యాత్ర ఫర్ ఛేంజ్: 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నట్లు BRS నాయకులు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్ల అడగం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “BRS నాయకులు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు. వారికిదే నా సవాల్. మంత్రులు వస్తరో, ముఖ్యమంత్రి వస్తడో, ఎమ్మెల్యేలు వస్తరో రండి. ఏదైనా సబ్ స్టేషనుకు పోదాం. 24 గంటల కరెంట్ ఇస్తే మేం వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. లేకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మీరు ముక్కు నేలకు రాయాలి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి BRS నాయకులకు సవాలు విసిరారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా బుధవారం హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని చెల్పూర్ గ్రామం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు.

60ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ గడ్డమీద సోనియా మాట ఇచ్చారు. పార్టీ నష్టపోయినా మాట తప్పక… మడమ తిప్పక తెలంగాణ ఏర్పాటు చేసి సోనియా మాట నిలబెట్టుకున్నారు. వచ్చిన తెలంగాణలో 60 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరాయా? ఒక్కసారి ఆలోచించండి. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ తెలంగాణ కోసం కొట్లాడలేదు.

వీళ్లు సుష్మాస్వరాజ్ ను కలిసి ఒప్పించలేదు. నాడు తెలంగాణ ప్రజల బాధను చెప్పి సుష్మాస్వరాజ్ కాళ్లకు దండం పెట్టి ఆమెను ఒప్పించింది మా పొన్నం ప్రభాకర్. నిన్న బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ని అమిత్ షా పిలిపించుకుంటే… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదా మరే ఇతర మంచి పని తెలంగాణ కోసం జరుగుతుందని అనుకున్నా. కానీ మూడుగంటలు కూర్చోబెట్టి ముచ్చట చెప్పి పంపిండు తప్ప చేసిందేం లేదు.

మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. అనాడు మోదీ చెప్పారు మేం అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. 9 ఏళ్లు అయింది 15 పైసలు కూడా వేయ్యలేదు. అంతేకాదు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ లెక్కన తెలంగాణలో మోదీ 70లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. అదే జరిగితే తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావు. 21కోట్ల దరఖాస్తులు వస్తే… 7లక్షల 164 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో నిస్సిగ్గుగా చెప్పారు. మోదీ వచ్చాక రూ.400 సిలిండర్ రూ.1250 చేశారు. రూ.50 ఉన్న డీజిల్ రూ.100 చేశాడు. బీజేపీ పేద ప్రజలకు చేసిన సాయం ఏమీ లేదు.

అమిత్ షా ను కలిసిన ఈటెల తెలంగాణ సమస్యలను ఆయనతో ఎందుకు ప్రస్తావించలేదు? పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధి బిల్లుకు చట్టబద్దత ఎందుకు చేయించలేదని అడుగుతున్నా. కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకు ఎందుకు విచారణకు ఆదేశించమని అడగలేదు? సొంత నియోజకవర్గంలో మానేరు వాగులో ఇసుక దోపిడీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇసుక మాఫియా హుజూరాబాద్ లో రాజ్యమేలుతుంటే నువ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ దోపీడీలో నీకు వాటా ఉందా? నీ పాత కేసులు తవ్వుతారనా?

కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ నేతలం మాత్రమే కొట్లాడాం. ఎనిమిదేళ్లలో కేసీఆర్ పై కొట్లాడటంలో నువ్ ఎక్కడున్నావ్ బండి సంజయ్. బీజేపీ, బీఆరెస్ కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నాయి. ఎప్పటిలోగా కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి కేసీఆర్, కేటీఆర్ ను జైల్లో పెడతారో బీజేపీ నేతలు చెప్పాలి. గ్రానైట్ ను విదేశాలకు తరలించారని అడిగిన బండి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. బీజేపీ, బీఆరెస్ రెండు పార్టీలు ఒక్కటే.. కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేందుకే వేరుగా ఉన్నట్లు నటిస్తున్నారు.

కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తాం. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఏడాదిలోగా ప్రభుత్వంలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే హుజురాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. హుజురాబాద్ ను అభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తెలంగాణలో సబ్బండవర్గాలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. హుజూరాబాద్ లో బీఆరెస్ కు, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

ఈ జనసందోహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్ ఏం చేశారు? పెట్రోల్ ధర తగ్గించారా? డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు తగ్గించారా? కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. ఆడబిడ్డలకు అందాల్సిన 2వేల కోట్లను కేసీఆర్ కాజేశారు. ఆడబిడ్డల సొమ్ము కాజేసిన ఎవరూ బాగుపడలేదు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తాం. ఇళ్లు కట్టుకునేందుకు 2014 లో రూ.5 లక్షలు ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పడు రూ.3 లక్షలు అంటుండు.. ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు లబ్ది చేకూరేలా చేసే బాధ్యత కాంగ్రెస్ ది. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడే ఏకైక ఉద్యమ నాయకుడు రేవంత్. అలాంటి ఉద్యమ నాయకుడు ఈ గడ్డకు రావడం గర్వకారణం. బలహీన వర్గాలను ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదు.

