63వ జాతీయ ఫార్మసీ సప్తాహం-ఆరోగ్యానికి ఫార్మసీ
17 – 23 నవంబర్ 2024
ఆరోగ్యానికి ఫార్మసీ
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనా అందరికి అందుబాటులో ఉండే ప్రదేశం ఫార్మసీ. అక్కడ ఔషధాలతో పాటు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు కీలకం అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆరోగ్య పురోగతిలో ఫార్మసిస్ట్ ల సాంద్రతను ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగిస్తుంది ఐక్యరాజ్య సమితి. 2018లో కజకస్తాన్ లో జరిగిన వరల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అలయెన్స్ మహాసభలో సార్వత్రిక ఆరోగ్య సంసాధనకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయటమే ముఖ్యమని తీర్మానించింది. ఈ ప్రకటనను “ఆస్తాన డిక్లరేషన్” అంటరు.
ఇందులో సభ్య సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ (ఎఫ్ ఐ పి) ఈ దిశగా ఫార్మసిస్ట్ లను మరింత చైతన్యం చేస్తూ వస్తున్నది. దీనిలో భాగంగా 2024 మే 22 న “థింక్ హెల్త్ – థింక్ ఫార్మసీ” అని ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని చేపట్టింది. మన దేశంలో ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) ప్రతి ఏటా నవంబర్ మూడవ వారాన్ని జాతీయ ఫార్మసీ సప్తాహంగా పాటిస్తూ ఒక నినాదంతో ఫార్మసిస్ట్ ల ప్రాధాన్యతను ప్రజలకు మరింతగా తెలియ చేస్తున్నది. ఈ సంవత్సరం “థింక్ హెల్త్ – థింక్ ఫార్మసీ” అనే నినాదాన్ని ఎఫ్ ఐ పి సమ్మతితో స్వీకరించింది. ఐపిఎ దేశంలోని 17 లక్షల ఫార్మసిస్ట్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ.
ఫార్మసిస్ట్ లు అధ్యాపకులుగా, పరిశోధకులుగా, ఔషధ ఉత్పాదకులుగా, ఔషధ నియంత్రణ అధికారులుగా పలు రంగాలలో కృషి చేస్తున్నరు. కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు, హాస్పిటల్ ఫార్మసిస్ట్ లు ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే వృత్తి నిపుణులు. వీరు ఫిసిషియన్ లు, డెంటిస్ట్ లు, వెటరినేరియన్ లు, నర్స్ లతో బృందంగా కాని, విడిగా కాని సేవలు అందిస్తరు.
Also Read-
హాస్పిటల్ లలో మన ఫార్మసిస్ట్ లు ఔషధ వితరణ సహా బహుముఖీన సేవలు అందిస్తున్నరు. చికిత్సలో ఔషధమే ఆయువు పట్టు. కానీ, ఔషధ నిపుణులైన వారికి వ్యవస్థలో అధికారుల పరంగా సరియైన గుర్తింపు లేదు. అణచివేతకు గురై తున్నరు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఆరోగ్య రక్షణ వ్యవస్థలో ఫార్మసిస్ట్ ల పాత్రను మరింత విస్తృత పరచాలని సూచించింది. మన హెల్త్ ఎకనామిస్ట్ లు మాత్రం ఫార్మసిస్ట్ ల పాత్రను న్యూనతరం చేస్తున్నరు. డి ఫార్మ్, బి ఫార్మ్, ఫార్మ్ డి వంటి ఉన్నత చదువులు చదివిన ఫార్మసిస్ట్ లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
2024 జూన్ లో హైదరాబాద్ లో ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫార్మాబాద్ గా పేరు పొందింది. అటువంటి తెలంగాణలో ఫార్మసిస్ట్ ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజ్ లలో, జిల్లా వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ లు వెంటనే నెలకొల్పాలె. ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ల విధి విధాన నిర్వహణకు ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలె. కమ్యూనిటీ ఫార్మసీ రంగంలో స్వయం ఉపాధి కోసం ఫార్మసిస్ట్ లకు రుణ సౌకర్యం, రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలె.
ఫార్మసీ అంటే మందుల కొట్టు, ఫార్మసిస్ట్ అంటే మందులు ఇచ్చే వ్యక్తి అనే పరిమిత అభిప్రాయం ప్రజలలో ఉన్నది. వివేచనాయుత ఔషధ మరియు ఆంటీ మైక్రోబియల్ వినియోగం గురించి వినియోగదారులకు తెలుపుతరు. ఫార్మసిస్ట్ లు కూడా మందుల పంపిణీ వరకు పరిమితం కాకుండా ఫార్మసీ ప్రాక్టీస్, సోషల్ ఫార్మసీ రంగాలలో చొచ్చుకొని పోయి ప్రజలకు మరింత చేరువ కావలె. ప్రాథమిక చికిత్స, దీర్ఘ వ్యాధుల నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్, హెల్త్ కాంప్ ల ద్వారా ఫార్మసిస్ట్ ల విజ్ఞానం, నైపుణ్యం ప్రజలకు అవగతం కాగలవు. ఆరోగ్యం అంటే ఫార్మసీ గుర్తుకు రావలసిందే!
డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211
(వ్యాసకర్త ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)