భారత జర్నలిజంలో చీకటి యుగం: రవీష్ కుమార్

(రవీష్ కుమార్ అత్యంత గౌరవనీయమైన భారత జర్నలిస్టు. ఆయన 1996లో ఎన్ డి టి వి లో చేరి, రవీష్ కీ రిపోర్ట్, దేశ్ కీ బాత్, ప్రైమ్ టైమ్ విత్ రవీష్ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆసియాలో కెల్లా సంపన్నుడూ, భారత ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడూ అయిన గౌతమ్ అదానీ ఎన్ డి టి వి ని కొనివేయబోతున్నాడనే వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే రవీష్ కుమార్ తాను ఎన్ డి టి వి కి రాజీనామా చేస్తున్నానని తన యూట్యూబ్ చానల్ మీద ప్రకటించారు. ఆ రాజీనామా సందర్భంగా 2022 డిసెంబర్ 1న ఆయన ఇచ్చిన ఉపన్యాస పాఠానికి అనువాదం)

భారత జర్నలిజంలో స్వర్ణయుగం అనబడేదేదీ లేదు. కాని పరిస్థితి ఇవాళ ఉన్నంత ఘోరంగా మరెప్పుడూ లేదు. జర్నలిజం లోని ప్రతి ఒక్క మంచి అంశాన్నీ వేగంగా ధ్వంసం చేస్తున్నారు. ఇది ఊహించినదే. కాని, ఇవాళ వాస్తవంగా నడుస్తున్నది జర్నలిజంలో ‘చీకటి యుగం’. దేశంలో లెక్కలేనన్ని వార్తా చానళ్లు ఉన్నాయి కాని అన్నిటికన్నీ నీతి తప్పి ఉన్నాయి. మన ప్రచారమాధ్యమాల పర్యావరణమే కుప్పకూలిపోయి, ధ్వంసమైపోయి ఉన్నది.

ఇవాళ ప్రతి ఒక్కరూ తనను తాను జర్నలిస్టుననే చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అధికారబలం ఉన్నవారికి సన్నిహితంగా ఉన్నవారు, లేదా వారితో ఉన్నవారు. ఈ దేశంలో జర్నలిజం అణగిపోవడానికి అసలైన కారణం ఈ జర్నలిస్టుల ముఖాలూ, వారి సంస్థలూ కావడం ఒక వైచిత్రి. వాళ్లు తామే మంచి జర్నలిజాన్ని తెస్తున్నామని కూడ చెప్పుకుంటున్నారు. వారి పట్ల జాగ్రత్తగా, అనుమానంగా ఉండమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశ్నలే లేని ఈ జర్నలిస్టులూ, చివరికి ప్రభుత్వమూ కూడ జర్నలిజం గురించి వారి నిర్వచనాన్నే మీ గొంతుల్లోకి తోయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్ డి టి వి తో నా జ్ఞాపకాలు

ఈ దశలో నేను ఇంతకాలమూ పనిచేసిన సంస్థ గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే భావోద్వేగంతో ఉన్నప్పుడు వస్తుగతంగా ఉండడం సాధ్యం కాదు. వాస్తవాలమీద భావోద్వేగాలదే పైచేయి అవుతుంది. కనుక భావోద్వేగాలను పక్కన పెడదాం.

ఎన్ డి టి వి తో నాకు ఆసక్తికరమైన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం చాల కష్టం. మీ వృత్తిపరమైన ప్రయాణానికి ఎందరెందరో దోహదం చేసినప్పుడు, ఎవరో ఒకరికే కృతజ్ఞతలు ఎలా చెప్పగలరు? గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న సహోద్యోగులు ఎంతో మంది తమలోని ఒక భాగాన్ని నాలో చూస్తారని నాకు తెలుసు. అది సరైనదే కూడ. అలాగే నేను ప్రతి ఒక్కరినుంచీ ఎంతో కొంత తీసుకున్నాను. అందుకు కృతజ్ఞుణ్ని.

