“కొంగరఖుర్దు(ఏ)లో కాంగ్రెస్, బీఆర్ఎస్ భూ మాఫియా”

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొంగరఖుర్దు (ఏ) గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన 580 ఎకరాల భూములు కొళ్లగొడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కొంగరఖుర్దు (ఏ) గ్రామానికి చెందిన భూబాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూములు ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిలిపి వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్గనైజ్డ్ గా భూ మాఫియా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతోందని తెలిపారు.

కొంగరఖుర్దు గ్రామంలోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న భూముల్లో 580 ఎకరాలను వక్ఫ్ భూమిగా 2007లో నోటిఫై చేసి నిషేధిత జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. ఆ భూములను అప్పటికే పలువురు రైతులు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న 580 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు భూ మాఫియా చెరలోకి వెళ్లిపోయిందని చెప్పారు.

2022 నుంచి కొంగరఖుర్దులోని వక్ఫ్ భూముల్లో కబ్జాలు మొదలయ్యాయని చెప్పారు. ఒక రైతు 58 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే మూడు జేసీబీలతో పంటను ధ్వంసం చేసి లే ఔట్ వేశారని తెలిపారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎంత దౌర్జన్యంగా మాఫియా రాజ్యం కొనసాగుతుందో కొంగరఖుర్దులో అంతే దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కుంటున్నారని తెలిపారు. భూ మాఫియా ఆగడాలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదని తెలిపారు. కొంగరఖుర్దు గ్రామంతో సంబంధం లేని వారి పేర్లతో ఓఆర్సీలు సృష్టించి వాటితో కోర్టుల్లో కేసులు వేసి అనుకూలంగా జడ్జిమెంట్ లు తెచ్చుకొని రిజిస్ట్రేషన్ లు చేయించుకుంటున్నారని తెలిపారు. నర్సమ్మ అనే మహిళా రైతుకు చెందిన భూమిని లక్ష్మీ అనే మహిళా పేరుతో ఓఆర్సీ తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇలాంటి అక్రమాలు ఎన్నో కొంగరఖుర్దులో జరిగాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయని తాను చెప్పిన దానికి ఈ కొంగరఖుర్దు భూములు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయని అన్నారు.

Also Read-

కొంగరఖుర్దులోని వక్ఫ్ భూముల్లో అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ అనే సంస్థలు ఇక్కడ భారీ వెంచర్లు వేశాయని తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూముల్లో లే ఔట్ పర్మిషన్ ఎలా ఇచ్చారని హెచ్ఎండీఏ కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ రోజు కూడా కొంగరకుర్దు భూముల్లో నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డు లే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు, వక్ఫ్ బోర్డుకు మధ్య కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతుంది.. కోర్టు తీర్పు వస్తే అది వక్ఫ్ బోర్డుదా, రైతులదా అనేది తేలుతుందన్నారు.

కొంగరఖుర్దులోని కబ్జా భూముల్లో వెంచర్లు వేసింది ఒక బీఆర్ఎస్ నేత అయితే ఆయన వెనుక మరో ముఖ్య నేత ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన భూమిని కొట్టేస్తున్నారు.. బందిపోటు దొంగలు కూడా ఇలా పగటి పూట దొంగతనం చేయరని అన్నారు. ఈ భూ కబ్జాలపై నమస్తే తెలంగాణ లో ఒక్క రోజు, సాక్షి పేపర్ లో ఒక రోజు కథనాలు ప్రచురితం అయ్యాయని, ఆ తర్వాత ఒక్క ముక్క వార్త కూడా ఆ పత్రికల్లో రాలేదని తెలిపారు. దాని వెనుక బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఉన్నారని తెలిపారు.

‘‘సాక్షిలో మాఫియాకు వ్యతిరేకంగా ముందు రోజు ఆర్టికల్ వచ్చింది.. ఆ తెల్లారే రైతులకు వ్యతిరేకంగా స్టోరీ రాసిండ్రు.. నేను ఈ మధ్య తెలుసుకున్న రామన్న – జగనన్న దోస్తులు అయ్యిండ్రని.. అందుకే ముందు రోజు భూ మాఫియాకు వ్యతిరేకంగా వార్త వస్తే.. తెల్లారే దాన్ని రైతులకు వ్యతిరేకంగా మార్చిండ్రు .. అంటే దీని వెనుక ఏ శక్తులు ఉన్నయి?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ దీనికి సమాధానం చెప్పి తీరాలన్నారు.

కొంగరఖుర్దు భూముల విషయంలో తన సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ డాక్యుమెంట్లు యాక్సెప్ట్ చేయొద్దని బాలమయా దేవి అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రెండు సంస్థలు ఇకపై ఒక్క గజం భూమిలో వెంచర్ ఎక్స్ పాండ్ చేసినా రంగారెడ్డి కలెక్టర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar