కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చిన మధు యాష్కి గౌడ్
కుమారుడి మృతదేహాన్ని తొందరగా తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేసిన తల్లి
సాధ్యమైనంత తొందరలో తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని మధుయాష్కి గౌడ్ భరోసా
హైదరాబాద్ : అమెరికాలోని డల్లాస్ లోని ఓ పెట్రోల్ బంక్ లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం పట్ల టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం తల్లి, సోదరులకు దూరంగా అమెరికా వెళ్లి చంద్రశేఖర్ అర్ధాంతరంగా మృతి చెందడం తనను ఎంతో కలిచి వేసిందని పేర్కొన్నారు. కోటి ఆశలతో, బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడు చంద్రశేఖర్ మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని, అమెరికాలో ఉన్న గన్ కల్చర్ ఇలా తరచూ భారతీయులను బలి తీసుకోవడం జీర్ణించుకోలేని విషయమన్నారు.
జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ద్వారా చంద్రశేఖర్ తల్లి సునీత, సోదరుడు రాజ్ కిరణ్ లతో ఫోన్లో మాట్లాడిన మధుయాష్కి వారిని ఓదార్చారు. అమెరికా నుంచి చంద్రశేఖర్ మృత దేహాన్ని తొందరగా తీసుకువచ్చేలా చూడాలని మధుయాష్కిని వారు కన్నీరుతో కోరారు.
Also Read-
అమెరికాలోనే ఉన్న ఆయన చంద్రశేఖర్ మృతదేహం హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలిపారు. తెలుగు సంఘాల ప్రతినిధులను పంపి, ఇండియన్ కాన్సులేట్ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
