“మహిళా ఎమ్మెల్యేలపై దాడికి రేవంత్‌దే బాధ్యత, సీఎం క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం”

హైదరాబాద్ : మహిళా శాసన సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్‌ శాసన సభ్యులపై సోమవారం జరిగిన అక్రమ దాడి, దాష్టికానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ముమ్మాటికీ బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా వారి చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు లాగుతూ దాడి చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శాసన సభ్యులపై పోలీసులు ఇంత దాష్టికంగా వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయని అన్నారు. ఈ దమనకాండకు ముఖ్యమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

ఒకవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకొని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే మహిళా శాసన సభ్యులపై దాడులు చేయిస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. రాహుల్‌గాంధీ రాజకీయాల్లోకి రాకముందే తమ మహిళా శాసన సభ్యులు అనేక పదవులు అలంకరించి, వాటికి వన్నెతెచ్చి, రాజకీయాల్లో అజాతశత్రువులుగా నిలిచారని గుర్తుచేశారు. అలాంటి మహిళా నేతలపైనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారని ఆరోపించారు.

మహిళా శాసన సభ్యులకు జరిగిన అవమానం, దాష్టికాన్ని చూసిన తర్వాత ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారని, ఈ దుశ్శాసన పర్వం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి తనకు తెలిసిన అటెన్షన్‌ డైవర్షన్‌ రాజకీయాలను మొదలుపెట్టారని కేటీఆర్‌ విమర్శించారు. అసలు జరిగిన దాడి, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అవమానంపై సమాధానం చెప్పకుండా తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదించి అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

Also Read-

నిరసన తెలిపే హక్కు లేదా?

ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు ఉన్న నిరసన తెలిపే హక్కు మేరకు ఉదయం టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్‌ చెప్పారు. ఇదే తరహా టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు, రాహుల్‌గాంధీ కూర్చున్నప్పుడు వారిని ఎక్కడా అడ్డుకోలేదని గుర్తుచేశారు. లోక్‌సభలో ఉన్న నిబంధనలే రాష్ట్ర శాసనసభలోనూ ఉంటాయని, కానీ తెలంగాణలో మాత్రం కొత్తగా కొన్ని నిబంధనలు వచ్చినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

‘స్పీకర్‌గారి ఆదేశాల మేరకే మిమ్మల్ని అడ్డుకుంటున్నాం’ అంటూ పోలీసులు తమను అడ్డుకున్నారని, దాడి చేశారని కేటీఆర్‌ తెలిపారు. కేవలం 1,000 రోజుల కాంగ్రెస్‌ పాలనలోని హామీల వైఫల్యాన్ని, పరిపాలనా వైఫల్యాన్ని సభలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని ఆరోపించారు. ఇందుకోసం పోలీసులతో దాడులు చేయించారని మండిపడ్డారు. ఏది కరెక్టో, ఏది కాదో నిర్ణయించేది పోలీసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ‘రాహుల్‌గాంధీకి ఒక రూలు.. మాకొక రూలు ఉంటుందా?’ అని నిలదీశారు. దీనిపై స్పీకర్‌ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సీఎం కూడా ఎమ్మెల్యేనే, స్పీకర్ పక్షపాత వైఖరి వీడాలి

గతంలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ గుర్తుచేశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్‌ ఇవ్వనని గతంలో స్పీకర్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి కూడా సభలోని ఇతర సభ్యుల మాదిరిగానే ఒక శాసన సభ్యుడేనని గుర్తించాలన్నారు. సభానాయకుడైనప్పటికీ ఆయనకు ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవనే ప్రాథమిక విషయాన్ని స్పీకర్‌ గుర్తించాలని సూచించారు.

ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ప్రశ్నించడం కోసమే ప్రజా ప్రతిపక్షం ఉందని చెప్పారు. ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగుడుతూ బాకాలు ఊదుకోవచ్చని, అది తమకు అవసరం లేదన్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం, వారి సమస్యలు, ఆవేదన, బాధను సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడమే తమ బాధ్యత అని చెప్పారు.

1000 రోజుల వైపల్యంపైన ఏండగడుతామనే కాంగ్రెస్ భయం

ఈ అసెంబ్లీ సమావేశాల్లో 1,000 రోజుల వైఫల్య పాలన, 420 గ్యారెంటీలు, హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నదే తమ ఉద్దేశమని కేటీఆర్‌ తెలిపారు. అందుకే ఇంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా, అరాచకంగా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా శాసన సభ్యులపై జరిగిన దాడికి ముమ్మాటికీ రేవంత్‌రెడ్డే కారణమని పునరుద్ఘాటించారు. ఈ దారుణానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

శాసన సభ్యులకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మహిళలంతా గమనిస్తున్నారని అన్నారు. స్పీకర్‌ కూడా ప్రియాంకగాంధీకి ఒక రూలు, తమ మహిళా శాసన సభ్యులకు మరో రూలు ఉంటుందా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.

