హైదరాబాద్ : సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్టేడియంలో వారం రోజులుగా కొనసాగిన “జమాయమ్మ జగ్గారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2” ఘనంగా ముగిసింది. స్థానిక యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల జగ్గారెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎన్‌జీసీసీ టీజేఆర్ సంగారెడ్డి జట్టు విజేతగా నిలిచి రూ.1 లక్ష నగదు బహుమతిని కైవసం చేసుకోగా, రన్నరప్‌గా నిలిచిన నిరంజన్–11 పటాన్‌చెరు జట్టుకు రూ.50 వేల నగదు బహుమతి అందజేశారు.
Also Read-
అదేవిధంగా టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విభాగాల్లో ప్రత్యేక నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. కౌన్సిలర్ ఫైజ్ బావజీర్ పర్యవేక్షణలో, నిర్వాహకులు సర్ఫరాజ్, అజర్, ఫహీం, యబా, ఇమ్రాన్ సమన్వయంతో పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలు క్రీడల ద్వారా అలవడతాయని ఆమె అన్నారు.
సంగారెడ్డిలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి జగ్గారెడ్డి సహకారంతో రూ.10 కోట్ల నిధులు మంజూరైనట్లు నిర్మల జగ్గారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ హఫీజ్ షేక్ షఫీ, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, నిర్వాహకులు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
