హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, విద్యార్థులను నిండా ముంచిందని మండిపడ్డారు. యువత, విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరీంనగర్‌లో నిర్వహించిన యువ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. పోరాటాలకు పురిటిగడ్డ అయిన కరీంనగర్ నుంచే యువత మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ నుంచే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారని కేటీఆర్ గుర్తుచేశారు. యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారని, ఉడుకు నెత్తురు ఉరకలెత్తితే పోరాటం పోటెత్తుతుందని అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పిడుగుల వర్షం కురుస్తుందని వ్యాఖ్యానించారు. చరిత్రను మలుపు తిప్పింది యువత, విద్యార్థుల పోరాటాలేనని చెప్పారు. ఢిల్లీలో యువత కదం తొక్కితే మోదీ ప్రభుత్వమే వణికిందని, మోదీనే గడగడలాడించిన యువతకు ఈ కేడీ ఒక లెక్క కాదని అన్నారు.

యువతకు స్కిల్ లేదని ఎవరు చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మాకు స్కిల్ లేదని ఎవరు చెప్పారు? సీఎంకు స్కిల్ ఉందా అని విద్యార్థులు అడుగుతున్నారు’’ అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దరఖాస్తు కూడా రాయడం రాదని, అక్షర దోషం లేకుండా ఏ భాషలోనూ రాయలేరని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని స్పష్టం చేశారు.
Also Read-
కష్టపడి సాధించుకున్న తెలంగాణను పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో అనుకోని ఘోరం జరిగిందని, తెలంగాణ ఇవ్వకుండా వేలాది మంది ప్రాణాలను బలిగొన్న కాంగ్రెస్ పార్టీ జిత్తులతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నిరుద్యోగులపై దొంగ ప్రేమ కురిపించి గాలిమాటలతో ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను కేటీఆర్ వరుసగా ప్రశ్నించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశారా అని నిలదీశారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్ చట్టం తీసుకొస్తామన్న హామీ ఏమైందన్నారు. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు, యువతకు రూ.10 లక్షల రుణాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందుతోందా అని నిలదీశారు.
‘‘అప్పుడు యూత్ డిక్లరేషన్.. ఇప్పుడు రేవంత్ బూతు డిక్లరేషన్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని యువత ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులను నిండా ముంచి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోసం చేసిన కాంగ్రెస్ నేతలను యువత నిలదీయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా యువతకు ఉద్యోగాల విషయంలో స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని కేటీఆర్ అన్నారు. ‘‘నోటిఫికేషన్ లేదు.. లూటిఫికేషన్ మాత్రం నడుస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదు.. రాష్ట్రంలో స్కాం క్యాలెండర్ నడుస్తోంది’’ అని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
అశోక్‌నగర్‌లో యువతను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఓట్లు వేయించుకున్న తర్వాత రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ‘‘మీరు రాకపోతే మేమే ఢిల్లీకి వస్తాం’’ అని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో సీఎం, మంత్రులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే వాటాల కోసం తన్నుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. బకాసుర బ్రదర్స్ బస్తాల నిండా డబ్బులు దోచుకుంటున్నారని విమర్శించారు. సబ్బండ వర్గాలనూ కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో విజన్ లేదని.. విధ్వంసమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేసి పోరాడారని కేటీఆర్ గుర్తుచేశారు. 2006లో కేసీఆర్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ వీపు పగిలిందని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా? అని ప్రశ్నించిన కేటీఆర్.. వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయలేని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని తరాల పాటు కనిపించకుండా పోయేలా యువత తీర్పు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కాలిబూడిదయ్యే వరకు నిరుద్యోగులు నిప్పుకణికలై మండాలని పిలుపునిస్తూ.. యువత మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని కేటీఆర్ కోరారు.
