బూత్ అధ్యక్షుల కృషి వల్లే భారతీయ జనతా పార్టీ కమలం దేశవ్యాప్తంగా వికసిస్తోంది : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

హైదరాబాద్ : ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మన ఉత్సాహవంతమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. జేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన మాట్లాడుతూ బూత్ అధ్యక్షుల నుంచి బూత్ కమిటీ సభ్యుల వరకు, మండల అధ్యక్షుల నుంచి ప్రతి కార్యకర్త వరకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. నా యువ మిత్రులారా, మాతృశక్తికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు.

మన బూత్ అధ్యక్షుల కృషి వల్లే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కమలం దేశవ్యాప్తంగా వికసిస్తోంది. మీ శ్రమ, మీ అంకితభావం, మీ కృషి వల్లే బీజేపీ విజయపతాకం ఎగురవేస్తోంది. ఈ రోజు నేను అలాంటి అంకితభావం కలిగిన కార్యకర్తల మధ్య ఉండటం గర్వంగా భావిస్తున్నాను. బూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తల శక్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి “వికసిత్ భారత్” నిర్మాణ లక్ష్యాన్ని మనం తప్పకుండా సాధిస్తాం. ఈ సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ ని స్మరించుకుంటున్నాను. ఆయన దృఢ సంకల్పం వల్లే హైదరాబాద్, తెలంగాణ ఈ రోజు అఖండ భారతదేశంలో అంతర్భాగంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. తెలంగాణతో భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం కేవలం రాజకీయ బంధం కాదు. అది పోరాటాల బంధం, ప్రజల విశ్వాసంతో ఏర్పడిన బంధం.

కొంతమంది భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కొత్త పార్టీ అని అంటుంటారు. వారికి నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలుచుకున్న రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటిని తెలంగాణ ప్రజలే ఇచ్చారు. ఇది తెలంగాణకు, భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్న చారిత్రాత్మక అనుబంధానికి నిదర్శనం. అనేక వీరులను కన్న నేల అయిన వరంగల్ గడ్డపై నిలబడి మాట్లాడుతున్నాను. ఈ నేల పోరాటాలకు, ఆత్మగౌరవానికి, త్యాగాలకు ప్రతీక. తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై చూపుతున్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ, 2028లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. జాతీయవాద భావజాలంతో, భారతీయ సంస్కృతి విలువలను ఆధారంగా చేసుకుని తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వాలన్నది భారతీయ జనతా పార్టీ సంకల్పం.

Also Read-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ లాభనష్టాలను ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించింది. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దివంగత సుష్మా స్వరాజ్ బలమైన స్వరం వినిపించారు. ఆమె కృషితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. అయితే తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రజలు కలలుగన్న ఆశయాలు, ఆకాంక్షలు నేటికీ పూర్తిగా నెరవేరలేదు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలు ఆ కలను దెబ్బతీశాయి. ఆ కలను మళ్లీ సాకారం చేయడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. మాకు అధికారం లక్ష్యం కాదు. ప్రజాసేవే లక్ష్యం. సేవ ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి రావాలనే సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా నిలుస్తాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవ చేస్తాం. ఈ రోజు నేను ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను-ప్రతి బూత్‌లో కమలం వికసించాలి. ప్రతి బూత్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి. అప్పుడే మన సంకల్పం సాకారం అవుతుంది.

ప్రతి ఇంటికి చేరుకోవాలి. ప్రతి కొత్త ఓటరును ఓటరు జాబితాలో చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలి. సమాజంలోని ప్రతి వర్గాన్ని భారతీయ జనతా పార్టీతో అనుసంధానం చేయాలి. ప్రతి వర్గం ఆశలు, ఆకాంక్షలకు బీజేపీ వేదిక కావాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త 24 గంటలు ప్రజల కోసం పనిచేసే సేవకుడు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపిస్తారు. అలాంటి వారిని నేను “పార్ట్‌టైమ్ రాజకీయ నాయకులు” అంటాను. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రం ఎల్లప్పుడూ ఫుల్‌టైమ్ ప్రజాసేవకుడే. 2023లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఎన్నో హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై కాకుండా, తమ పార్టీ ప్రయోజనాలు, నాయకుల రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించింది. ఆ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేశారు.

