“మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఇళ్లు కూల్చితే సహించేది లేదు”

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే పనిగా పెట్టుకుందని, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను మాక్ పార్లమెంట్ పేరిట హేళన చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు శాంతికుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓ. ఎస్. రెడ్డి తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువతలో భవిష్యత్ నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విద్యాసంస్థల్లో మాక్ అసెంబ్లీలు, పార్లమెంట్లు నిర్వహించడం సంప్రదాయమని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టును అవహేళన చేస్తూ రిటైర్డ్ జడ్జీలతో పిటిషన్లు తీసుకుంటూ ‘కంగారూ కోర్టు’ తరహా విచారణలు నడిపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.

2010లో వేతనాల పెంపు కోసం లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్ లోపలే మాక్ పార్లమెంట్ నిర్వహించినప్పుడు.. అప్పటి స్పీకర్ మీరా కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఒక పవిత్ర ప్రజాస్వామ్య దేవాలయమని హెచ్చరించారని, స్వయంగా సోనియా గాంధీ సైతం దానిని “ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ” (ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే) అని తీవ్రంగా తప్పుబట్టారని గుర్తుచేశారు. నాడు అలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, నేడు అదే తరహాలో మాక్ పార్లమెంట్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ద్వంద్వ నీతిని, అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ ఒక ప్రహసనంగా మారిందని రాంచందర్ రావు విమర్శించారు. ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోయే బాధితులను, నిర్వాసితులను పిలవకుండా పబ్లిక్ హియరింగ్ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పరిధిలోని మధు పార్క్ ప్రాంతంలో ఎంతో మంది మాజీ సైనికులు (ఎక్స్-సర్వీస్‌మెన్) నివసిస్తున్నారని, అక్టోబర్ 28న హిమాయత్‌సాగర్ సమీపంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన సమావేశంలోకి అసలైన బాధితులను అనుమతించకపోవడం దారుణమన్నారు. మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లు కూల్చడం, రైతులను నిర్వాసితులను చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇళ్లను కూల్చకుండానే శాస్త్రీయంగా ప్రక్షాళన పనులు చేపట్టవచ్చని తేల్చిచెప్పారు.

Also Read-

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ కార్పొరేషన్‌కు రూ. 750 కోట్ల అంచనా వ్యయం చూపించి చివరకు రూ. 3 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అంచనాలు చెబుతూ స్పష్టమైన డీపీఆర్, బడ్జెట్ కేటాయింపులు చూపకుండా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ, పింఛన్లకు, రైతులకు ఇచ్చేందుకే నిధులు లేవంటున్న ప్రభుత్వం.. బాధితులకు ఎలాంటి నష్టపరిహారం, సరైన పునరావాసం కల్పించకుండా ఇళ్లు కూల్చేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బాధితులతో నేరుగా ప్రజాదర్బార్ నిర్వహించి, వారి సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని, నిర్వాసితులకు అండగా బీజేపీ నిలబడుతుందని స్పష్టం చేశారు.

నవంబర్ 2వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం 3:00 గంటలకు బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి మొజాంజాహి మార్కెట్ చౌరస్తా వరకు చారిత్రక “మహా పాదయాత్ర” కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, న్యాయవాదులు, వైద్యులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారని, అనంతరం మొజాంజాహి చౌరస్తా వద్ద జరిగే సభలో అమిత్ షా ప్రసంగిస్తారని వివరించారు. ఈ పాదయాత్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లో మేధావుల సదస్సులు, యూనివర్సిటీ విద్యార్థుల అవగాహన సదస్సులు, జిల్లా కేంద్రాల్లో ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 500 పాదయాత్రల కార్యాచరణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి సతీష్ జార్కిహోళి స్వయంగా తమ రాష్ట్రంలో ఎస్ఎస్ఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగిందని నిన్ననే బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవైపు వారి సొంత మంత్రే ప్రక్రియను సమర్థిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పులపై అభ్యంతరాలు ఉంటే ఈఆర్వోల వద్ద పరిశీలించుకునే అవకాశం ఉందని, రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) క్షేత్రస్థాయిలో ఉన్న ఓట్లను పరిశీలించి ఫార్మ్-7 ద్వారా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు తెలపడం చట్టబద్ధమైన బాధ్యతని, దానిని రాజకీయం చేయడం తగదన్నారు.