పెళ్లికూతురు పుట్టింటి నుంచి వెళ్లిపోయేటప్పుడు ఆ కన్న ఇంటి కోసం విలపిస్తుంది. మరొక ఇంటికి వెళ్లిపోయాక కూడ కన్న ఇంటిని గుర్తు చేసుకుంటుంది. ఇవాళ నేను ఆ పెళ్లికూతురిలా ఉన్నాను. బహుశా అటువంటి అనుభూతిలో మునిగిపోయే క్షణం ఇది. భవిష్యత్తులో ఎప్పుడైనా అటువంటి భావోద్వేగం లేని సమతాస్థితిలో ఎన్ డి టి వి గురించి మాట్లాడతాను.

ఒక టివి ని నిర్మించేది బృందాలే అని ఎన్ డి టి వి నాకు నేర్పింది. యాంకర్లకు ప్రాధాన్యత పెరిగిపోయి వాళ్లు స్టార్లు గా మారాక, ఈ భావన కొంత దెబ్బతిన్నది. అయినా, మీ బృందం ఎంత మంచిదైతే మీ పని అంత మంచిదవుతుందని ఇవాళ కూడ నేను నమ్ముతున్నాను.

ఎన్ డి టి వి లో అనువాదకుడిగా లాంఛనంగా 1996 ఆగస్ట్ లో చేరాను. కాని అంతకు ముందు కూడ, ఎన్ డి టి వి లో వీక్షకులు రాసిన చేతి రాత ఉత్తరాలు చదివే పని చేసేవాణ్ని. ఆ ఉత్తరాలు వేరు వేరు కార్యక్రమాల మీద ఆయా యాంకర్లను ఉద్దేశించి ఉండేవి. ఆ ఉత్తరాలు చదువుతున్నప్పుడే దేశంలో టివి వీక్షకులు ఎలా తయారవుతున్నారో నాకు తెలిసింది. ఆ ఉత్తరాలు చదివి, వాటి ఆధారంగా నివేదికలు తయారుచేసి ఆయా కార్యక్రమాల నిర్మాతలకు ఇవ్వడం నా పని. అప్పుడు నేను ఒక రోజు కూలీని. నాకు అట్లాగే లెక్కకట్టి డబ్బులు ఇచ్చేవారు.

వీక్షకుల పట్ల నిజాయితీగా ఉండడం

నేను ఇప్పటికీ అటువంటి పనే చేస్తున్నానను కుంటాను. ఇవాళ కూడ వేలాది మంది నాకు రాస్తుంటారు. ఇప్పటికీ మీలో కొందరి నుంచి చేతిరాత ఉత్తరాలే అందుకుంటాను. వాటిలో చాల ఉత్తరాలను నేను చదువుతాను, వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలకు జవాబిస్తాను. మీ ముందర నన్ను నేను బహిరంగ పరచుకుంటాను. మీ గురించి నేనేమనుకుంటానో నిజాయితీగా చెప్పదలచాను. నేను నా ఆలోచనలను కత్తిరించుకుంటే, అది మీ పట్ల నిజాయితీగా లేకపోవడం అవుతుంది. ఒక రకంగా నేను పూర్తి చక్రం తిరిగివచ్చాననుకుంటాను. వీక్షకుల అభిప్రాయాల ఉత్తరాలు ఒకప్పుడు చదువుతుండేవాణ్ని, ఇప్పుడూ చదువుతున్నాను.

మీ అందరి సలహాలు, ప్రతిస్పందనలు, ఆశలు, విమర్శలు, అప్పుడప్పుడు నిందలు మధ్యనే నా జీవితమంతా సాగింది. అదే నన్ను మీకు చాల దగ్గర చేసింది. నేను మీ మధ్య ఉన్నప్పుడు, నిజంగా నేను నా కోసం జీవించలేదు. ఇప్పుడు, నాకు అందుకు సమయం దొరుకుతుందని నా ఆశ.

ఎవరో లాగేసినందువల్ల గూడు కోల్పోయిన పక్షి లాగుంది నా పరిస్థితి. కాని పక్షికి ఇప్పుడింకా ఎగరడానికి విశాల ఆకాశం ఉంది. నేను విలేఖరులు రాసిన నివేదికలనూ కథనాలనూ ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువాదం చేస్తుండేవాణ్ని. ఆ తర్వాత నేనే విలేఖరినయ్యాను. రవీష్ కీ రిపోర్ట్ అనే అనుదిన కార్యక్రమ నిర్మాతనయ్యాను.