మహిళా నేతల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ కు లేదు

గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాము స్వయంగా క్షమాపణ చెప్పిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. అదే తమ సంస్కారం అని అన్నారు. ఒకప్పుడు సోనియాగాంధీని బీజేపీ ముఖ్యమంత్రులు అడ్డగోలుగా మాట్లాడితే వారిని తూలనాడుతూ, సోనియాగాంధీని డిఫెండ్‌ చేసిన నాయకుడు కేసీఆర్‌ అని గుర్తుచేశారు. అది తమ సంస్కారమని చెప్పారు.

మహిళా నేతలపై దాడి చేసి దాని నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ స్పీకర్‌కు మనస్తాపం కలిగితే తాను అనని మాటకు కూడా విచారం వ్యక్తం చేశానని చెప్పారు. ఈ అంశంలో ఇక చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. అయితే మహిళా శాసన సభ్యులపై దాడి చేయించిన ముఖ్యమంత్రి రేపు సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసన సభ్యులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నెల రోజుల పాటు సభ నడపాలి

సభ సాఫీగా నడవాలన్నదే తమ ఉద్దేశమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని, నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను సభలోకి రాకుండా అడ్డుకున్నదని ఆరోపించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జగదీశ్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, డాక్టర్‌ సంజయ్‌తో పాటు తనను, హరీశ్‌రావును కూడా పోలీసులు గాయపరుస్తూ, ఈడ్చుకుంటూ వెళ్లారని తెలిపారు.

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?

రేవంత్‌రెడ్డి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు చెబుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారెంటీ అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ బాకాలు ఊదుకుంటూ, ఇప్పుడు ఆడబిడ్డల చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు లాగడమే ఇందిరమ్మ పాలనా? అని ప్రశ్నించారు. మహిళల పట్ల తమ ప్రభుత్వానికి కనీస గౌరవం ఉంటే ఈరోజు జరిగిన దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దళితుల గురించి మాట్లాడే అర్హత దళిత వ్యతిరేఖ కాంగ్రెస్ కు లేదు 

దళితులపై రేవంత్‌రెడ్డి దొంగ ప్రేమ వలకబోస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దళిత డిక్లరేషన్‌పై చర్చకు పెట్టాలని డిమాండ్‌ చేశారు. దళిత డిక్లరేషన్‌లో ఇచ్చిన ఎన్ని హామీలను అమలు చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.

గత ప్రభుత్వం అమలు చేసిన దళితబంధును ఎత్తివేసి అభయహస్తం ఇస్తామని, రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇంటికి రూ.6 లక్షలు ఇస్తామని, అసైన్‌ భూములకు పట్టాలు ఇస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. నిజంగా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ దళిత వ్యతిరేకమో తేలాలంటే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని, ఆ చర్చలో పాల్గొని ప్రభుత్వాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీలపై నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని దళిత, గిరిజనుల నుంచి అసైన్‌ భూములను గుంజుకుంటూ ఎక్కడికక్కడ కుంభకోణాలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

అసెంబ్లీ విలువల గురించి రేవంత్‌ మాట్లాడటమా?

అసెంబ్లీ విలువలు, సంప్రదాయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోనే ఆడబిడ్డల బట్టలు ఊడదీస్తానని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సభా విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. శాసనసభలోనే కాకుండా శాసనసభ బయట కూడా అడ్డగోలుగా, నీచమైన బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో రేవంత్‌రెడ్డి ఒక్కరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

1,000 రోజుల పాటు అన్ని రంగాల్లో సర్వభ్రష్ట పాలన అందించి, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నిజంగానే రాజీనామా చేయాల్సి వస్తే ప్రతిపక్షం అడిగినందుకు కాదని, తన పరిపాలనా వైఫల్యానికి, అవినీతి, అరాచకాలకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అన్నారు.

బీఏసీని బహిష్కరించాం

రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు కేటీఆర్‌ తెలిపారు. మహిళా శాసన సభ్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన అనుచిత వైఖరికి, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చేయించిన దమనకాండకు నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిష్కరించామని చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

తమ శాసన సభ్యులపై జరిగిన దాడిపై హైకోర్టును ఆశ్రయించామని కేటీఆర్‌ తెలిపారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందన్నారు. శాసన సభ్యులను పోలీసులు అడ్డుకునే హక్కు లేదని స్పష్టం చేసిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.

తమ దళిత ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ విమెన్‌ దృష్టికి కూడా తీసుకెళ్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మహిళా శాసన సభ్యులపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

జగదీష్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు

అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ వద్ద గాయపడిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి గారిని దింపారు. ఆయన బిపి 185 కు పైగా ఉన్న పోలీసులు బయటకి పంపించకపోవడంతో… పార్టీ సీనియర్ నేతల ఆందోళనతో నిమ్స్ కి తరలించారు. అక్కడ జగదీష్ రెడ్డి గారు చికిత్స తీసుకుంటున్నారు.

కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X