“కన్నతల్లిని చంపి దండేసి కీర్తించే బాపతు కేసీఆర్”

-బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించాడు

-చనిపోయాక దండేసి కీర్తిస్తున్నడు

-అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నడు

-అసెంబ్లీలో అంబేద్కర్, గాంధీజీలను ఆకాశనెత్తుతడు

-సర్పంచ్ లుసహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను సర్వనాశనం చేసిన కేసీఆర్

-కేసీఆర్ కు దమ్ముంటే పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

-వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా?

-మొక్కలు ఎండిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తున్నారు… మరి నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దు?

-రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి…

-ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలకు ఇండ్లు, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం

హైదరాబాద్ : కన్నతల్లిని చంపేసి ఆమె ఫొటోకు దండేసి కీర్తిస్తూ దండం పెట్టే బాపతు ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్పూర్తిని తుంగలో తొక్కుతూ అసెంబ్లీ లో వారి గురించి గొప్పగా పొగడటం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు.

తెలంగాణ కోసం జీవితాలనే ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలను పదేపదే తూలనాడిన కేసీఆర్.. వారు చనిపోయాక కీర్తిస్తుండటం సిగ్గు చేటన్నారు. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం రామసాగర్ లో ఈజీఎస్ నిధులతో గ్రామ పంచాయతీ భవనం, ఇంటర్నల్ రోడ్డు పనులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, స్థానిక బీజేపీ నేతలతో ప్రవీణ్ బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• రామసాగర్ లో 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షలతో ఇంటర్నల్ రోడ్ నిర్మాణానికి వెచ్చిస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లే.. రాజకీయాలకు అతీతంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలనే లక్ష్యంతో కేంద్ర నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్నారు. సర్పంచులుసహా స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారాలివ్వాలని 73వ రాజ్యాంగ సవరణ చెబుతుంటే… అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నడు.

• కేసీఆర్ తీరు ఎట్లా ఉందంటే.. కన్నతల్లిని చంపి ఆమె ఫోటోకు దండేసి బాపతు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానంటడు. అసెంబ్లీలో అంబేద్కర్ ను పొగుడుతాడు. తెలంగాణ కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన జయశంకర్, కొండా లక్ష్మణ్ లను అడుగడుగునా అవమానించిండు.. వాళ్లు చనిపోయాక పొగుడుతున్నడు.

• గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచిండు.. సర్పంచ్ వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసిండు. ఏకగ్రీవంగా పంచాయతీలకు నిధులిస్తానన్నడు. సీఎం నిధి నుండి ఫండ్స్ ఇస్తానన్నడు. పంచాయతీలను నిధులిస్తానని మోసం చేసిండు. చివరకు సర్పంచ్ అధికారులకే కత్తెర వేసిండు. కేంద్ర నిధులన్నీ దారి మళ్లించిండు.

• ఇదేమిటని ప్రశ్నించే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తానంటున్నడు… మొక్కలు ఎండిపోతే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తున్నరు కదా…సర్పంచుల పైసలు దొబ్బుతున్న సీఎం కేసీఆర్ ను ఏం చేయాలే? నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు?

• జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు రూ.24 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. సగటున 50 లక్షల మందికి కేంద్రం ఉపాధి కల్పిస్తోంది. కరీంనగర్ పరిధిలోనే లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నం. కేంద్రం ఇస్తున్న జాతీయ ఉపాధి నిధులన్నీ కేసీఆర్ దారి మళ్లిస్తున్నడు. లెక్కలడిగితే కనీసం వివరణ ఇవ్వలేదు. కేసీఆర్ నిర్వాకంవల్ల రూ.150 కోట్లు వెనక్కుపోయినయ్.

• డబుల్ బెడ్రూం ఇండ్లుసహా లబ్దిదారుల ఎంపిక గ్రామ సభలు నిర్వహించి నిర్ణయించాలి. కానీ ఎమ్మెల్యేలకు ఆ అధికారం ఇవ్వడంవల్ల లంచాల పెరిగిపోయినయ్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం మోదీగారు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిస్తే సర్పంచులకు అధికారాలు కల్పిస్తే వాళ్ల పైసలను అర్ధరాత్రి ఎత్తుకుపోయిన దొంగ కేసీఆర్.

• కేసీఆర్ నిర్వాకంవల్ల ఇయాళ సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. పండగొస్తే తట్టెడు మట్టి కూడా తీయలేని దుస్ధితి వాళ్లది. సర్పంచ్ పరిస్థితే ఇట్లుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవాలి. మా బతుకులే బాలేదు.. ఇక ప్రజల బతుకులను ఏం బాగుచేస్తామనే నిర్వేదంలో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్ధం చేసుకోవాలి.

