనం ఆదా అవడంతోపాటు ఫ్రైట్ ఛార్జీలు తగ్గుతాయి. ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ తో సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకును అదనంగా రవాణా చేయవచ్చు.
ఇందులో బొగ్గు 7.06 మిలియన్ టన్నులు, ఐరన్ ఓర్ 0.73 మిలియన్ టన్నులు, ఆహారధాన్యాలు 0.65 మిలియన్ టన్నులు, సిమెంట్ 0.13 మిలియన్ టన్నులు అదనంగా రవాణా చేయవచ్చు. సికింద్రాబాద్ – కాజీపేట్ మధ్యన అందుబాటులోకి రానున్న ఈ రైల్వే లైన్ ద్వారా విజయవాడ, ముంబయి మార్గాలలో మెరుగైన రైలు ప్రయాణాలు సాగించడానికి మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఈ మార్గంలో ఉన్న యాదాద్రి, స్వర్ణగిరి, సురేంద్రగిరి ఆలయాలను సందర్శించే భక్తులకు, భువనగిరి కోటను సందర్శించే పర్యాటకులకు కూడా ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ అనుకూలంగా మారనుంది.
సికింద్రాబాద్ – కాజీపేట్ మధ్యన మల్టీట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైల్వే బడ్జెట్ కేటాయింపులు 21 రెట్లు పెరిగాయని, గత 12 సంవత్సరాల కాలంలో రూ. 36,286 కోట్లను తెలంగాణకు కేటాయించినట్లు తెలియజేశారు. దీంతోపాటుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు పనులు జరుపుకుంటున్నాయని, మరో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే జరుగుతోందని పేర్కొన్నారు.

రైల్వే లైన్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రస్తుతం 42 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 3,000 కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో పనులు పూర్తయిన 6 రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలియజేశారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట్ రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ తో సహా మోదీ గారి నేతృత్వంలో తెలంగాణ రైల్వేల ముఖచిత్రంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, రాబోయే రోజులలో రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని అన్నారు.
