హైదరాబాద్ : డిజిటల్ విద్యా విధానం వైపు డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేసిన ప్రయత్నాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది. దేశంలోనే మొట్ట మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను నాలుగు కోర్సులను ఆన్‌లైన్ విధానంలో అందించడానికి యూజీసీ అనుమతించిందని సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు.
టెక్నాలజీ ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి యూజీసీ అనుమతి మంజూరు చేయడం డిజిటల్ యుగంలో ఓ ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 8 కోర్సులకు అప్లై చేసుకోగా అందులో నాలుగు కోర్సులు ఎం.ఏ. (తెలుగు); ఎం.కామ్; బి.కామ్ – (ఇంగ్లీష్ మీడియం); బి.కామ్ – (తెలుగు మీడియం)లకు యూజీసీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మిగిలిన నాలుగు ప్రోగ్రామ్‌లకు సంబంధించి యూజీసీ కొన్ని సూచనలు, సలహాలు చేసిందని, వాటిని కూడా పూర్తి చేసి ఆ నాలుగు ప్రోగ్రామ్‌లకు కూడా ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్త పర్చారు.

వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆన్‌లైన్ కోర్సులకు ఆమోదం తెలిపినట్లు అధికారిక సమాచారాన్ని అందుకున్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ సిబ్బందిని అభినందించారు. కెనడాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో మాట్లాడారు. డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొదటి డిస్టెన్స్ యూనివర్సిటీ గా ప్రారంభమై డిజిటల్ యూనివర్సిటీ గా రూపాంతరం చెందుతోందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అన్ని కోర్సులను ఆన్లైన్ కోర్సులుగా మారుస్తూ పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీ గా మారుస్తామని వీసీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, పాలక మండలి సభ్యుల ప్రోత్సాహంతో వినూత్న ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read-
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ విద్యా విధానంలో పయనించేలా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య మరింత విస్తరించడానికి యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, ఇతర విభాగాల డిరెక్టర్లు, డీన్స్ స్వాగతించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి, సరళంగా, విద్యార్ధి కేంద్రీకృతంగా మార్చడానికి అంబేద్కర్ యూనివర్సిటీ ప్రయత్నిస్తుందని వెల్లడించారు. యూజీసీ కొత్తగా ఆమోదం తెలిపిన ఈ కోర్సుల వివరాలు, కనీస అర్హత, అడ్మిషన్ విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి వివరాలతో విశ్వవిద్యాలయం త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని వివరించారు. తాజా సమాచారం కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.braou.ac.in లేదా www.braouonline.in ను సందర్శించాలని, లేదా హెల్ప్ డెస్క్ 040 – 23680 333 / 555 / టోల్-ఫ్రీ: 1800-599-0101 లో సంప్రదించాలని సూచించారు.
