ప్రయాణీకుల భద్రతకు సంరక్షకులుగా ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లు (టీటీఈలు)
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే రోజుకు సగటున 2 కోట్ల ప్రయాణికులకు రవాణా సేవలను అందిస్తుంది. అధునాతన సాంకేతికత, ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు సమర్థవంతమైన కార్యకలాపాలు రైళ్లను సజావుగా నడిపిస్తుండగా, ప్రతి ప్రయాణం సురక్షితంగా, భద్రంగా, ప్రయాణికులకు అనుకూలంగా సాగేందుకు నిరంతరం అంకితభావంతో విధులు నిర్వహించే క్షేత్రస్థాయి ఉద్యోగుల సంకల్పమే అసలైన బలంగా నిలుస్తోంది.
ఈ క్షేత్రస్థాయి సిబ్బందిలో, టికెట్ తనిఖీ సిబ్బంది భారతీయ రైల్వేకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ప్రతిరోజూ, టికెట్‌ను తనిఖీ చేసే బాధ్యత మాత్రమే కాకుండా అనుమతించబడిన ప్రయాణికులు మాత్రమే రైలు ఎక్కేలా చూడటం, రైల్వే నియమ నిబంధనలను పాటించడం, అత్యవసర పరిస్థితులకు స్పందించడం మరియు క్లిష్ట పరిస్థితులలో తరచుగా ప్రథమ స్పందనదారులుగా వ్యవహరించడం ద్వారా వారు ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించడంలో సహాయపడుతున్నారు.
టికెట్ తనిఖీ బాధ్యతలకు మించి టికెట్ తనిఖీ సిబ్బంది (టీటీఈ) నిర్వహించే విధులలో, ప్రయాణీకులకు సంబంధించిన అనేక బాధ్యతలు ఉంటాయి. టిక్కెట్లను తనిఖీ చేయడంతో పాటు రిజర్వ్ చేయబడిన బెర్త్‌లను నిర్వహించడం, నిబంధనల ప్రకారం ఖాళీ బెర్త్‌లను కేటాయించడం, సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలు మరియు దివ్యాంగజన్ ప్రయాణీకులకు సహాయం చేయడం, కార్యకలాపాలకు అంతరాయం కలిగినప్పుడు ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడం, మరియు రైలు ప్రయాణంలో క్రమశిక్షణను పాటించడంలో సహాయపడటం వంటివి చేస్తారు. పండుగలు మరియు రద్దీ ప్రయాణ సమయాలలో, టికెట్ తనిఖీ సిబ్బంది జనసమూహాన్ని నియంత్రించడంలో, ప్రయాణీకుల సులభమైన రాకపోకలను మరియు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు ఫిర్యాదులను పరిష్కరించడంలో, అనధికార ప్రయాణాలను అరికట్టడంలో కూడా గణనీయంగా తోడ్పడుతూ, తద్వారా ప్రయాణీకుల సౌకర్యం మరియు భద్రతను పెంపొందిస్తారు. ఈ కార్యకలాపాలతో పాటు, ఏదైనా అవాంఛనీయ ప్రమాదం/సంఘటన జరిగినప్పుడు రైల్వే అధికారులకు ప్రయాణీకుల సమాచారాన్ని అందించడంలో, బాధిత ప్రయాణికులకు సహాయం చేయడంలో మరియు వారి వస్తువులను భద్రపరచడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు.
సికింద్రాబాద్ డివిజన్ టికెట్ తనిఖీ హీరోలు
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ లోని టికెట్ తనిఖీ సిబ్బంది సేవలు సాధారణ విధులకు అతీతమైనదని పదేపదే నిరూపించారు. వారి అప్రమత్తత, కరుణ, ధైర్యం మరియు వేగవంతమైన నిర్ణయాలు ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి, నిస్సహాయ ప్రయాణికులను రక్షించడానికి, రైల్వే ఆస్తిని కాపాడటానికి మరియు ప్రయాణికుల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దోహదపడ్డాయి.
Also Read-
అటువంటి కొన్ని ఉదాహరణలు కింద పొందుపర్చబడ్డాయి :

