హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలకు విస్తరించిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్‌కుమార్ అన్నారు. లాల్‌దర్వాజా నుంచి ప్రారంభమైన బోనాల వేడుకలు లండన్ వరకు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల విశిష్టతను విశ్లేషిస్తూ పాతనగర వాస్తవ్యులు, ప్రముఖ జర్నలిస్ట్, సుప్రసిద్ధ కవి వరకాల యాదగిరి రచించిన ‘సింహవాహిని శతకం’ పద్య సంకలనాన్ని శనివారం లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి కొప్పుల ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత పెంచుతోందన్నారు. గడచిన వారంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ బోనాల వేడుకలు వైభవంగా జరిగాయని, ఈ కార్యక్రమాల్లో పలువురు జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని గుర్తు చేశారు . లాల్ దర్వాజా బోనాలు యావత్ దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. భక్తి ఆధ్యాత్మిక సంప్రదాయ తెలంగాణ సంస్కృతికి బోనాలు ప్రత్యేకగా నిలిచాయి అన్నారు.
Also Read-
ప్రధానంగా హైదరాబాద్ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే మూసీ నది గత వైభవం, లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి మహత్యాన్ని తన స్వీయ అనుభవాలతో విశ్లేషిస్తూ జర్నలిస్ట్ వరకాల యాదగిరి ‘సింహవాహిని శతకం’ రచించారని ప్రవీణ్‌కుమార్ ప్రశంసించారు. 1908లో మూసీ నది వరద బీభత్సం సృష్టించిన సందర్భంలో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్‌దర్వాజా ఆలయంలో పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆలయ ప్రాధాన్యతతో పాటు మూసీ నది ప్రవాహం, హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని శతక రూపంలో తెలుగు సాహిత్యాభిమానులను అలరించే విధంగా యాదగిరి పద్యాలు రచించారని అభినందించారు. ఆదివారం జరిగే బోనాల సమర్పణ వేడుకల్లో పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు పలువురు మంత్రులు పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ ప్రతినిధులు మాణిక్ ప్రభు గౌడ్, సి. వెంకటేష్, రాజు యాదవ్, పోసాని విజయ్‌కుమార్, రంగ రాజలింగం గౌడ్, కాంగ్రెస్ నాయకులు కే. వెంకటేష్, అరవింద్‌కుమార్ గౌడ్, తిరుపతి నర్సింగరావు, రంగ శ్రీకాంత్ గౌడ్, మహంకాళి భక్తజన సంఘం ప్రధాన కార్యదర్శి గుమ్మడవెల్లి మురళీకృష్ణ, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి, సురేఖ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత, కవి వరకాల యాదగిరిని ఘనంగా సన్మానించారు.