కేసీఆర్ కుటుంబమే ఇసుక దోపిడీకి పాల్పడుతుంది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పాదయాత్రకు ముందు ఇప్పలపల్లిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆరెస్ నాయకులు సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారన్నారు. ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. కేసీఆర్ కుటుంబమే ఈ దోపిడీకి పాల్పడుతుంది. నెరేళ్ళలో ఇసుక మాఫియాను అడ్డుకున్న రైతులను డ్రామారావు పోలీసులతో ఎలా చిత్రహింసలు పెట్టారో చూసాం. మానేరు వాగులో జరుగుతున్న ఇసుక దోపీడీని పరిశీలించేందుకే ఇక్కడికి వచ్చాం.

జోగినపల్లి సంతోష్, అతని తండ్రి రవీందర్ రావు బినామీ పేర్లతో వందల కోట్ల దోపీడీకి పాల్పడుతున్నారు. ఒకే పర్మిట్ తో నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ దోపిడీని బాహ్య ప్రపంచానికి చూపించేందుకే ఇక్కడకు వచ్చాం. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ సంపదను కాపాడి రైతులకు మేలు చేసింది. ఇసుకను తీయడానికి జేసీబీలను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. అధికారులతో చర్చిద్దామనుకుంటే ఒక్క అధికారి లేడు. ఇసుక డంప్ లు ఉన్న ఈ ప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించాలి. ఇది ఒక ప్రయివేటు సామ్రాజ్యంగా మారింది. ఇసుక తరలింపును అడ్డుకున్నవారిని పోలీసులు హెచ్చరించారని ఇక్కడి రైతులు చెబుతున్నారు.

పోలీసులు ఇసుక మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఫిర్యాదు చేసిన వారిపైనే వారు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ దోపిడీతో కేసీఆర్ కు ఉన్న చీకటి అనుబంధం ఏమిటో తేలాలి. ఇది ఇలాగే సాగితే ఇక్కడి ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కేసీఆర్ కుటుంబం ఈ ఇసుక దోపిడీలో భాగస్వాములు కాబట్టే ఇది యథేచ్ఛగా సాగుతోంది. ఇంత దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వంపై యుద్ధం చేస్తామన్న ఈటెల ఎక్కడకు పోయిండు. కేసీఆర్ కుటుంబం మానేరును కొల్లగొడుతుంటే ఎందుకు పోరాడటం లేదు. బీజేపీ పెద్దల నుంచి మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? వీటిపై బీజేపీ ఎందుకు పిర్యాదు చేయడంలేదు? అని ప్రశ్నించారు.

ఈ దోపిడీకి వ్యతిరేకంగా… ప్రభుత్వ అక్రమ అనుమతులు రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుంది. ఇప్పటికైనా ఈటెల, బండి సంజయ్ ఈ దోపిడీపై స్పందించాలి. ఈ దోపీడీని అడ్డుకునేందుకు వారి కార్యాచరణ ప్రకటించాలి. ఇంత జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదంటే.. బీఆరెస్, బీజేపీ బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఇసుక మాఫియా వల్లే కాళేశ్వరం ముంపుకు గురయ్యింది. మా సభలపై బీఆరెస్ దాడులకు దిగిందంటే వారిలో భయానికి ఇది సంకేతం. కేసీఆర్ కుర్చీ కింద బీటలు పడుతుందనే ఇలాంటి దాడులకు దిగుతున్నారు. ఏ దాడులకు భయపడం..పాదయాత్ర కొనసాగుతుంది. దాడులతో సమస్యలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. మీరెన్ని చేసినా కాంగ్రెస్ పక్కదారి పట్టదు.. ప్రజా సమస్యలపై కొట్లాడుతుందన్నారు రేవంత్ రెడ్డి.

ఇల్లంతుకుంట రామాలయం, బిజిగిరి షరీఫ్ దర్గా సందర్శన

పాదయాత్ర ప్రారంభానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇల్లంతుకుంట శ్రీరామాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను వివరించారు. తర్వాత జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X