నమస్కారం…
సంక్రాంతి శుభాకాంక్షలు…
దేశం కోసం బలిదానాలు చేసిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, దేశంలో లౌకికవాదం, ఐక్యత కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుపుకోవాల్సిన ఈ శుభ తరుణంలో నియంతృత్వ బీజేపీ పాలనలో మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, రాజ్యాంగ రూపకర్త డా.బీఆర్ అంబేద్కర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం దురదృష్టకరం.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న బీజేపీ ఆ పార్టీ అధినేత అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినా శిక్షంచకుండా వెనకేసుకొస్తుంది. ఈ పరిస్థితుల మధ్య 2024 డిసెంబర్ 26వ తేదీన బెళగావిలో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ (సీడబ్ల్యుసీ) సమావేశాల్లో బీజేపీ తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ‘జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్’ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని తీర్మాణాలు చేశారు. వాటి వివరాలను మీ ముందు ఉంచుతూ, పార్టీ పిలుపిచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
ఈ చారిత్రాత్మక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే న్యూ ఢిల్లీలో దురదృష్టవశాత్తు అనార్యోగంతో మాజీ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ మృతి చెందండం దేశ ప్రజలకూ, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. కాంగ్రెస్ నేతలు తమ జీవితాలను పణంగా పెట్టి నిస్వార్థంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకుస్తే, బీజేపీ పాలకుల చేతిలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. జాతిపిత మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలో యావత్ దేశం అహింసా మార్గంలో ఉద్యమాలు చేసి సాధించిన స్వతంత్ర దేశంలో పదేళ్ల బీజేపీ హయాంలో దౌర్జన్యాలు, హింసతో లౌకికవాదం ప్రశ్నార్థకమైంది. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన రాజ్యాంగంపై, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పైన రాజకీయ కుట్రలకు తెరలేపి బడుగు బలహీన, మైనార్టీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది బీజేపీ.
Also Read-
నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందిపాలు చేస్తున్న నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకతంగా మహాత్మాగాంధీ స్ఫూర్తి, సిద్దాంతాల మార్గదర్శకంలో దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బెళగావిలో జరిగిన కార్యవర్గ (సీడబ్ల్యుసీ) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జాతిపిత మహాత్మా గాంధీ 1924లో కర్ణాకటలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ 39వ సమావేశాల్లో పార్టీ అధ్యక్షలుగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అదే బెళగావిలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సీడబ్ల్యుసీ సమావేశాలు నిర్వహించారు. పవిత్రమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాల్సిన సమయంలో బీజేపీ పాలకుల ఒంటెత్తు పోకడలతో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. మనుస్మృతిని ఆరాధించే బీజేపీ నేతలు రాజ్యాంగ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. కీలక బాధ్యతలో ఉన్న హోం మంత్రి అమిత్ షా బాధ్యతారాహిత్యంగా పార్లమెంట్ వేదికగా రాజ్యంగ నిర్మాత, కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల మనసులను గాయపరిస్తే, ఆయనను బర్తరఫ్ చేయాల్సిన ప్రధాని మోదీ చివరకు ఆయనను వెనుకేసుకొని రావడం దురదృష్టకరం.
దీనిపై చర్చించిన సీడబ్ల్యుసీ అమిత్షా రాజీనామా చేయాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాక రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం పరిరక్షణకు బెళగావి వేదికగానే శంఖారావం పూరించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తయ్యే 2025 జనవరి 26 తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి, అదే స్ఫూర్తితో 2026 జనవరి 26 తేదీ వరకు ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో నిర్వహించి బీజేపీ మెడలను వంచాలని సీడబ్ల్యుసీ పిలుపిచ్చింది. స్వయం ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియా వంటి రంగాలపై ఒత్తిడితెస్తూ బీజేపీ రాజకీయాలు చేయడంపై సీడబ్ల్యుసీ విచారం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టడం బీజేపీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం.
ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో సీసీ కెమరాల వీడియోలు, వెబ్కాస్టింగ్ బహిరంగ పర్చకూడదని 1961 నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయించడాన్ని సీడబ్ల్యుసీ తప్పుపట్టింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఒత్తిడితో బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ అంశంపై కాంగ్రెస్ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరుగుతుండగానే ఎన్నికల కమిషన్ ఇలాంటి చర్యలకు పూనుకోవడం గర్హనీయం. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ దేశంలో మత కలహాలను ప్రోత్సహిస్తోంది. వీరి పాలనలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెరిగిపోవడంతో వారు అభద్రతకు లోనవుతున్నారని, ప్రత్యేకంగా మణిపూర్లో 2023 మే నెల నుండి అల్లర్లు కొనసాగుతున్నా ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో ఒక్కసారి కూడా పర్యటించకపోవడాన్ని సీడబ్ల్యుసీ తప్పుపట్టింది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంభాల్లో మతకలహాలు సృష్టించడం, యూపీఏ ప్రభుత్వం 1991లో తీసుకొచ్చిన ప్రార్థనా స్థలాల చట్టాన్ని నీరుగార్చడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలో నిరసనలు తెలపడాన్ని కూడా తట్టుకోలేని బీజేపీ, తాము అధికారంలో ఉన్న అస్సాం, యూపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను దౌర్జన్యంగా అడ్డుకోవడాన్ని సీడబ్ల్యుసీ తప్పుపట్టింది. జనాభా ఆధారంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో దేశంలో కులగణన చేపట్టి, గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలనేది కాంగ్రెస్ విధానం.
ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్లపై ప్రస్తుతమున్న 50 శాతం సీలింగ్ నిబంధనను తొలగిస్తే సామాజికంగా అందరికీ సమ న్యాయం జరుగుతుందని, ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సీడబ్ల్యుసీ కోరింది. బీజేపీ పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థతో దేశంలో నిత్యవసరాల ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుగుతోంది. మోదీ ప్రభుత్వం తమకిష్టమైన బడా వ్యాపారస్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు యత్నిస్తోంది.
రాబోయే బడ్జెట్లో పేదలు ఆర్థికంగా బలపడేలా, మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పేదల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, భారంగా మారిన జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి సరళతరం చేయాలని సీడబ్ల్యుసీ డిమాండ్ చేసింది. దేశానికి వెన్నెముకలాంటి రైతు వ్యాపకమైన వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఉపాధి రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరలు లభించకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నీరుగార్చింది. పంటలకు సరైన మద్దతు ధరలు కల్పించాలని, ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయలు చెల్లించాలని సీడబ్ల్యుసీ కోరింది.
విదేశీ వ్యవహారాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశభద్రతకు ముప్పు ఏర్పడిరది. లడఖ్ సరిహద్దుకు సంబంధించి చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంతోపాటు ఎల్ఏసీపై పార్లమెంట్లో చర్చించి ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. దీంతోపాటు బంగ్లాదేశ్లో మైనార్టీల రక్షణ కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రలను విజయవంతంగా నిర్వహించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన రాహుల్ గాంధీని, ‘సంఘటన్ శ్రీజన్ కార్యక్రమం’ చేపట్టేందుకు చొరవ తీసుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను సీడబ్ల్యుసీ ప్రత్యేకంగా అభినందించింది.
దేశ ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన సీడబ్ల్యుసీ… ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం పరిరక్షణ కోసం ‘జై బాపు’, ‘జై బీమ్’, ‘జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో నిర్వహించాలని తీర్మానించింది. అంబేద్కర్ ఆశయాలను, జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను విజయవంతం చేయాలని సీడబ్ల్యుసీ దేశ ప్రజలకు పిలుపిచ్చింది.
అభినందనలతో…
మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు.