Special Article: 62వ జాతీయ ఫార్మసీ సప్తాహం, ఫార్మసిస్ట్ లతో రోగి భద్రత

చికిత్సా బృందంలో మెడికల్ ప్రాక్టిషనర్ లకు యోగ్యులైన సహచరులు ఫార్మసిస్ట్ లు. అవసరమైన ఔషధాలు సమకూర్చి, ఔషధాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించేది ఫార్మసిస్ట్ లు. ముడి ద్రవ్యాలు మొదలుకొని వితరణ వరకు ఉత్పత్తి అన్ని దశలు, నిలువ విధానం, ఔషధాల నాణ్యత, పనితనం, మోతాదు ప్రమాణం, పార్శ్వ ప్రభావాలు, పరస్పర చర్యలు వంటి అనేక విషయాలలో వారు విజ్ఞానం కలిగి ఉంటరు. ఔషధ చికిత్సలో తప్పులు దొర్లితే దుష్పరిణామాలు వాటిల్లి, రోగికి హాని జరుగవచ్చు. రోగి భద్రతయే చికిత్సా బృందానికి ప్రథమ ప్రాధాన్యత!

50 శాతం రోగులు మందులను ప్రిస్క్రిప్షన్ లో వ్రాసినట్లు వాడుకోరు. 60 శాతం మంది చెప్పిన సూచనలను తప్పుగా అర్థం చేసికొంటున్నరు. వైద్యశాలలలో 50 శాతం ఔషధ చికిత్స తప్పిదాలు – రోగులు తాము ఇంతకు ముందు వాడుతున్న మందుల వివరాలు తెలుపనందున – జరుగుతున్నయి. ప్రిస్క్రిప్షన్ ను సమీక్ష చేయటం ద్వారా 66 శాతం చికిత్సాపరమైన దోషాలు తగ్గినట్లు జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (2003) తెలిపింది. ఔషధ దుష్పరిణామాలు, ఔషధ అంతరచర్యలు గణనీయంగా తగ్గినట్లు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీ (2014) వ్రాసింది. ఔషధ చికిత్సను సమన్వయం చేసినందువల్ల వ్యత్యాసాలను 84 శాతం సవరించగలిగినట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ఫార్మసీ (2007) నివేదించింది.

ఔషధ చికిత్స నిర్వహణ వల్ల ఔషధ అనుపాలన, చికిత్సా ఫలితాలు మెరుగు పడినట్లు జర్నల్ ఆఫ్ మానేజ్డ్ కేర్ అండ్ స్పెషాలిటీ (2019) గుర్తించింది. మంత్రనం వలన ఔషధ అనుపాలన 28 శాతం పెరిగిందని జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ (2018) వెల్లడించింది. సహయోగిత్వ ఆరోగ్య రక్షణ బృందాల వల్ల ఔషధీయ తప్పిదాలు తగ్గి, చికిత్సా ఫలితాలు మెరుగు పడ్డాయని జర్నల్ ఆఫ్ ఇంటర్ ప్రొఫెషనల్ కేర్ (2013) చెప్పింది. ఇదంతా ఫార్మసిస్ట్ పరిధిలోని వ్యవహారం. రోగి భద్రత దృష్ట్యా అంతర్జాతీయంగా ఫార్మస్యూటికల్ కేర్ కు ప్రాధాన్యత పెరిగింది.

సంబంధిత వార్త:

మన దేశంలో ఆరోగ్యరంగ వ్యవస్థలు ఫార్మసిస్ట్ ల విస్తృత పరిజ్ఞానాన్ని వినియోగించు కోకుండ, ఔషధాలు సమకూర్చే వరకు పరిమితం చేస్తున్నయి. విషాదం ఏమిటంటే, అది కూడా చాలా వరకు అనర్హుల చేతిలో జరుగుతున్నది. అందువల్ల రోగులకు జరుగుతున్న నష్టం అపారం. అందుకే ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) 62 వ జాతీయ ఫార్మసీ సప్తాహం సందర్భంగా “జాయిన్ ఫార్మసిస్ట్స్ టు ఎన్స్యూర్ పేషంట్ సేఫ్టీ” అనే నినాదాన్ని ఎంపిక చేసింది.

ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ దేశంలోని ఫార్మసిస్ట్ లు అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ. ఐ పి ఎ 1939 లో ఏర్పాటు అయింది. ఫార్మసిస్ట్ ల పక్షాన ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నది, మార్గదర్శనం చేస్తున్నది. వ్యవస్థలకు అవగాహన కల్పిస్తున్నది, ప్రజలను చైతన్యం చేస్తున్నది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఫార్మా టైమ్స్ తదితర పత్రికలు ప్రచురిస్తున్నది.

ప్రభుత్వం 1940 లో డ్రగ్స్ చట్టం, 1948 లో ఫార్మసీ చట్టం తెచ్చింది. డ్రగ్స్ చట్టం ప్రకారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మసీ చట్టం ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడినయి. దేశంలో ఫార్మసిస్ట్ ల సంఖ్య చాలినంత లేనందువల్ల వృత్తి చాలా వరకు అన్యాక్రాంతం అయింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పి సి ఐ) ఫార్మసిస్ట్ ల సంఖ్య పెంచటమే పరిష్కారమని భావించింది. ఆ దిశగా కృషి చేసి సఫలీకృతం అయింది. ఫార్మసీ కళాశాలలు నెలకొల్పటానికి అనుమతులు ఇచ్చి ప్రోత్సహించింది. ఇప్పుడు పరిశ్రమకు కావలసిన బి ఫార్మ్/ ఎం ఫార్మ్ పట్టభద్రులు లభిస్తున్నరు.

కమ్యూనిటీ ఫార్మసీ (మెడికల్ షాప్స్) వైపు ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అంతగా ఆసక్తి కనపరచ నందున డి ఫార్మ్ ను కొనసాగిస్తున్నది. హాస్పిటల్ ఫార్మసీ సేవల ప్రమాణాలు పెంచటానికి ఫార్మ్ డి కోర్స్ ప్రారంభించింది. ప్రభుత్వ అధినేతలు, ఉన్నత అధికారుల అవగాహన రాహిత్యం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/నేషనల్ మెడికల్ కౌన్సిల్ అభిజాత్యం వల్ల ప్రజలు ఫార్మసిస్ట్ ల సేవలను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి దాపురించింది.

కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల సవరణ, కొన్నింటి రద్దుకు పూనుకొన్నది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సవరణ వల్ల మరింత సరళీకరణ జరిగి ఫార్మసీ వృత్తి పలుచబడింది. ఫార్మసీ చట్టం చేసి 75 ఏండ్లు అయినా సరిగా అమలుకు నోచుకోలేదు. తాజాగా దానిని రద్దు చేయటానికి నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ తెర మీదికి వచ్చింది. ఫార్మసీ విద్యావంతులలో నిరుద్యోగం సమస్యగా మారింది. ఈ దశలో ఐ పి ఎ, ఆరోగ్యరంగ నిపుణులు, ప్రభుత్వం, పౌర సమాజం పరిష్కార మార్గాలు వెతుక వలసి ఉన్నది. ముఖ్యంగా ఫార్మసిస్ట్ లు క్రియా శీలకంగా ఉండాలె.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం అన్ని వైద్య కళాశాలలు, వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పాలె. ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి ఔషధ వ్యవహారాలు అన్ని దాని పరిధిలో చేర్చాలె. ఔషధాలు ఉన్న అన్ని చోట్లా ఫార్మసిస్ట్ లను నియమించాలె. స్వయం ఉపాధి కోరుకొనే వారికి సహకరించాలె. వినియోగ దారుల సంఘాలు ఔషధ వితరణ విధిగా ఫార్మసిస్ట్ ద్వారా జరిగేటట్లు దృష్టి సారించాలె. కమ్యూనిటీ ఫార్మసీ యజమానులు అదనపు ఫార్మసిస్ట్ లను నియమించుకొని క్లయెంట్ లకు నాణ్యమైన సేవలు అందించాలె.

ఫార్మసిస్ట్ లు స్వయం ఉపాధి మార్గాలు అన్వేషించాలె. స్టార్ట్ అప్ పరిశ్రమలు పెట్టాలె. మోడల్ ఫార్మసీలు ప్రారంభించి ప్రజలకు ఔషధాల వినియోగంపై కౌన్సెలింగ్, ఆరోగ్య విద్య, వ్యాధుల గుర్తింపు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందుబాటు లోనికి తేవాలె. సోషియల్ ఫార్మసీ వైపు ఫార్మసిస్ట్ లు ఇంత వరకు రాలేదు. కెరీర్ గా ఎన్నుకొన తగిన మంచి భవిష్యత్తు ఉన్న రంగం సోషియల్ ఫార్మసీ. ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించి సోషియల్ ఫార్మసిస్ట్ లు ప్రజల మన్నన పొందగలరు. ఔషధాల ద్వారా సంపూర్ణ స్వస్థత సురక్ష సాధించాలంటే ఫార్మసిస్ట్ ల భాగస్వామ్యం తప్పనిసరి.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

(వ్యాసకర్త ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X