పిల్లలను రక్షించడం
ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ అయిన సాయి రామ్, లక్డికాపుల్ స్టేషన్‌లో బాలలపై వేధింపులకు పాల్పడిన అనుమానితుడిని అడ్డగించి , ఆర్‌పిఎఫ్‌కు అప్పగించడం ద్వారా అసాధారణమైన సంకల్పాన్ని ప్రదర్శించారు. అనంతరం పోక్సో కింద జి.ఆర్.పి ద్వారా ఒక కేసు నమోదు చేయబడింది. అంతేకాకుండా, బేగంపేట్ , సికింద్రాబాద్ స్టేషన్లలో మరియు రైళ్లలో తప్పిపోయిన, పారిపోయిన మరియు అదృశ్యమైన పలువురు పిల్లలను గుర్తించి, వారిని సురక్షితంగా వారి కుటుంబాలతో తిరిగి కలిపేందుకు బాలల సంక్షేమ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కీలక పాత్ర పోషించారు.

ప్రాణాలను కాపాడటం
ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఎం. సాయి శంకర్, 02 జూన్, 2026న, రైలు నెం. 12861 ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు డోర్నకల్ స్టేషన్‌లో, కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ప్రమాదకరమైన స్థితిలోకి జారిపడిన ఒక ప్రయాణికుడిని రక్షించడానికి అత్యవసర అలారం చైన్ను లాగి అసాధారణమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. అనంతరం, మోస్తరు గాయాలకు చికిత్స నిమిత్తం, ఆర్పీఎఫ్ సహాయంతో 108 అంబులెన్స్‌లలో ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు.

మరో హృదయాన్ని కదిలించిన ఘటనలో, 02 జూన్ 2026న, 12285 నెం. దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో నిజాముద్దీన్ స్టేషన్ సమీపిస్తుండగా గుండెపోటుకు గురైన ఒక ప్రయాణికుడికి, ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం.వి. సుబ్బారెడ్డి సకాలంలో సీపీఆర్ చేశారు. నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి , ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. విధిలో ఉన్న టీటీఐ చాకచక్యంతో అందించిన సకాల సహాయం ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడింది.

అగ్ని ప్రమాదాల నివారణలో అప్రమత్తత
ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్, ఉత్తమ్ సింగ్ 29 మే 2026 న, 18045 నెం. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ లో విధులను నిర్వర్తిస్తున్నపుడు రైలు డోర్నకల్ మరియు గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్నసమయంలో టాయిలెట్ నుండి పొగలు వెలువడటాన్ని గమనించి , వెంటనే అలారం చైన్ లాగి రైలును ఆపి, అత్యవసర భద్రతా చర్యలను ప్రారంభించి, సంభవించగల ఒక తీవ్రమైన ప్రమాదాన్ని నివారించారు.
అదేవిధంగా, బాలరాజు, ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్, 08 జూలై 2026 న, రైలు నెం. 12714 శాతవాహన ఎక్స్‌ప్రెస్ లో పనిచేస్తున్నప్పుడు స్మోక్ డిటెక్టర్ యాక్టివేట్ అవ్వడాన్ని గమనించిన వెంటనే, వేగంగా స్పందించి, ధూమపాన వ్యతిరేక నిబంధనలను తక్షణమే అమలుచేసి, సంభవించే ప్రమాదాన్ని అరికట్టి, ప్రయాణికుల భద్రతను సమర్థంగా పరిరక్షించారు.


