నాగార్జున సాగర్ : సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా నీళ్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురు దక్షిణగా కట్టబెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకునేలా ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ వద్ద చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల వద్ద టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులపై కొందరు ప్రైవేటు వ్యక్తులు దాడికి దిగారు. వర్క్ సైట్ లో దుంగలు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మహిళా నాయకులపై దాడి చేశారు. దాడి జరుగుతుండగా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తెలంగాణ రక్షణ సేన నాయకులను అరెస్ట్ చేసి విజయపురి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వద్ద ఆందోళన
అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వద్ద ఏపీ జలదోపిడీకి నిరసనగా ఆందోళన చేపట్టారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జలదోపిడీకి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ జలదోపిడీని నివారించాలని.. మా నీళ్లు మాకు కావాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏపీ ఏ విధంగా జలదోపిడీ కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను సీఐఎస్ఎఫ్ పోలీసులు చెదరగొట్టారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణ ద్రోహులు- ఇస్మాయిల్
తెలంగాణకు ఆంధ్రా కన్నా కూడా తెలంగాణ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులే ఎక్కువ ద్రోహం చేస్తున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ దోపిడీని ప్రశ్నించకుండా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ద్రోహం చేస్తుంటే.. వారికి కేంద్రంలో బీజేపీ సహకరిస్తుందన్నారు. అటు చంద్రబాబుకు గురుదక్షణగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని చెప్పారు. ఈ మూడు పార్టీల నాయకులను తెలంగాణ ప్రజలు ద్రోహులుగానే భావిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏపీ చేస్తున్న నీళ్ల దొంగతాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణలో రైతులు అన్నమో చంద్ర అని నీళ్ల కోసం వేడుకుంటుంటే.. ఆంధ్రా ఎస్సీలు, ఈఎన్సీలు పెట్టుకుంటావా? అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. చేతగానీ రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ నీళ్లు దొంగిలిస్తుంటే ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావ్ – శివారెడ్డి
తెలంగాణ నీళ్లను ఏపీ దొంగలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని టీఆర్ఎస్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రా? ఆంధ్రాకా అని నిలదీశారు. ఆంధ్రా అల్లుడిని చేసుకొని ఆ ప్రాంతానికి మన నీళ్లను దోచిపెడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండేళ్లలో ప్రజలు బొందపెడతారని ఆయన చెప్పారు. ఆంధ్రాతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి పని రెండేళ్ల అయిపోతుందని హెచ్చరించారు.
రేవంత్ కు నీళ్ల సోయి లేదు – విక్రాంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నీళ్ల విషయంలో కొంచెమైనా సోయి లేనందుకు సిగ్గుపడాలని టీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నీళ్లు లేవు పంటలు వేయొద్దని హెచ్చరిస్తుంటే, ఆంధ్రా నాయకులు కృష్ణా బేసిన్ లో లేని ప్రాంతాలకు, శ్రీశైలం నుంచి 700 కి.మీ.లకు పైగా దూరంలో ఉన్న కుప్పం వరకు కూడా నీళ్లను తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. పంటల సాగుకు నీళ్లు లేవంటూ క్రాప్ హాలిడే ప్రకటించాలన్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రక్తం తాగుతున్నారు- బొడ్డుపల్లి లింగం
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాటి నుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత బొడ్డుపల్లి లింగం విమర్శించారు. కృష్ణా నదిపై అక్రమంగా ఆరు ప్రాజెక్ట్ లు కట్టి అడ్డగోలుగా నీటిని తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద నీటికోసమే అంటూ తెలుగుగంగ ప్రాజెక్ట్ కట్టి ఆ తర్వాత సాగునీటిని తరలించారని గుర్తు చేశారు. ఇప్పుడు సాగర్ వద్ద పల్నాడు ప్రాజెక్ట్ ను కూడా ఇదే తరహాలో నీటి కోసం అని చెప్పి భవిష్యత్ లో మొత్తం కృష్ణా నీళ్లను తరలిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా పాలకులకు తెలంగాణ నాయకులు తలవంచి తాబేదార్ల మాదిరిగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ వద్ద రెండు ట్విన్ టెన్నెల్ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తన గురువు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఆంధ్రాకు చెందిన ఆదిత్యనాథ్ దాస్ ను నీటి విషయంలో సలహాదారుగా పెట్టుకున్నాడని విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాతే కృష్ణా నదిపై అధికారికంగా ఏ ప్రాజెక్ట్ నైనా నిర్మించాలని ఆయన కోరారు.
పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం – కవిత
ఏపీ ప్రభుత్వం జలదోపిడీని అడ్డుకునేందుకు పల్నాడు వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై ప్రైవేట్ వ్యక్తులు దాడి చేయడం దుర్మార్గమని “ఎక్స్”లో పోస్ట్ చేశారు. ఆంధ్రకు అక్రమంగా నీటిని తరలించుకపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస సోయి లేకపోవడం బాధాకరమన్నారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
