హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ఉద్యోగులకు, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని నివాళి అర్పించారు.

ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇకపై కేవలం రాష్ట్ర విశ్వవిద్యాలయం గానే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్యను అందించే గ్లోబల్ యూనివర్సిటీగా ఎదుగుతోందని తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విశ్వవిద్యాలయంలోని పలు ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకు అనుమతి ఇవ్వడం డిజిటల్ పరివర్తనలో ముఖ్యమైన మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. దేశంలోనే దూర విధ్యా విధానంలో మొదటి విశ్వవిద్యాలయంగా ఏర్పడిన డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రస్తుతం డిజిటల్ యూనివర్సిటీగా క్రమంగా రూపాంతరం చెందుతోందన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, భవిష్యత్తులో విశ్వవిద్యాలయంలోని అన్ని విద్యా కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో అందించే సంపూర్ణ డిజిటల్ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంటుందని ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ డిజిటల్ పరివర్తనను బలోపేతం చేయడంతో పాటు, నాణ్యమైన ఉన్నత విద్యను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం మరియు విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు అందిస్తున్న సహకారం, ప్రోత్సాహాన్ని ఆయన ప్రశంసించారు.
Also Read-
అధునాతన ప్రపంచస్థాయి నైపుణ్యం, ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను విశ్వవిద్యాలయంలో సమన్వయం చేయడం ద్వారా, విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ యూనివర్సిటీగా ఎదిగే ప్రయాణం మరింత వేగవంతమవుతుందని వివరించారు. ప్రపంచస్థాయి డిజిటల్ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, భౌగోళిక పరిమితులకు అతీతంగా అత్యున్నత నాణ్యత, అందుబాటు, తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను విద్యార్థులకు అందించేందుకు విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని ప్రొ.చక్రపాణి పేర్కొన్నారు.
అనంతరం, నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి ఆవిష్కరించి జాతిపితకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్స్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, ప్రొ. ఇ. సుధారాణి, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. రబింద్రనాధ్ సోలొమన్; ప్రొ. పి. వెంకటరమణ, ప్రొ. చంద్రకళ, ప్రొ. జి దయాకర్, యూనివర్సిటీ ఎస్టేట్ ఆఫీసర్ బిఎస్ఆర్ భరత్ రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ ఎన్. సి. వేణు గోపాల్, బోధన మరియు బోధనేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నాయకులు కె. మంజులా, జి. జ్యోతిశ్రీ , కాంతం ప్రేమ్ కుమార్, డా. యకేష్ దైదా, మియజాని, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