ఉత్తరాలు చదివే పనిలో చేరిన మనిషి గ్రూప్ ఎడిటర్ అయ్యాడు. అది కేవలం ఎన్ డి టి వి లోనే సాధ్యం. ఇవాళ ఆ మనిషి తన రాజీనామా సమర్పిస్తున్నాడు.

ఈ సంస్థ వెనుక దారాలు లాగే శక్తిమంతమైన మనుషులెందరో ఉన్నారు. అందువల్ల ఇటువంటి రోజొకటి వస్తుందనేది నిశ్చయమే. కాని ఇప్పుడు ఆ రోజు వచ్చేసరికి, అది విచారకరంగా అనిపిస్తున్నది.

నన్ను అంచనా కట్టేటప్పుడు, చాల కింది స్థాయిలో ప్రారంభించానని నా మీద జాలిపడరనే ఆశిస్తాను. చాల కింది స్థాయిలో ప్రారంభించామని చెప్పి సానుభూతి సంపాదించేవాణ్ని కాను నేను. అటువంటివాళ్లు తాను ఎట్లా ఒక చిన్న చాయ్ దుకాణంలో బాల్యం గడిపానో అని హఠాత్తుగా చెపుతుంటారు. అదే సమయంలో అత్యంత ఖరీదైన విమానాల్లో ప్రయాణిస్తుంటారు. నా జీవన ప్రయాణం ఏదో అసాధారణమైనదని నేను అనుకోను. ఈ దేశంలో ప్రతి ఒక్కరిదీ కష్టభరితమైన జీవితమే. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉన్న రోగుల కుటుంబాలతో మాట్లాడి చూడండి. వాళ్లు ఎన్నెన్ని కొండగుట్టలు ఎక్కి అక్కడికి చేరారో ఊహించడం కూడ సాధ్యం కాదు. వాళ్లతో పోలిస్తే మన కష్టాలు పిపీలికాలు.

“నేను మీ కోసం పనిచెయ్యడానికి ప్రయత్నించాను”

ఇవాళ నేను మీతో టివి వీక్షకుల గురించి మాట్లాడదలచాను. వ్యవస్థలూ నిర్మాణాలూ పడిపోవడమూ, సమాజాలను విద్వేష కెరటాలు ముంచెత్తడమూ ఇటీవల మనందరమూ చూస్తున్నాం. కాని ఒక కొత్త వ్యవస్థ రూపు దిద్దుకోవడం నేను కళ్లారా చూశాను. ఆ వ్యవస్థ పేరు పౌరసత్వం. ఎన్ డి టి వి నాకొక అవకాశం ఇచ్చినప్పుడల్లా నేను మీ కోసమే పని చెయ్యడానికి ప్రయత్నించాను. నాకు అందిన అవకాశాన్ని మీ కథలతోనే నింపాను.

మీరు నామీద పెద్ద బాధ్యత పెట్టారు. మీరు మీ ఇళ్లలో, మీ మనసుల్లో నాకోసం ఒక న్యూస్ రూం నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు నాకు సహాయపడడానికి ముందుకొచ్చారు. మీరు నన్ను డబ్బు అడగలేదు. మీ కోసం ఏదో సహాయం చేయమని అడగలేదు. చాలమంది నా వీడియోలు రికార్డ్ చేసి పెట్టారు, నా పరిశోధనలో సహకరించారు. నా కార్యక్రమాలలో ప్రతి ఒక్కటీ మీ సహకారానికి ఒక వ్యక్తీకరణ. మీరే నాకు సమాచారం అందించారు, నా పొరపాట్లకు మందలించారు, నా కార్యక్రమాల్లో భాగమయ్యారు.

నిపుణులు, విద్యార్థులు, ప్రవాసులు, భారతీయులు అందరూ వీక్షకులే. కాని నా సహప్రయాణికులయ్యారు, తమంతట తామే జర్నలిస్టులయ్యారు. ఆవిధంగా వాళ్లు జర్నలిజం అనే ఒక చిన్న ద్వీపాన్ని పరిరక్షించారు.

