డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ప్రొ. కె. జయశంకర్ స్మారకోపన్యాసం
హైదరాబాద్ : ప్రొ.జయశంకర్ గొప్ప తాత్వికవేత్త అని, ఆయన జీవితం నిరాడంభరంగా సాగిందని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, దళిత అధ్యయన కేంద్రం వ్యవస్థాపక ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రఖ్యాత విద్యావేత్త, తెలంగాణ వైతాళికుడు, ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సర్ 92వ జయంతిని పురస్కరించుకొని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్య వక్తగా హాజరై “ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు – సామాజిక ఉద్యమాలు” అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన గొప్ప దార్శనికుడు, తాత్వికవేత్త ప్రొ.జయశంకర్ అని వివరించారు. ఒక ఉద్యమాన్ని నడపడం వేరు, ఉద్యమాన్ని నిర్మించడం వేరని, తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి బలమైన ప్రణాళిక అవసరమని ప్రొ. జయశంకర్ నిరంతరం చెప్పేవారన్నారు. ఏ ఉద్యమం అయినా, ఆ ఉద్యమానికి దారి తీసిన కారణాలతో ప్రజల్లో భావజాల వ్యాప్తి విస్తృతంగా జరగాలన్నారు. ఆ తర్వాత ఉద్యమ నిర్మాణం జరగాలని, విజయం అనేది రాజకీయ ప్రక్రియతోనే సాధ్యం అని ప్రొ. జయశంకర్ భావించారని, అదే బాటలో ప్రయాణించడంతో ప్రత్యేక తెలంగాణ సాధించడం సాధ్యమైంది అని వివరించారు.

అందుకే ప్రొ. జయశంకర్ సర్ ని తెలంగాణ ప్రజలు తెలంగాణ సిద్ధాంతకర్తగా కీర్తిస్తారని పేర్కొన్నారు. విద్య, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు సంబంధించిన సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రొ.జయశంకర్ ఆదర్శాలు నేటికీ యువతకు స్పూర్తి అన్నారు. సమానత్వం, గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. ఎలాంటి సామాజిక ఉద్యమం అయినా సరే విజయం సాధించాలంటే ప్రొ. జయశంకర్ సర్ భావించినట్లే ఆయన ఆలోచన ప్రకారం నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని శ్రీ మల్లేపల్లి లక్ష్మయ్య సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యార్ధి జీవితం నుంచి తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ ఏర్పాటే తన జీవితాశయంగా ప్రొ. జయశంకర్ జీవించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అన్ని దశల్లోని ఉద్యమాల్లో జయశంకర్ సర్ పాత్ర ఉందని, ఆ అనుభవమే తెలంగాణ తుది దశ ఉద్యమాన్ని ముందుకు నడిపించేలా చేసిందన్నారు. ఒకవైపు ప్రొఫెసర్ గా, మరో వైపు పరిపాలనలో భాగంగా రిజిస్ట్రార్ గా, వైస్ ఛాన్సలర్ గా ఉన్నా ప్రజా సమస్యలపై ఎప్పుడూ గళం విప్పేవారని, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర చాలా కీలకమమని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సిద్దించిందని ప్రొ. ఘంటా చక్రపాణి గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూనివర్సిటీ ల అధ్యాపకులు ప్రజా సమస్యలను అంతగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెన్ జీ ఉద్యమంలో కూడా అధ్యాపకుల పాత్ర లేదని పేర్కొన్నారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్.విజయకృష్ణా రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆయన కార్యక్రమ ఆవశ్యకతను వివరిస్తు ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. అంతకుముందు డా. బి ల. ఆర్. అంబేద్కర్, ప్రొ. కె. జయశంకర్ చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పల్లవి కాబ్డే; డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. ఎన్. రజని, ప్రొ. ప్రమీలా కేతావాత్, ప్రొ చంద్రకళ; ప్రొ. మేరీసునంద; అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, డా. యాకేష్ దైదా, మియా జాని, మంజుల, కె. పాండు తదితరులు పాల్గొన్నారు.