• నేను చాలాసార్లు సవాల్ చేసిన. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి. గ్రామాల వారీగా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులేవి? ఇస్తున్న నిధులెన్ని? అట్లాగే కేంద్రం నేరుగా, ఆర్దిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులెన్ని? వీటిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

• వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నారా? నిరూపించాలని నేను సవాల్ చేసిన. తోకముడుచుకున్నడు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలాడుతుంటే జనం నవ్వుకుంటున్నరు.

• రుణమాఫీ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? రుణమాఫీ అమలు చేయకపోవడంవల్ల రైతుల సొంత సొమ్మును బ్యాంకోళ్లు జమ చేసుకుంటున్నరు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నరు. రామరాజ్యం రావాలని భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యంతోపాటు నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. ఫసల్ బీమా కింద పంట నష్టపరిహారం అందిస్తాం

కవితమ్మా…. ముందు మీ అయ్యను నిలదీయ్

-మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగు

-తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమను

-మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించు

-మహిళా బిల్లు కాపీలను చించేసిన పార్టీలతో ఎందుకు దోస్తీ చేస్తున్నాడో నిలదీయ్

-మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నాడో సమాధానం చెప్పమను

-మహిళా బిల్లుపై జంతర్ మంతర్ దగ్గర ధర్నా వార్త చూసి జనం నవ్వుకుంటున్నరు

-కరెంట్, ఆర్టీసీ, నల్లా, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ప్రజలను చావబాదుతున్నోళ్లు ధర్నాలు చేయడం సిగ్గు చేటు

-ఎంఐఎం పరాన్న జీవుల పార్టీ… కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ

-ఓవైసీకి దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలి

-డిపాజిట్లు రాకుండా చేసి తీరుతాం

-ముస్లిం మహిళలంతా బీజేపీవైపే…

-వాళ్లు ఓటేయడంవల్లే ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచాం… 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం

-సాత్విక్ దోస్తులను బెదిరిస్తే చైతన్య కాలేజీ నిర్వాహకులను గల్లాపట్టి బయటకు గుంజుకొచ్చి తంతం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

మహిళా బిల్లు విషయంలో కేసీఆర్ బిడ్డ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే నవ్వొస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ‘‘జంతర్ మంతర్ దగ్గర తరువాత ధర్నా చేయ్… ముందు మీ అయ్యను నిలదీయ్. మీ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు ఇచ్చారో చెప్పమను. మీ ప్రభుత్వంలో మహిళలెంత మంది ఉన్నరు? మహిళలంటే ఎందుకంత కక్ష? పోయిన కేబినెట్ లో మహిళలకు ఎందుకు చోటివ్వలేదు. మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నవ్? మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎందుకు స్పందించవ్? పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ కాపీలను చించిపారేసిన పార్టీలతో ఎందుకు దోస్తానా చేస్తున్నవో నిలదీయ్…’’అంటూ సవాల్ విసిరారు.

• ఈరోజు కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వివిధ అభివ్రుద్ధ పనులకు హాజరైన బండి సంజయ్ మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్, బీజేపీ నేత బోగ శ్రావణి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, శ్రావణిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..

• ఈరోజు బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.400 కోట్లను కేటాయించడం సంతోషం. ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు.

• ఇయాళ జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ బిడ్డ ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నరు. ముందు మీ అయ్య దగ్గరకు వెళ్లి నిలదీయ్… మీ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు ఇచ్చారు? మీ ప్రభుత్వంలో మహిళలెంత మంది ఉన్నరు? నీకెందుకు మహిళలంటే అంత కక్ష? తొలి కేబినెట్ లో మహిళలకు ఎందుకు చోటివ్వలేదు? మహిళా గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నవ్? మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎందుకు స్పందించవు? పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ కాపీలను చించిన పార్టీలతో ఎందుకు దోస్తానా చేస్తున్నవని నిలదీయ్… ఆ తరువాత మహిళా బిల్లు గురించి మాట్లాడు..

• మెడికో ప్రీతినాయక్ చనిపోతే, నిర్మల్ లో బాలికపై మీ పార్టీ నేతే అత్యాచారం చేస్తే కనీసం మీ అయ్య స్పందించరు. గంటకో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడనం లేదని మీ అయ్యను నిలదీసే ధైర్యముందా?

• నేషనల్ క్రైమ్ బ్యూర్ రికార్డ్స్ ప్రకారం తెలంగాణలో నేరాల సంఖ్య 17 శాతం పెరిగింది. హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణగా మారింది. హత్యలు, అత్యాచారాలు చేసేటోళ్లలో ఎక్కువ మంది బీఆర్ఎసోళ్లే. ఎవరైనా ఇతరులు అత్యాచారాలు చేసి బీఆర్ఎస్ లో చేరితే వాళ్ల కేసులు మాఫీ చేస్తున్నరు. పైగా అత్యాచారాలు, హత్యలు చేసేటోళ్లను హీరోలుగా చిత్రీకరిస్తున్నరు.

• బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వాళ్లకు చుక్కలు చూపిస్తాం… వాళ్ల అంతు చూస్తాం. యూపీ తరహాలో వాళ్ల ఇళ్లు కూల్చేస్తాం. యూపీలో అట్లాంటోళ్లు బెయిల్ వచ్చినా బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నరు. మరి తెలంగాణలో అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే కేసులెందుకు నీరుగారుస్తున్నరు? శిక్షలు ఎందుకు పడటం లేదో ప్రజలు ఆలోచించాలి.

• గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ కు సిగ్గుండాలి. పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎట్లున్నయ్.. తెలంగాణ కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నయ్? కరెంట్ ఛార్జీలు 10 సార్లు పెంచారు. 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండ్రు. నల్లా ఛార్జీలు, రిజిస్ట్రేషన్లు పెంచి జనాన్ని బాదుతున్నరు. వీటిపై మీరెందుకు ధర్నా చేయలేదు? బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తం.. గ్యాస్ ధరలు పెరిగినందుకు మేం కూడా బాధపడుతున్నాం. కానీ రష్యా – ఉక్రెయిన్ యుద్దం వల్ల చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయనే విషయం ప్రజలకు తెలుసు.

• నిన్న నార్సింగిలో చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ను చిత్రహింసలు పెట్టి చంపితే బయటకు చెప్పొద్దని సాత్విక్ దోస్తులను భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నరని నాకు తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే ఆ కాలేజీకి వచ్చి ఆ నిర్వాహకులను గుంజకొచ్చి మావాళ్లు తంతరు. మా యువ మోర్చా నేతలు రడీగా ఉన్నరు..సాత్విక్ దోస్తులెవరూ భయపడకండి. మేం మీకు అండగా ఉంటాం.

• రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా ఈరోజు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. 6వ తేదీన కూడా కార్యక్రమం తీసుకుంటున్నం.

• బీజేపీ-బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం పెద్ద జోక్. బీఆర్ఎస్ -కాంగ్రెస్ ఒక్కటేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే ఢిల్లీ వేదికగా స్వయంగా చెప్పిండు కదా. ఎన్నికల తరువాత అధికారం పంచుకుందామని ఆ రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ కుదిరిందని కూడా చెప్పిండు. టీఆర్ఎస్- కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజిస్టు కూడా ఒక్కరే కదా. అయినా ప్రజలను దారి మళ్లించేందుకు బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని ప్రజలు కూడా భావిస్తున్నరు.

• బీజేపీ అంతు చూస్తామని ఒవైసీ చెప్పడం హాస్యాస్పదం. ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ. సీఎం విసిరే ఎంగిలి బతుకులకు ఆశపడే పార్టీ. ఒవైసీ బ్రదర్స్ నిజంగా మనుషులైతే.. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగడం లేదని అనుకుంటే… దమ్ముంటే తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయాలి. డిపాజిట్లు రాకుండా చేసి చూపిస్తాం..

• ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ వస్తే… పాకిస్తాన్ జిందాబాద్ అని పొగిడేటోళ్లు. ఇక్కడి తిండితిని పరాయి పార్టీ మీది. 15 నిమిషాలు టైమిస్తే నరికి చంపుతానన్న పార్టీ. అధికారంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు కొమ్ముకాసే పార్టీ. వాళ్లా మాకు సవాల్ విసిరేది?పాతబస్తీ ఇప్పటికీ ఎందుకు అభివ్రుద్ధి కావడం లేదు? పాతబస్తీలో తీవ్రవాదులకు షెల్టర్ ఎందుకు ఇస్తున్నరు?

• ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నరు. ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ఉండొద్దా? ఎక్కడో విదేశాల్లో ఉంటూ తలాఖ్ తలాఖ్ లని మూడుసార్లు అంటే విడాకులిస్తే ఆ మహిళల బతుకేం కావాలి? ఇవన్నీ సర్వే చేసిన తరువాతే ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేసినం.

• మాకోసం మోదీగారు ఆలోచిస్తున్నారని ముస్లిం మహిళలంతా భావిస్తున్నారు కాబట్టే నిన్న మూడు రాష్ట్రాల్లో గెలిచాం. ఇయాళ దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.

• జిల్లాలో నేతల మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ…‘‘పార్టీలో నేత పార్టీ పెరుగుతున్నప్పుడు… అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. దీనిపై పెద్దగా మాట్లాడాల్సిందేమీ లేదు. గెలిచే అభ్యర్ధి ఎవరు? కష్టపడి పనిచేస్తున్నదెవరనే అంశంపై జాతీయ నాయకత్వం సర్వేలు చేయిస్తుంది. గెలిచే వాళ్లకు టిక్కెట్లిస్తారు? అందరూ శిరసావహించాల్సిందే. దీనిగురించి బాధపడాల్సిన అవసరం లేదు.’’అని సంజయ్ బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X