ఇప్పుడు తెలంగాణలో నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి, సంకల్పం, నాయకత్వం బీజేపీకే ఉంది. మనమందరం ఒకే లక్ష్యంతో, ఒకే సంకల్పంతో, ఒకే దిశగా ముందుకు సాగాలి. ప్రతి బూత్‌ను బలోపేతం చేస్తూ, ప్రతి కార్యకర్తను శక్తివంతం చేస్తూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయానికి బాటలు వేయాలి. భారతీయ జనతా పార్టీ సేవాభావంతో, జాతీయవాద సిద్ధాంతాలతో ముందుకు నడిచే పార్టీ. ప్రజాసేవే మా లక్ష్యం, దేశాభివృద్ధే మా సంకల్పం. 2028లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా ప్రధాన లక్ష్యం. ప్రతి బూత్‌లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలి. ప్రతి ఇంటికి చేరుకోవాలి. ప్రతి కొత్త ఓటరును ఓటరు జాబితాలో చేర్చే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కంటే తమ కుటుంబాల, పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. వారి పాలనలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. యువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఈ వర్గాల అభివృద్ధి ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశంలో సామాన్య ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చాయి.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత ధాన్యం అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నాము. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తూ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నాము. పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాము. ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా పారదర్శక వ్యవస్థను తీసుకువచ్చాము. మహిళల గౌరవం, భద్రత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మరుగుదొడ్లు నిర్మించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాము. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోంది. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అనే సిద్ధాంతంతో సమగ్ర అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ఈ దేశం కరోనా మహమ్మారి అనే సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రపంచమంతా స్తంభించిపోయిన ఆ సమయంలో, “భారత్ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడుతుంది?” అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో ఆ సంక్షోభాన్ని భారతదేశం విజయవంతంగా ఎదుర్కొని ముందుకు సాగింది. కరోనా ఆపత్కాలంలో దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ వ్యాక్సిన్ విదేశాల్లో కాదు..మన భారతదేశంలోనే తయారైంది. అదే ఆత్మనిర్భర్ భారత్‌కు గొప్ప నిదర్శనం. దాదాపు 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందిస్తూ, భారతదేశ ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడటమే కాకుండా ప్రపంచ ఆరోగ్య రక్షణలో కూడా భారత్ కీలక పాత్ర పోషించింది. 2014కు ముందు దేశ భద్రతపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఉండేది. దేశంలోని ఏ ప్రాంతంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరుగుతుందో, ఎప్పుడు ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడి దాడి చేసి వెళ్లిపోతారో తెలియని పరిస్థితి ఉండేది.

కానీ గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశంపై దాడి చేయాలని చూసిన ప్రతి దుష్టశక్తికి గట్టి సమాధానం ఇచ్చింది. ఈ రోజు భారత్ సర్జికల్ స్ట్రైక్‌లు చేసే దేశంగా, ఎయిర్ స్ట్రైక్‌లు చేసే దేశంగా ప్రపంచ దేశాల ముందు సత్తా చాటింది. ఆపరేషన్ సింధూర్ తో దేశ గౌరవాన్ని, జాతీయ భద్రతను కాపాడుతూ పాకిస్తాన్‌కు కూడా తగిన గుణపాఠం చెప్పాం. నక్సలిజం సమస్యతో బాధపడిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో నక్సలిజాన్ని నిర్మూలించే దిశగా దేశవ్యాప్తంగా కీలక విజయాలు సాధించాం. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా దాని వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలే భవిష్యత్తుకు పునాది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ బాధ్యతను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంది.
కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాళేశ్వర్ ఆలయ పునరుద్ధరణ, అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి పునర్జీవం పోశాయి. ఈ రోజు భారతదేశం తన సంస్కృతి, తన ఆత్మవిశ్వాసంతో పునర్నిర్మాణ దశలో ముందుకు సాగుతోంది.

కాశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో ఈ రోజు త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది. ఈ విషయంలో ఈ దేశం ఎలాంటి రాజీ పడదు. ఒకప్పుడు లాల్ చౌక్‌లో ఒకప్పుడు లాల్ చౌక్‌లో దేశ వ్యతిరేక శక్తులు సవాళ్లు విసిరిన పరిస్థితులు కూడా మనం చూశాం. భారత సైనికులపై దాడులు జరిగినా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మౌనంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడితే, గత ప్రభుత్వాల పాలనలో అవినీతి పెరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ అవినీతి పాలనను గద్దె దించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఉంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పేదలను పేదలుగానే చూడాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి సంపూర్ణంగా అందాలి. వారి హక్కులకు భంగం కలిగే విధంగా మతం లేదా ఇతర ప్రాతిపదికలపై రిజర్వేషన్లు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతోంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది.

జాతీయ రహదారి-163 కింద యాదాద్రి–వరంగల్ మధ్య 99 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.1,900 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.770 కోట్లతో పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. కాజీపేటలో రూ.521 కోట్లతో రైల్వే కోచ్ తయారీ యూనిట్ ఏర్పాటు పనులను కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారు కలగన్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ కలను సాకారం చేస్తోంది. ఈ ప్రాజెక్టు వరంగల్ యువతకు భారీ ఉపాధి అవకాశాలతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది అవుతుంది. వరంగల్‌ను హెరిటేజ్ సిటీ అభివృద్ధి పథకం కింద రూ.196 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. ఆధునిక సౌకర్యాలతో ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతాము.

రోడ్లు, విద్యుత్, నీరు, భవనాల నిర్మాణం మాత్రమే అభివృద్ధి కాదు. జ్ఞానం, సాంకేతికత, నవకల్పనలు, దూరదృష్టితో దేశ భవిష్యత్తును నిర్మించడమే నిజమైన అభివృద్ధి. అందుకే కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, డీప్ టెక్ రంగాల్లో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. ఇటీవల జరిగిన గ్లోబల్ AI సమ్మిట్‌కు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. AI రంగంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుందని వారు స్పష్టంగా విశ్వసించారు. అయితే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విజయాన్ని దెబ్బతీయడానికి, దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కానీ భారత యువత ఇక అలాంటి దుష్ప్రచారాలకు మోసపోదు. AI, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, డీప్ టెక్ రంగాల్లో భారత్‌ను ప్రపంచ నాయకుడిగా నిలబెట్టేందుకు యువత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతోంది. భారతదేశ భవిష్యత్తు అత్యంత ప్రకాశవంతంగా ఉంది. ఆ భవిష్యత్తును నిర్మించేది యువత, ఆ మార్గాన్ని చూపేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X