హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కాన్కోర్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ స్వరూప్‌తో కలిసి, ఈ రోజు అనగా 2 మే, 2026న సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐ.సి.డి) నుండి ప్రారంభ రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్ రేక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే పి.సి.ఓ.ఎమ్ శ్రీమతి కె. పద్మజ; దక్షిణ మధ్య రైల్వే పిసిసిఎం, శ్రీమతి ఇటి పాండే; సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్; దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ రైల్వే అధికారులు; కాన్కోర్ మరియు మెర్స్క్ నుండి అధికారులు, లాజిస్టిక్స్ భాగస్వాములు మరియు కీలక వాటాదారులు కూడా పాల్గొన్నారు.
“ఔషధి ఎక్స్‌ప్రెస్” అనే బ్రాండ్‌తో ఉన్న ఈ శీతలీకరించిన (రీఫర్) కంటైనర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది. ఈ సేవ ప్రత్యేకంగా ప్రాణరక్షక ఔషధాలు మరియు ఇతర ఉష్ణోగ్రతకు సున్నితమైన సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి రూపొందించబడింది. అధునాతన రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్‌లు అమర్చబడి ఉండటం వలన, ప్రయాణమంతా నిరంతర శీతలీకరణ కొనసాగుతుంది.

ఈ శీతలీకరించిన కంటైనర్ సేవ, కోల్డ్-చైన్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడానికి ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తోంది . అధిక నాణ్యత గల రీఫర్ కంటైనర్లను అందిస్తున్న మెర్స్క్ లైన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఐసిడి సనత్‌నగర్ యొక్క కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.
Also Read-
హైదరాబాద్ భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కేంద్రాలలో ఒకటి మరియు దీనిని తరచుగా ” భారతదేశ ఫార్మా రాజధాని” అని పిలుస్తారు. హైదరాబాద్‌లోని కీలక ఫార్మా ప్రాంతాలలో జీనోమ్ వ్యాలీ (తుర్క పల్లిలో ఉన్న ఒక ప్రధాన ఆర్&డి కేంద్రం ), జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం, పటాన్‌చెరు (ఒక పారిశ్రామిక ఫార్మా జోన్), మరియు ముచర్ల ఉన్నాయి . హైదరాబాద్–జేఎన్‌పీటీ కారిడార్, తెలంగాణ పారిశ్రామిక ప్రాంతాలకు మరియు భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటైన జేఎన్‌పీటీతో అనుసంధానించే కీలక మార్గంగా పనిచేస్తూ, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది.

ఇండియన్ రైల్వేలు ప్రత్యేకంగా ప్రారంభిస్తున్న రీఫర్ రేక్ సేవలు ఎగుమతిదారులు మరియు దేశీయ పంపిణీదారులకు ప్రయోజనకరంగా నిలుస్తాయి. ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గించి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, సరఫరా గొలుసు విశ్వసనీయతను పెంచుతాయి. ఫార్మాస్యూటికల్ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యత పరిరక్షణ అవసరాలు పెరగడంతో భారతదేశంలో విశ్వసనీయమైన కోల్డ్-చైన్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ రీఫర్ రేక్ వినియోగం ప్రతిబింబిస్తుంది.
ఇది ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని, ధరల సాధన మెరుగుపడుతుంది, అలాగే వృథాను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ చొరవ, సమర్థవంతమైన, సుస్థిరమైన, మరియు పర్యావరణ అనుకూలమైన సరుకు రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంది.