మహారాష్ట్ర, యూపీ ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. వారణాసి ఉపాధ్యాయ నియోజకవర్గంలో కేవలం ఒక జిల్లా మాత్రమే కాకుండా దాదాపు ఎనిమిది జిల్లాలు ఉంటాయని, అది మొదటి నుంచీ బీజేపీ సిట్టింగ్ సీటు కాదని, 2014 కంటే ముందు నుంచి మొన్నటి వరకు సమాజ్‌వాదీ పార్టీయే అక్కడ ప్రాతినిధ్యం వహించిందని స్పష్టం చేశారు. అలాగే నాగ్‌పూర్‌లోనూ గతంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించిన స్థానమేనని వివరించారు. అక్కడ గతంలో కంటే వారి ఓట్ల శాతమే తగ్గిందని, ఏదో ఘనవిజయం సాధించినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలకడం విడ్డూరమన్నారు. మొత్తం 23 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాలు గెలుచుకుందని, బ్యాలెట్ పేపర్లలోనూ బీజేపీదే పైచేయి అని నిరూపితమైందని తెలిపారు. ఈవీఎంలపై అక్కసు వెళ్లగక్కే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ముందుగా ఈవీఎంల ద్వారా గెలిచిన తమ పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.

ఇండీ కూటమి ర్యాలీ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించలేదని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను రాంచందర్ రావు గారు తీవ్రంగా కొట్టిపారేశారు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ప్రత్యేక రైళ్ల బుకింగ్ ప్రక్రియ నెలల ముందుగా జరగాలని, నిర్ణీత రుసుము చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దసరా, దీపావళి నుంచి ఉత్తరాదిలో జరిగే ఛట్ పూజ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే దాదాపు 1000 ప్రత్యేక రైళ్లను నడుపుతోందన్నారు. చివరి నిమిషంలో నిబంధనలకు విరుద్ధంగా వచ్చి అడిగితే రైళ్లు ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బద్నాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, నిబంధనలు పాటించకుండా తమ వైఫల్యాలను రైల్వే శాఖపై నెట్టడం క్షమించరాని చర్య అని ఆయన తేల్చిచెప్పారు.

ఈ మీడియా సమావేశం అనంతరం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ప్రజలతో విస్తృత సంబంధాలు కలిగిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హన్మంతరావు తో పాటు పలువురు ఇంజినీర్లు, రిటైర్డ్ అధికారులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోదీ సుపరిపాలన, దేశాభివృద్ధి విధానాలకు ఆకర్షితులై సమాజంలోని విద్యావంతులు, అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆర్ అండ్ బీ) కస్తూరి లక్ష్మీవెంకటరమణ, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ మాణిక్యం గుప్తా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సి.హెచ్. రమేశ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ మేనేజర్ వెంకటేశం గుప్తా, పబ్లిక్ హెల్త్ రిటైర్డ్ సూపరింటెండెంట్ పడిగల నాగనాథ్ గుప్తా, మాజీ వైశ్య సంఘం అధ్యక్షుడు-వ్యాపారవేత్త భూమలింగం గుప్తా తో పాటు రిటైర్డ్ ఉద్యోగులు నీలా లక్ష్మణ్, బైరయ్య, ఎర్ర లక్ష్మీనారాయణ, సివిల్ ఇంజినీర్ గణేష్ గుప్తా, ప్రదీప్, జె.నవీన్, అంజయ్య గుప్తా తదితరులు పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar