హైదరాబాద్ : గాంధీ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం దేశంలోనే గొప్ప పండగ అని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండగ అని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ చరిత్రను యువత సమగ్రంగా అధ్యయనం చేయాలని, ముఖ్యంగా నేటి జెన్-జీ తరం చరిత్రపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కుల, మతాల పేరుతో జరుగుతున్న చిచ్చు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాకారమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

పరిపాలన కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రజాస్వామ్యం పరిఢవిల్లదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేయడం సరైన విధానం కాదని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జోడో యాత్ర స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు.
ఇది కూడ చదవండి-
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని, సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాస్తవాలకు దూరంగా సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని అరికట్టాలని, యువత నిజానిజాలను తెలుసుకుని చైతన్యవంతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యులనే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ వంటి నాయకుల పాత్రను గుర్తు చేశారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశం ఆశ్చర్యపోయేలా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సిద్ధిపేట జిల్లా
80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగురవేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా పాలన ప్రభుత్వంలో అందిస్తున్న స్వచ్ఛమైన పాలనా జిల్లా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రసంగం
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, వారి కుటుంబ సభ్యులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగమే మన స్వేచ్ఛకు పునాది, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ప్రగతికి మన వంతు కృషి చేద్దాం.
ప్రజాపాలన, పారదర్శక పాలనలో స్వేచ్ఛా, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
ఈ సందర్భంలో మన జిల్లాలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను మీ ముందుంచుతున్నాను.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి, వారు సద్వినియోగం చేసుకునేలా గ్రామ స్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించడంకొరకు99 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిర్వహించడం జరిగింది.
వ్యవసాయ శాఖ జిల్లాలో అత్యధికంగా సాగు అయ్యే పంట వరి. సాధారణంగా జిల్లాలో సుమారు 1,93,500 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది.
కానీ ఎల్-నినో ప్రభావంతో వర్ష భావ పరిస్థితులు ఏర్పడి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండని విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, వరి పంటకు బదులుగా తక్కువ నీటి వినియోగం, తక్కువ కాలంలో పూర్తయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
రైతుభరోసా: రైతు భరోసా పథకంలో ప్రతి ఎకరాకు రూ.6000/- చొప్పున 3 లక్షల 25 వేల మంది రైతులకు మొత్తం రూ.1476 కోట్లు జమ చేయడం జరిగింది.
రైతుబీమా: ఇప్పటివరకు జిల్లాలో 3,104 మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ. 155 కోట్లు రైతు బీమా చెల్లించాము.
ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్నందున జిల్లా ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ
జిల్లాలో మధ్య మానేరు నుండి మల్లన్న సాగర్ జలాశయo వరకు అదనపు టి.ఎం.సి పనులు నాలుగు ప్యాకేజ్లు గా విభజించి రూ 14,402 కోట్ల తో చేపట్టడం జరిగింది. అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి.
గౌరవెల్లి జలాశయం 8.230 టి.ఎం.సి.ల సామర్థ్యంతో 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించబడగా, ప్రధాన కాలువల పనులు 56% పూర్తయ్యాయి. గౌరవెల్లి నుండి గండిపల్లి వరకు 1 టి.ఎం.సి. సామర్థ్యంతో చేపట్టిన ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్టుకు గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగినది.
ఉద్యాన శాఖ
జిల్లాలో ఇప్పటి వరకు 15,820 ఎకరాలలో 4785 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు.
2026-27 సంవత్సరానికి లక్ష్యం 4,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 1,550 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది.
300 కోట్ల రూపాయలతో నర్మేట లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకోవడం జరిగింది.
పట్టు పరిశ్రమ శాఖ
రైతులకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చేది పట్టు పరిశ్రమ. పట్టు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 2025–26 సంవత్సరంలో 10 మంది పట్టు రైతులకు పట్టు పురుగుల పెంపకపు గదుల నిర్మాణానికి సబ్సిడీ కింద రూ.3 లక్షల 77 వేలు చెల్లించడం జరిగింది.
మత్స్య శాఖ 2025–26 సంవత్సరంలో ఇప్పటివరకు సిద్ధిపేట జిల్లాలోని శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 696, రంగనాయకసాగర్‌లో 93, కొండపోచమ్మ సాగర్‌లో 186, అన్నపూర్ణసాగర్‌లో 14 చొప్పున మొత్తం 989 చేపల వేట లైసెన్సులు జారీ చేయబడ్డాయి.
పంచాయతీ శాఖ
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించబడింది.
అలాగే కిరాణా దుకాణాలు, హోటళ్ల యజమానులు ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ గ్లాసులు, ప్లేట్లు మరియు ఇతర పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించేలా చర్యలు చేపట్టడం జరిగింది.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంకులు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు స్వచ్చందంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.
