హైదరాబాద్ : ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి NICU వార్డులో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసికందులు, దట్టమైన పొగ రూపంలో వచ్చిన మృత్యువుకు బలికావడం, అందులోనూ చికిత్స పొందుతూ ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటనలో తమ బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం ఎంతటి దయనీయ స్థితికి చేరిందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. నియోనాటల్ కేర్ యూనిట్ (NICU) వంటి అత్యంత సున్నితమైన, ప్రాణాపాయ స్థితిలో ఉండే పసికందులు చికిత్స పొందే వార్డులో కనీస విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎయిర్ కండీషనర్ల నిర్వహణను గాలికి వదిలేయడం క్షమించరాని నేరం. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వ వైఖరి కారణంగానే అమాయక ప్రాణాలు బలికావాల్సి వచ్చింది.
Also Read-
ప్రమాదం నుంచి బయటపడి ప్రస్తుతం ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మిగతా చిన్నారులందరికీ ప్రభుత్వం తరఫున మెరుగైన, అత్యున్నత వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కేవలం తూతూమంత్రపు ప్రకటనలతో చేతులు దులుపుకోకుండా, ఈ దుర్ఘటనపై ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించి.. ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులైన అధికారులపై, ఆసుపత్రి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. బిడ్డలను కోల్పోయి రోడ్డున పడిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు, వారికి తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాo. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో తక్షణమే సేఫ్టీ మరియు ఫైర్ ఆడిట్ నిర్వహించి, భద్రతా లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాను.
