హైదరాబాద్: తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి (DGP B Shivadhar Reddy) తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో పనిచేసే ఉద్యోగులకు చాలా మంచి శుభవార్త చెప్పారు. పోలీసు సిబ్బందికి వారి పుట్టినరోజు, పెళ్లి రోజున ప్రత్యేక సెలవు ఇచ్చే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసులు నిరంతరం చాలా ఒత్తిడిలో పనిచేస్తున్నారని, వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారని అన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులకు ఈ సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది పోలీసు శాఖలో మరో సంక్షేమ చర్య అని వారు అభిప్రాయపడుతున్నారు.
శివధర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ ప్రజలకు పోలీసు సేవలు సులభంగా అందాలనే ఉద్దేశంతో తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలోని TGIIC భవనంలో ఫ్యూచర్ సిటీ తాత్కాలిక కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు మీర్‌ఖాన్‌పేటలో 24 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని, నిర్మాణ పనుల కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించిందని డీజీపీ తెలిపారు. త్వరలోనే దీని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
ఇది కూడ చదవండి-
కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, సాహిత్య రత్న మరియు పోలీసు అధికారి డా. కరం శంకర్ స్పందన

కుటుంబ బంధాల కంటే విధికి ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పనిచేసే పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్లి రోజున సెలవు ప్రకటించారు డీజీపీ బి. శివధర్ రెడ్డి ఐపీఎస్. దీనివల్ల పోలీసు సిబ్బంది మధ్య కుటుంబ బంధాలు బలపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు, పోలీసులకు మానసిక ఆనందం కూడా లభిస్తుంది. కుటుంబం, సమాజం, ఈ దేశ శ్రేయస్సు కోసం పోలీసుల పాత్ర చాలా కీలకం. డీజీపీ ఈ నిర్ణయం పట్ల నేను సంతోషంగా ఉన్నాను, పోలీసు సిబ్బంది అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