ఆ అర్థంలో నేను టివి వీక్షకుల సముదాయం తయారు కావడమూ చూశాను, అది పూర్తిగా విచ్ఛిన్నమైపోవడమూ చూశాను. ఇప్పుడు, ఆ సముదాయం ఒక వ్యవస్థగా లేచి నిలవడం చూస్తున్నాను.

మీరు నా కృషిని విభిన్నమైన భాషలలోకి అనువదించారు. నాకు కావలసిన వనరులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి కావు, కాని మీరే వాటిని నాకు అందుబాటులోకి తెచ్చాను. నిజానికి నేను నడిపిన కార్యక్రమం ప్రైమ్ టైమ్ మీ ప్రైమ్ టైమే. ఆ కార్యక్రమంలో ఎప్పుడన్నా కొరత కనబడితే, వెనువెంటనే మీ అసంతృప్తి ప్రదర్శించేవారు. వీక్షకులే నాకు ఎల్లవేళలా సంపాదకులు. ఒక మనిషంటే అతని చుట్టూ ఉన్న మనుషుల సమాహారమే అని నేను ఎప్పుడూ అంటుంటాను. వీక్షకులుగా మీరు ఉన్నందువల్లనే రవీష్ కుమార్ ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నాడు.

మీ మద్దతు వల్లనే ఎంతోమంది జర్నలిస్టులు యూట్యూబ్ మీద, ట్విట్టర్ మీద ఉండగలుగు తున్నారు. మీరు వెబ్ సైట్లకు చందాదారు లయ్యారంటే, అవి నిలబడి ఉండడానికి సహాయ పడుతున్నారన్నమాట.

జర్నలిస్టులకు వీక్షకులెట్లా సహకరిస్తారు

ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనపడినప్పుడు, న్యాయస్థానాలు కూడ బలహీనపడినట్టు కనబడి నప్పుడు, బలోపేతంగా నిలబడినది మీరే. ఇవాళ్టి పరిస్థితులలో జర్నలిజపు అతి పెద్ద వ్యవస్థ మీరే. ఇవాళ జర్నలిజం వివేకవంతులైన వీక్షకులలోనే జీవిస్తున్నది, బ్రహ్మాండమైన భవనాల్లో, సంస్థల్లో కాదు. ఈ కాలంలో మీరు చేస్తున్న అతి పెద్ద సహాయం ఏమంటే, మీరు కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల పక్కన నిలబడుతున్నారు.

ప్రజల గొంతును నొక్కేసే శక్తులుండవచ్చు. ప్రజల గొంతును మత విద్వేషంతో నింపే, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే శక్తులుండవచ్చు. కాని మీలో కొందరు నాలో ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే, ప్రజాస్వామ్యమనేది చచ్చిపోయినప్పటికీ, సవ్యంగా సాగే ప్రజాస్వామ్యం ఉండాలనే కోరిక మిగిలే ఉంటుంది.అదంతా మీ వంటి బాధ్యతాయుత వీక్షకుల వల్లనే.

ఈ కష్ట సమయంలో, అభిమానతో నా బుగ్గలు పిండిన వృద్ధ స్త్రీలను కృతజ్ఞతతో తలచుకుంటున్నాను. నాకు మొక్కల కుండీలు కానుకలుగా ఇచ్చిన వాళ్లను, నేను ఆరోగ్యంగా ఉండాలని బలవర్ధక ఆహారం అందించినవాళ్లను కృతజ్ఞతతో తలచుకుంటున్నాను. మండుటెండల్లో పని చేస్తున్నప్పుడు నా మీద నీడగా గొడుగులు పట్టుకున్న వాళ్లున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నా జేబులోకి ఖరీదైన కలాలను తోసినవాళ్లున్నారు.

అందువల్లనే ఇవాళ నాకు మీ అందరినీ తలచుకోవాలనిపిస్తున్నది. మీరందరూ లేకపోతే నేననేవాణ్ని ఉండేవాణ్ని కాదు. మీరందరూ నాకు గర్వకారణం. చాలసార్లు నాకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ ప్రతినిధిని కాననీ, మీ ప్రతినిధినేననీ అనిపించింది.

