ఆటోడ్రైవర్ల మహా ధర్నా పోస్టర్ ను సోమవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ ఆఫీస్ లో ఆవిష్కరించారు
హైదరాబాద్ : ఆటోడ్రైవర్లకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ (టీఆర్ టీయూ) ఆధ్వర్యంలో ఈనెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యే మహా ధర్నా పోస్టర్ ను సోమవారం పార్టీ ముఖ్య నాయకులు బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీస్ లో ఆవిష్కరించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసేలా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధర్నాకు పిలుపునిచ్చామని టీఆర్ఎస్ నాయకులు ఎల్. రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మహాధర్నాకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేస్తోందని టీఆర్ఎస్ నేత రూప్ సింగ్ విమర్శించారు. ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి పడిందని, ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల సాయం చేస్తామని మాట ఇచ్చి దానిని నిలబెట్టుకోకపోవడంతో వారి జీవితాలు మరింత దుర్భరం అయ్యాయని అన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద ఎలక్ట్రిక్ ఆటోలు ప్రవేశ పెట్టాలన్న నిర్ణయాన్ని రేవంత్ ప్రభుత్వం ఏ యూనియన్ తో ఏ ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కారణంగా ఆటో డ్రైవర్లకు గిరాకీ లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అండగా ఉంటారని చెప్పారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేస్తారా అని టీఆర్ఎస్ నేత ఇస్మాయిల్ ప్రశ్నించారు. ఇది కార్మికుల జీవితాలను బుగ్గి పాలు చేసే ఆనాలోచిత నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాటి నుంచి ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ కారణంగా 3 వందల మంది ఆటోడ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారన్నారు. వారికి ఇస్తామన్న 12 వేల రూపాయలు ఇవ్వకపోగా, ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. అది చాలదన్నట్లుగా మళ్లీ వాళ్ల జీవితాలను ఆగం చేసేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే కార్యక్రమం తెచ్చారా అని ఇస్మాయిల్ ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో సంఘాలు, ఆటో యూనియన్ల నాయకులు పాల్గొనాలని కోరారు.
