“పేదల కోసం భూలక్ష్మి పథకం, మేము అధికారంలోకి రాగానే ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తాం”

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమం జరగాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి భూ లక్ష్మి అనే పథకాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆమె చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామన్నారు. బంజరాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాకూడదని దాని ద్వారా విప్లవాత్మక గుణాత్మక మార్పు రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ మార్పు కోసం తెలంగాణలో మేధావులంతా ఆలోచించి తమతో కలిసి రావాలన్నారు.

ఈ నెల 6న తాము నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని తాము చెప్పామని…ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. 31 నెలలుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడని ముఖ్యమంత్రి ఇప్పుడు సామాజిక న్యాయం రాగం ఎత్తుకున్నారన్నారు. కానీ ఆయన చెప్పేది సామాజిక న్యాయం, చేసేది ఆటవిక న్యాయం అన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో బీసీలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం చేసే అవకాశం ఉన్న సరే చేయకుండా రాజకీయాల కోసం మాత్రమే ఆయన సామాజిక న్యాయం అంటున్నారని కవిత మండిపడ్డారు. ఎప్పుడో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సైతం లాక్కుంటూ ముఖ్యమంత్రి కుటుంబం తెలంగాణ భూమాత చెరబట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూదొంగలంటూ కవిత విమర్శించారు.

భూలక్ష్మి ద్వారా కుటుంబానికి ఎకరం భూమి

తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని కవిత చెప్పారు. కేవలం నినాదాల ద్వారా ఆ కల తీరదని కవిత అన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ కోసం తాము ఓ ఓ వైపు సభలు, ధర్నాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. అదే విధంగా సామాజిక న్యాయ తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటిగా చేపడతామన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ అనేది మళ్లీ భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినప్పుడే సాధ్యమవుతుందని కవిత అన్నారు. ప్రతి కుటుంబానికి భూమి కల్పించినప్పుడే వాళ్లంతా గౌరవంగా బతుకుతారన్నారు. పేదలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఆదీవాసీలకు భూమి అంటే ఎమోషన్, పంచప్రాణాలని కవిత చెప్పారు. అందుకే తమ పార్టీ తరఫున భూలక్ష్మి అనే పథకాన్ని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.

Also Read-

తాము అధికారంలోకి రాగానే ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని కవిత చెప్పారు. భూమి పంపిణీకి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధీనంలో 60 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. నిజాం ఇచ్చిన భూములు, భూదాన్ భూములు కూడా లక్షల ఎకరాల్లో ఉన్నాయన్నారు. భూదాన్ భూములకు సంబంధించి లక్ష ఎకరాలు లెక్కలేకుండా పోయాయని వాటిని పేదలకు ఇచ్చి ఉంటే ఎంతో మేలు జరిగేదని కవిత చెప్పారు. ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వానికి మనసు రావటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామన్నారు.

ముఖ్యమంత్రి కుటుంబం భూ దొంగలు

తెలంగాణ లో ముఖ్యమంత్రి కుటుంబమే భూదోపిడీకి పాల్పడుతుందని కవిత తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం (ఆర్ఆర్ఆర్) నడుస్తుందన్నారు. పేదలకు భూములు పంచాల్సిన ప్రభుత్వమే పరిశ్రమల పేరుతో వాళ్ల భూములు లాక్కుంటుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల నుంచి 30 వేల ఎకరాలు గుంజుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ, నిజాం లాంటి వాళ్లు పేదలకు భూములు ఇచ్చారని వాటికి యాజమాన్య హక్కులు ఇస్తామని ఎన్నికల సందర్భంలో మాట ఇచ్చి ఇప్పుడు వాటిని లాక్కుంటారా అని మండిపడ్డారు. పేదల భూములు గుంజుకుంటామంటే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి కుటుంబం, వారి ఏడుగురు సోదరుల గురించి దేశమంతా కథలు, కథలుగా చెప్పుకుంటారన్నారు.

తెలంగాణ భూమాత చెరబట్టి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ దోపిడీ చేస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబం భూ దొంగలు అని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా ఒకరిని గెలిపిస్తే ఇంకొందరు అధికారం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ని గెలిపిస్తే వారి ఏడుగురు అన్నదమ్ములు, శ్రీధర్ బాబును గెలిపిస్తే వాళ్ల సోదరుడు, భట్టి ని గెలిపిస్తే వాళ్ల కుటుంబం, పొంగులేటిని గెలిపిస్తే వాళ్ల కొడుకు ప్రజలపై జులుం చేస్తున్నారన్నారు. దాదాపు 2 వందల మంది ముఠా ఇలా ప్రజలపై పడి ఇబ్బందులకు గురిచేస్తుందని కవిత అన్నారు. అటు 22 ఏ పేరుతో భూ దోపిడీకి ప్రభుత్వం రాచమార్గం ఏర్పాటు చేసుకుంటుందని కవిత విమర్శించారు. గతంలో ధరణి, ఇప్పుడు భూ భారతిని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. భూముల విషయంలో పేదలకు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదన్నారు.

చెప్పేది సామాజిక న్యాయం.. చేసేది ఆటవిక న్యాయం

ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేక వన్నె పులి అంటూ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పేది సామాజిక న్యాయం. కానీ చేసేదీ ఆటవిక న్యాయం అని కవిత అన్నారు. ఈ నెల 6 న తాము చేపట్టిన సామాజిక సంకల్ప సభ కారణంగానే ముఖ్యమంత్రి నోట సామాజిక న్యాయం అనే మాట అనివార్యంగా వచ్చిందని కవిత అన్నారు. సామాజిక అన్యాయం అనాల్సింది పోయి ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అన్నాడని ఆయన మాటలను ప్రజలు నమ్మరని చెప్పారు. నిజంగా సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే 16 మంది మంత్రివర్గంలో ముగ్గురే బీసీలు మంత్రులు ఎందుకుంటారని ఆమె ప్రశ్నించారు. గత రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే బీసీల కోసం కేవలం 5 వేల 5 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కవిత చెప్పారు. బీసీల సంఖ్య ఎంత మీరు చేసిన ఖర్చు ఎంత? ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. వీహెచ్ లాంటి సీనియర్ బీసీ నాయకుడికి, శివధర్ రెడ్డి అనే ఓ అధికారికి అడ్వయిజర్ పదవులు ఇస్తే వీహెచ్ కు ఇచ్చిన ర్యాంక్, జీతం ఎందుకు తక్కువగా ఉన్నాయో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల విషయంలో కూడా అగ్రకులాలకు ఒక విధంగా, ఇతరులపై ఒక విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తే అందులో ఒక్క బీసీ కూడా లేడని కవిత చెప్పారు. ఇద్దరు మహిళలను మాత్రమే మంత్రివర్గంలో తీసుకొని విజయశాంతి లాంటి నేతకు అన్యాయం చేశారన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటే ఇదేనా అని కవిత ప్రశ్నించారు. బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించిన సంఘటనలను గుర్తు చేశారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అటు ప్రభుత్వంలో, పార్టీ లో న్యాయం చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నాడని కవిత అన్నారు. అలాంటి వ్యక్తి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. కచ్చితంగా తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పాటు పడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X