నాకు పని చేసుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛ లభించింది. నా జీవితమే దాని మీద ఆధారపడినట్టుగా నేనా స్వేచ్ఛను కాపాడుకున్నాను. ఆ సమయంలో మీరు, విజ్ఞులైన వీక్షకులు నన్ను పరీక్షిస్తున్నారని నాకు తెలుసు. ఏ పొరపాటూ చేయకుండా ఉండడానికీ, అహంకారాన్ని దరిచేరనీయకుండా ఉండడానికీ జాగ్రత్తలు తీసుకున్నాను. అహంకారం వచ్చిందంటే నా స్వేచ్ఛను కోల్పోతానని నాకు తెలుసు. నా కళ్ల ముందే ప్రపంచం మారిపోతూ ఉండగా, టెస్ట్ మాచ్ లో బాట్స్ మన్ లాగ నేను రేఖ మీదనే నిలబడ్డాను. కాని హఠాత్తుగా ఎవరో అసలు మాచ్ నే ముగించారు, ఆట నియమాలను మార్చేశారు.

వీక్షకుల మీద ఇష్టారాజ్యంగా స్వారీ చేసేవాళ్లు ప్రతి దేశంలోనూ ఉంటారు. భారతదేశంలో కూడ ఉన్నారు. వాళ్లు మీకు వాస్తవాలే ఇస్తున్నామని నమ్మబలికితే అర్థమేమంటే, డాలర్లకు డాలర్లు తమ జేబుల్లో వేసుకుంటూ మీకు చిల్లర సెంట్లు విసురుతున్నా రన్నమాట. వాళ్ల తప్పులను బహిర్గతం చేయడానికి జర్నలిస్టులో, వార్తాసంస్థలో ప్రయత్నిస్తే, వారి మీద లెక్కలేనన్ని కేసులు బనాయిస్తారు. మళ్లీ వాళ్లే అర్థవంతమైన జర్నలిజమంటే తమకు అమిత ఆసక్తి అని గంభీరంగా చెపుతుంటారు.

హిందీ జర్నలిజం అవసరం

హిందీలో పనిచేసే అద్భుతమైన జర్నలిస్టులెందరో తమ అభిప్రాయాలను ప్రపంచంతో ఎందుకు పంచుకోరు? వాళ్ల పరిజ్ఞానం ఎంత లోతైనదో చూసి నేను ఆశ్చర్యపోయాను. కాని ఎప్పుడూ వారికి దక్కవలసిన స్థానం దక్కలేదు.

భారతదేశంలో అత్యధిక గౌరవం పొందే జర్నలిస్టులు ఇంగ్లిష్ మాధ్యమాలలో పనిచేసేవారే. అందువల్లనే నేను హిందీ జర్నలిజానికి గౌరవనీయత తేవడానికి ప్రయత్నించాను. ఈ భాషలో జర్నలిజం కూడ ముఖ్యమైనదేనని చూపాను. దేశం మొత్తం నుంచీ ప్రజలు నా హిందీని ప్రేమించేలా చేసేందుకు ప్రయత్నించాను. నిజానికి నా మాతృభాష హిందీ కాదు, భోజ్ పురి. నేను నా భోజ్ పురి కుగ్రామం నుంచి ఈ హిందీ మహానగరానికి నడిచివచ్చాను.

నా హిందీని సంపద్వంతం చేసిన దేశంలోని హిందీయేతర ప్రాంతాల ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పదలచాను. వారు నా పనిని తమ భాషల్లోకి అనువదించారు. వారి రచనలను నాకోసం హిందీలోకి అనువదించారు!

నేనొక బిడారులో ప్రయాణిస్తున్నాననీ, ఈ ప్రయాణంలో ఎంతో మంది నాతో భుజం కలిపి నడిచారనీ నాకు తరచుగా అనిపిస్తుంటుంది. ఇదేమీ హిందీ, ఇంగ్లిష్ జర్నలిజాల మధ్య కుస్తీ పోటీలా మారాలని నేను అనుకోవడం లేదు. అందువల్ల నా జీవితంలో ఇంగ్లిష్ భాషా జర్నలిస్టులు చేసిన ఎన్నెన్నో సహకారాలను కూడ తలచుకోవాలి.

జర్నలిస్టులు ఏం చేయవలసి ఉంది

వీక్షకులతో సమయం పంచుకున్నప్పుడల్లా, జర్నలిస్టుల పట్ల మీ విశ్వాసాన్నీ, సమస్యల పట్ల మీ లోతైన అవగాహనలనూ చూసి నేను ముగ్ధుడి నయ్యాను. మీ దగ్గర చెప్పవలసింది ఎంతో ఉంది. నిజానికి అదంతా వినడం ప్రభుత్వ బాధ్యత.

మీ గళాన్ని అత్యున్నత స్థాయిల దాకా తీసుకుపోయే మాధ్యమంగా ఉండడమే జర్నలిస్టులు చేయవలసిన పని. ఈ దేశాన్ని మీ కళ్ల ద్వారా చూడడానికే నేను ఎల్లప్పుడూ ప్రయత్నించాను. మీ క్రియాశీలతే భారత ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుతుంది. షహీన్ బాగ్, రైతుల ఆందోళన మీలో నా విశ్వాసాన్ని ఇనుమడింపజేశాయి. మీరు బాధ్యతాయుత పౌరులుగా రూపాంతరం చెందుతుండడం నేను గమనించాను. మీరే భవిష్యత్తులో మెరుగైన సమాజాలను సృష్టించగలరు.

సమాజం లోని సమస్త రంగాలనూ తమ అదుపులో ఉంచుకోగలమని ఇవాళ కొందరు భావిస్తున్నారు. పౌరులను గడ్డిపోచల్లా తీసేయగలమని లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రచార మాధ్యమాలనేవి మరణించాయి. రాజకీయ ప్రతిపక్షం పెనుగు లాడుతున్నది. అదంతా నిజమే. కాని ఇటువంటి స్థితి శాశ్వతం కాదు. ఒకానొక రోజున ప్రజలు తమ విద్వేషాన్ని అధిగమిస్తారు. వారు ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం గురించి ఆలోచిస్తారు. అప్పుడు వారు జర్నలిజం గురించి ఆలోచిస్తారు. నేను చదవడమూ, మాట్లాడడమూ, రాయడమూ ఎన్ డి టి వి దగ్గరే నేర్చుకున్నాను. మంచి దుస్తులు ధరించడం ఎట్లాగో, టై కట్టుకోవడం ఎట్లాగో ఎన్ డి టివి దగ్గరే నేర్చు కున్నాను. ఖాళీ సమయమే దొరకలేదు గనుక నాట్యం ఎలా చేయాలో మాత్రం నేర్చుకోలేకపోయాను.

మహిళా జర్నలిస్టుల దగ్గర నేర్చుకున్న పాఠాలు

నా మహిళా సహోద్యోగులను నేను ప్రత్యేకంగా తలచుకోదలచుకున్నాను. వాళ్లే నాకు నిజాయితీగా ఉండడం, కష్టపడి పని చేయడం, నీతిగా ఉండడం నేర్పారు. సామాజిక సమస్యల పట్ల నా అవగాహనలను వాళ్లు విశాలం చేశారు. ఎందరో స్త్రీల, బాలికల అనుభవాలు నా ప్రయాణంలో కలిసిపోయాయి. నా సహచరి, నా కూతుళ్లు, మా అమ్మ నాకు మద్దతు ఇచ్చారు. జర్నలిజంలో పురుషుల రాజ్యమే, పితృస్వామ్యమే నడుస్తున్నది. వారి దూకుడు ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి దూకుడు సృజనాత్మకతనూ, ఆలోచననూ చంపేస్తుంది. అటువంటి దూకుడుకు పాల్పడకుండా నన్ను నా మహిళా సహోద్యోగులే కాపాడారు.

ఈ జర్నలిజం క్షేత్రంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నట్టయితే మీకు నా సలహా ఏమంటే ఎల్లప్పుడూ మీ మహిళా సహోద్యోగులతో మన్ననగా ఉండండి. వాళ్ల సామర్థ్యాన్ని అంగీకరించండి, గౌరవించండి. వాళ్లను ప్రశంసించండి.

నేను ప్రైమ్ టైమ్ యాంకర్ గా ఉన్న రోజుల్లో నా జీవితమంతా ఆ కార్యక్రమానికే ముడిపడి ఉండేది. టివి వార్తలతో నేను ప్రేమలో పడ్డాను. బహుశా అందువల్లనే ఇవాళ నా గుండె పగులుతున్నది కాబోలు. ఎన్ డి టి వి ఎర్ర మైక్రోఫోన్ ఎల్లవేళలా నా స్మృతిలో నిలిచే ఉంటుంది.

నేను మీ దినచర్యలో భాగమయ్యానని, మీరు నా గురించి ఆలోచిస్తుండేవారని నాకు తెలుసు. నిజానికి నేను మౌనంగా వెళిపోదామనుకున్నాను. అందుకే గత కొన్ని రోజులుగా ప్రైమ్ టైమ్ నుంచి తప్పుకున్నాను. మీ దినచర్య నుంచి నన్ను చెరిపెయ్యాలనుకున్నాను, మీరు నన్ను మరిచిపోయేలా చేయాలనుకున్నాను. కాని మీరు నన్ను ఆ పని చేయనివ్వలేదు. నేను ఎందుకు కనబడడం లేదని మీరు ప్రశ్నలు గుప్పించారు, నాకేమైనా అయ్యిందా అని అడిగారు, నా ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు.

భారత దేశపు ప్రచారమాధ్యమాల స్థలం మారిపోయింది. జర్నలిస్టులుగా మారాలనే కోరికతో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి చదువుకుంటున్న భారతీయ యువకులను తలచుకుంటే నా హృదయం ద్రవిస్తున్నది. ఎందుకంటే, వాళ్లు చివరికి భారత రాజ్యపు సేవకులుగా పని చేయవలసి వస్తుంది. నీతిమంతులైన జర్నలిస్టులు పని చేయడానికి ఏ ఒక్క సంస్థా మిగలలేదు.

ఇవాళ జర్నలిస్టులుగా ఉన్నవారందరూ కూడ అయితే ఊపిరిసలపని స్థితిలోనైనా ఉన్నారు, లేదా ఈ వృత్తినే వదిలేసి వెళ్లిపోయారు. జర్నలిజం అంటే నెల జీతం అందే ఒకానొక వృత్తే తప్ప మరేమీ కాదని నాకు ఎందరో చెప్పారు. జీతం మినహా జర్నలిజంలో ప్రోత్సాహకమైన ప్రేరణ ఏదీ లేదు.

పవిత్రమైన జర్నలిస్టు మృత పౌరప్రజానీకానికి బాధ్యత వహించాలి. కనుక నిర్భయంగా మాట్లాడండి. ఉట్టి పాదాలతో నడిచి మహా బలోపేతమైన బ్రిటిష్ పాలనను మట్టి కరిపించిన దేశపు పౌరులు మీరు. మిమ్మల్ని నమ్మకుండా ఉండడానికి కారణమే లేదు. అనైతికమైన మాధ్యమాల వార్తాసందేశాల సంకెళ్లను మీరు తెంచుకోగలరు. మీరు అందుకు పోరాడవలసి ఉంది. పోరాడకపోతే మీకు తలెత్తి నడిచే అవకాశమే లేదు. మీరు ఆ పోరాటం చేయకపోతే, మీరు ఒక స్వతంత్ర దేశపు పౌరులుగా ఉంటారేమో గాని, అమ్ముడు పోయిన మాధ్యమాల బానిసలుగా మిగిలిపోతారు. అటువంటి స్థితి వస్తుందేమో తస్మాత్ జాగ్రత్త. చట్టవ్యతిరేకమైనదంతా చట్టబద్ధమైనదిగా కనబడేలా చేసేందుకు చట్టాల పేరు మీద ప్రజల హక్కులు కొల్లగొట్టబడుతున్నాయి.

ఈ క్షణాన, నా భవిష్యత్తు అనిశ్చితం. కచ్చితంగా ఉన్నదొకే ఒకటి, ఆశ.

(హిందీ నుంచి ఇంగ్లిష్: రక్షా కుమార్, ఇంగ్లిష్ నుంచి తెలుగు: ఎన్ వేణుగోపాల్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X