గ్రామీణాభివృద్ధి సంస్థ
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా “జలసిరి” పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఇంటింటికి ఇంకుడు గుంత, పంట పంటకూ పంట కుంట (ఫారం పాండ్), ఊరు ఊరుకి ఊట కుంటల పనులు పెద్ద ఎత్తున చేపట్టుటకు ప్రత్యేక చర్యలు తీసుకుని, గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, పనులు చేపట్టుటకు ప్రజలకు మరియు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వీబీ-జీ రాంజీ ద్వారా 90 పని దినాలకు సంబంధించిన చెల్లింపులు చేయడం జరుగుతుంది.
“చేయూత” పింఛన్ పథకం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత” పింఛన్ పథకంలో భాగంగా, ఈ రోజు నుండి కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు అందించనున్నాము.
ఇందిరా మహిళా శక్తి – ఆర్టీసీ బస్సుల పంపిణీ: జిల్లాలో 23 మండల సమాఖ్యలకు మరియు జిల్లా సమాఖ్య కు 30 లక్షల చొప్పున ప్రతి మండల సమాఖ్య కు ఒక్కొ ఆర్టీసీ బస్సు చొప్పున మొత్తం 24 ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు గాను మొత్తం 6 కోట్ల 90 లక్షల రూపాయలు మండల సమాఖ్య ఖాతాలలో ప్రభుత్వం ద్వారా జమ చేయడమైనది.
అన్ని మండల సమాఖ్యలకు మరియు జిల్లా సమాఖ్యకు నెలవారి ఆదాయం కింద సుమారు రూ.70,000/- లు TGSRTC ద్వారా జమ చేయబడుచున్నాయి.
వడ్డీ లేని రుణాలు:స్వయం సహాయక సంఘాలకు మరింత ప్రోత్సాహం కోసం వడ్డీ లేని రుణం July, 2026 నుండి రూ.5.00 లక్షల నుండి రూ.10.00 లక్షలకు పెంచడం జరిగింది.
పౌర సరఫరాల శాఖ
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 2025 ఏప్రిల్ నెల నుండి రేషన్ కార్డు దారులకు ప్రతి నెల 6,652 మెట్రిక్ టన్నుల ఉచిత సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.
ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ నీ ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి సభలో ప్రారంభిస్తారు..
రాష్ట్ర వ్యాప్తంగా 2025 జనవరి నుండి ఇప్పటి వరకు లబ్ధిదారులకు 62 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది..
జనవరి 2025 నుండి ఇప్పటివరకు 48,838 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబడ్డాయి.
రబీ 2025–26 సీజన్‌లో జిల్లాలో 5,18,036 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 1,17,683 మంది రైతుల నుండి కొనుగోలు చేయబడి, రైతులకు రూ.1,228 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించబడింది. గత రబీ సీజన్‌తో పోలిస్తే 1,36,619 మెట్రిక్ టన్నుల (38.81%) అధికంగా వరి కొనుగోలు చేయబడింది.
రహదారులు మరియు భవనముల శాఖ
ప్రణాళిక పనులు: జిల్లాలో రూ.670.23 కోట్లతో 158.45 కి.మీ.ల మేర 13 రోడ్ల పనులు, రూ.6.15 కోట్లతో ఒక వంతెన నిర్మాణ పనులు చేపట్టాము.
రూ.8.60 కోట్లతో హుస్నాబాద్ లో రవాణాశాఖ కార్యాలయము మరియు డ్రైవింగ్ ట్రాక్ నిర్మాణ దశలో ఉంది.
పరిశ్రమల శాఖ
జిల్లాలో ఇప్పటివరకు 646 సూక్ష్మ, చిన్న మరియు సేవా రంగ పరిశ్రమలు రూ.290.80 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి, 19,688 మందికి ఉపాధి కల్పించాయి.
వైద్య మరియు ఆరోగ్య శాఖ
ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి, ఆరోగ్యబీమా కవరేజీని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అదనంగా 163 కొత్త వ్యాధులను చేర్చి మొత్తం1,835 వ్యాధులకు పథకం వర్తించేలా చేసింది.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ
బి.సి. అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.38 లక్షల డైట్ చార్జీలు, సెప్టెంబర్ 2026 వరకు రూ.17 లక్షల రూపాయల కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయడం జరిగింది.
జిల్లాలోని 1,590 మంది కల్లు గీత వృత్తిదారులకు కాటమయ్య రక్షక కవచాల వినియోగంపై శిక్షణ ఇచ్చి, 1,590 రక్షక కవచాలను పంపిణీ చేశాము.
బిసి మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచడానికి 100 శాతం సబ్సిడీతో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్లు పంపిణీ పథకాన్ని ఇటీవల ప్రారంభించుకోవడం జరిగింది.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ
2025–26 సంవత్సరంలో జిల్లాలో 6 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో 176 మంది విద్యార్థులు ఉన్నారు. డే స్కాలర్ విద్యార్థికి రూ.28,000/-, రెసిడెన్షియల్ విద్యార్థికి రూ.42,000 చొప్పున మొత్తం రూ.1 కోటి 90 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
2025–26 సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్న 155 జంటలు నమోదు కాగా, అందులో 66 జంటలకు ఆర్థిక సహాయం విడుదల చేయడం జరిగింది.
విద్యార్థులకు ఫీజు రీయెంబర్స్మెంట్ బకాయిలు లేకుండా సంవత్సరానికి 2300 కోట్లు ముందే విద్యార్థుల ఖాతాలో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు..
మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ
జిల్లాలోని 1,150 అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా 5,817 మంది గర్భిణులు మరియు 4,058 మంది బాలింతలకు ప్రతిరోజూ ఒకపూట సంపూర్ణ భోజనం అందించడంతో పాటు చిన్నారులకు ప్రీప్రైమరి విద్య మరియు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది.
2025-2026 లో 115 మందికి దివ్యాంగ ఉపకరణాలు పంపిణీ చేయబడ్డాయి. 34 మంది దివ్యాంగులకు పూర్తి సబ్సిడీతో రూ.19 లక్షల రుణాలు మంజూరు చేయబడ్డాయి.
చేనేత మరియు జౌళి శాఖ
ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కొరకు ప్రవేశ పెట్టిన “చేనేత అభయహస్తం పథకం” లో భాగంగా అమలు చేస్తున్న నేతన్న పొదుపు పథకం ద్వారా జిల్లాలోని 551 మంది చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికులు ఇప్పటివరకు రూ. 55.68 లక్షలు తమ వంతుగా RD-1 ఖాతాలలో జమ చేయ గా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.26.64 లక్షలను RD-2 ఖాతాలలో జమ చేయడం జరిగింది.
సిద్దిపేట పురపాలక సంఘం
సిద్దిపేటలో రూ.6 కోట్ల 29 లక్షల రూపాయల నిధులతో పట్టణంలోని నర్సాపూర్, ఎర్ర చెరువు వద్ద భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణం, రూ.2 కోట్ల 50 లక్షల నిధులతో జంక్షన్ డెవలప్‌మెంట్, లేక్ రిజువెనేషన్ మరియు పార్కుల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.
జల్ హి అమృత్ పథకంలో భాగంగారూ.2 కోట్ల 75 లక్షల నిధులలో నర్సాపూర్ STP వద్ద మరియు చింతల్ చెరువు STP వద్ద సోలార్ సిస్టం ఏర్పాటు చేయనైనది.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం
పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి రూపాయలతో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జంక్షన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
15వ ఆర్థిక సంఘం నిధులు 2024–25 కింద గజ్వేల్‌లోని R&R కాలనీలో రూ.143.00 లక్షలతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
హుస్నాబాద్ పురపాలక సంఘం
పట్టణంలోరూ.18 కోట్లతో ఎల్లమ్మ చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్‌గా సుందరీకరించేందుకు పనులు చేపట్టడం జరిగింది.
పట్టణ అభివృద్ధి కోసం మంజూరైన రూ.10.00 కోట్లు నిధులతో సెంట్రల్ మీడియన్ మరియు అవెన్యూ ప్లాంటేషన్, మల్లె చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ డివైడర్ మరియు లైటింగ్ ఏర్పాటు, పల్లె చెరువు సుందరీకరణ, వెల్‌కమ్ ఆర్చ్‌లు మరియు జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేపట్టడం జరుగుతోంది.
పట్టణాభివృద్ధి గ్రాంటు రూ.4 కోట్ల తో షాపింగ్ కాంప్లెక్స్‌లు, రూ.2 కోట్లతో మినీ స్టేడియం వద్ద పార్క్, రూ.1 కోటి తో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కనీస వసతులు, రూ.4 కోట్ల 70 లక్షలతో స్టార్మ్ వాటర్ డ్రైన్లు, రూ.3కోట్ల 30 లక్షలతో సి.సి. రోడ్లు మరియు సి.సి. డ్రైన్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ చేపట్టడం జరిగింది.
దుబ్బాక పురపాలక సంఘం
దుబ్బాక పురపాలక సంఘమునకు నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.15 కోట్లు మంజూరు కాగా 2BHK కాలనీ వద్ద వీధి దీపాల ఏర్పాటు, మురుగు కాలువల నిర్మాణం, పాఠశాల అభివృద్ధి, చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి వంటి పనులు చేపట్టడం జరుగుతుంది.
చేర్యాల పురపాలక సంఘం
పట్టణంలో వివిధ వార్డుల్లో రూ.10 కోట్ల వ్యయంతో సి.సి. రోడ్ల నిర్మాణ పనులు మరియు రూ.3 కోట్ల వ్యయంతో సి.సి. డ్రైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్ టెండర్ ప్రక్రియ పూర్తయి, పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మెప్మా
జిల్లాలో మెప్మా ద్వారా జిల్లాలోని 5 మునిసిపాలిటీలలో అర్హత గల మహిళా సంఘాలకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.126.84 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు రూ.26.95 కోట్ల రుణాలు మంజూరు చేసి అందించడం జరిగింది.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది..
ప్రొహిబిషన్ &ఎక్సైజ్ శాఖ
వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2026 సంవత్సరంలో 17,700 ఈత మరియు ఖజురా మొక్కలు నాటి, గౌడ సంఘాలకు, T.F.T లైసెన్స్ దారులకు మొక్కల రక్షణ, పెంపకం బాధ్యతలను అప్పగించడం జరిగింది.
జిల్లాలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఈ సంవత్సరoలో ఇప్పటి వరకు విద్యా సంస్థలు, గ్రామాలలో మొత్తం 110 అవగాహన కార్యక్రమాలు నిర్వహిoచడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా జిల్లాలో ఇప్పటివరకు 11,839 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 10,754 ఇండ్లు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు రూ.255.20 కోట్ల నిధులు చెల్లించడం జరిగింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండవ దశలో 2000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 709 గుడిసెలలో ఉన్న లబ్ధిదారులను గుర్తించి ఉన్నత స్థాయి అధికారుల పరిశీలన నిమిత్తం పంపడమైనది.
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL)
జిల్లాలో మొత్తం 6,08,580 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. గృహ జ్యోతి పథకం కింద ఇప్పటివరకు 2,06,044 మంది గృహ విద్యుత్ వినియోగదారులు లబ్ధి పొందారు. వీరికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.181 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది.
భూగర్బ జల శాఖ
ఎల్-నినో ప్రభావంతో జిల్లాలో భూగర్భ జల మట్టాలు తగ్గుతున్నాయి. జూలై–2026 కు జిల్లా సగటు భూగర్భ జల మట్టం 12.97 మీటర్లుగా నమోదవడం జరిగింది. ఇది జూలై–2025తో పోలిస్తే 0.89 మీటర్లు తగ్గడం జరిగింది.
ఎల్-నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం ప్రతి 15 రోజులకు ఒకసారి భూగర్భ జలాల నివేదిక సమర్పించడం జరుగుతోంది.
మహాలక్ష్మి పథకం (RTC)
జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక డిపోలు ప్రతిరోజూ సుమారు 1.22 లక్షల కిలోమీటర్లు బస్సులను నడుపుతూ సుమారు 1.31 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, రోజుకు సుమారు రూ. 60.17 లక్షల ఆదాయాన్ని చేకూరుస్తున్నాయి.
మహాలక్ష్మి పథకం ద్వారా 15-12-2023 నుండి 31-07-2026 వరకు మన జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, హుస్నాబాద్ & దుబ్బాక డిపోల ద్వారా 9 కోట్ల 93 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ. 386 కోట్ల రూపాయలను ఆదా చేసుకోవడం జరిగింది.
ఉపాధి మరియు శిక్షణ శాఖ
జిల్లాలో ఉపాధి కల్పన శాఖ తరపున మెగా జాబ్ మేళా మరియు టామ్ కామ్ అవగాహన సదస్సులు సిద్దిపేట మరియు హుస్నాబాద్ లలో నిర్వహించి మొత్తం 70 మందికి ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశం కల్పించబడింది.
టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి కల్పించుట కొరకు అవగాహన సదస్సులు నిర్వహించి, 626 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది..సుదీర్ఘ కాలం తర్వాత ప్రజా ప్రభుత్వంలో 600 కి పైగా గ్రూప్ 1 ఉద్యోగాలు ,గ్రూప్ 2 ,3 భర్తీ చేసింది
తాజాగా si కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.. వారి వయసు పరిమితి రెండు సంవత్సరాలు పెంచుతూ నిన్ననే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది..
యువత నైపుణ్య అభివృద్ధి, శిక్షణ ,ఉద్యోగ కల్పన పెంచడానికి నియోజకవర్గానికి ఒక ఏటిసి మంజూరు చేయడం జరిగింది..
స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం..ఫూలే, అంబేద్కర్ లాంటి వాళ్ళు అస్పృశ్యత నివారణ కోసం అనేక ఉద్యమాలు చేశారు టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో కూడా అంటరానితనం కొనసాగుతుంది..స్వయంగా రాజ్యసభ సభ్యులు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించిన సభ ను శుద్ధి చేయడం హేయమైన చర్య..
జిల్లా అభివృద్ది లో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ది పథంలో మరింత ముందుకు తీసుకెళ్లుటకు మరోసారి పునరంకితం అవుదామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాను.