రైల్వే భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర
చట్ట అమలు సంస్థలకు సహకరించడంలో టికెట్ తనిఖీ సిబ్బందిది కీలక పాత్ర. ఈ దిశలో భాగంగా , ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ అయిన ఎం.వి. సుబ్బారెడ్డి , కోనార్క్ రైలు నెం. 11020లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విజయవంతంగా పసిగట్టారు. భద్రతా సంస్థలను అప్రమత్తం చేయడంతో, అక్రమ కార్యకలాపాలపై సకాలంలో చర్యలు తీసుకునేందుకు వీలయ్యింది. తదుపరి చర్యల కోసం నిందితులను కాజీపేటలో ఆర్పీఎఫ్‌కు అప్పగించారు

ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే నిజాయితీ
అద్భుతమైన నిజాయితీని ప్రదర్శిస్తూ, ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రేచెల్ రంజిత , 22 వ జూన్ 2026 న బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన విలువైన కార్పొరేట్ ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించి భద్రపరిచారు. సరైన ధృవీకరణ అనంతరం, ఆ విలువైన వస్తువులను, యజమానికి సురక్షితంగా తిరిగి అప్పగించారు.
రైలు ప్రయాణంలో స్వచ్ఛతను ప్రోత్సహించడం
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా, టికెట్ తనిఖీ సిబ్బంది ఎమ్.ఎమ్.టి.ఎస్ సర్వీసులు మరియు ప్రధాన రైల్వే స్టేషన్ల వ్యాప్తంగా పరిశుభ్రత అవగాహన ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. వ్యర్థాలను సరిగ్గా పారవేయడం, స్టేషన్లలో మరియు రైళ్లలో పరిశుభ్రతను పాటించడంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు .
క్రమశిక్షణ కలిగిన రైలు ప్రయాణం
రైలులో ప్రయాణించే అత్యధిక మంది ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సహకరిస్తూ నిబంధనలను పాటిస్తారు. అప్పుడప్పుడు జరిగే దురుసు ప్రవర్తన సంఘటనలు లేదా క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ప్రయాణ వాతావరణానికి అంతరాయం కలిగిస్తాయి. అటువంటి సందర్భాలలో, తోటి ప్రయాణికుల సౌకర్యం మరియు భద్రతను కాపాడటానికి, భారతీయ రైల్వే చట్టంలోని సంబంధిత నిబంధనలు మరియు వర్తించే నియమాల ప్రకారం, అవసరమైన చోట జరిమానాలు మరియు ప్రాసిక్యూషన్‌తో సహా చర్యలు తీసుకుంటుంది.
సురక్షిత ప్రయాణానికి ఉమ్మడి బాధ్యత
ప్రతి రైలు ప్రయాణం కేవలం పట్టాలు, లోకోమోటివ్‌లు మరియు సాంకేతికత వల్ల మాత్రమే కాకుండా, తెర వెనుక ఉండి విధులను నిర్వర్తించే వేలాది మంది రైల్వే ఉద్యోగుల అంకితభావం వల్ల కూడా సురక్షితంగా ఉంటుంది. రైలులో క్రమశిక్షణ మరియు భద్రతను కాపాడటానికి టికెట్ తనిఖీ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేయడం, అలాగే ప్రయాణికులు కూడా నియమాలను గౌరవించడం, సామాను భద్రపరుచుకోవడం మరియు టికెట్ తనిఖీ సమయంలో సహకరించడం ద్వారా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.
సురక్షితమైన, భద్రమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాలు మనందరి ఉమ్మడి బాధ్యత కాబట్టి, ప్రయాణికులు టికెట్ తనిఖీ సిబ్బందికి సహకరించాలని, రైల్వే నియమాలను పాటించాలని, తమ వస్తువులను కాపాడుకోవాలని మరియు పరిశుభ్రతను పాటించాలని భారతీయ రైల్వే విజ్ఞప్తి చేస్తోంది.
ప్రతి సురక్షితమైన రైలు ప్రయాణానికి రెండే మూల స్తంభాలు – అచంచలమైన అంకితభావంతో విధులు నిర్వహించే రైల్వే సిబ్బంది మరియు బాధ్యతాయుతమైన ప్రయాణికుల సహకారం.
